యోయ్ ! యేందయ్యా ! బాలసుబ్రమన్యం ! అట్టా చెప్పా పెట్టకుండా యెళ్ళిపోయావేంది ? కరోనాని మహమ్మారి.. అంటన్నారుగా. కాస్త జాగర్తగుండాల్సిన పన్లా ? నువు పోతే యెట్టయ్యా సామి ? ఈ పిల్లకాయలు చూడు. యెట్టా దిగాలుగా వుండారో ? నువ్వు చేస్తావే ..అదేంది..... పాడుతా తీయగా... అందుట్లో పాడుదామని యెదురుచూస్తుండ్లా. ఒక్క పిల్లకాయలేందిలే.. పెద్దోళ్ళం మేం యెంత బాద పడ్డామనుకొన్నా ? రెండు మూడు రోజులు మాకు అన్నమే సయించలేదనుకో. యేందిరా ? యిట్టయిందనే ఆలోచనే.. యేందో.. మా అన్నయ్యో, మా బాబాయో, మా మేనమామో.. అట్టా మా సొంత మడిసి పోయాడన్న బాద. ఆ రోజు కార్యక్కమాలయినాక.. స్నానం చేసి.. నీ అత్మకి శాంతి కలగలాని దేవుడుకి దణ్ణం పెట్టుకొని.. యింట్లొ పొయ్ రాజేసుకున్నామయ్యా.. యెందుకట్ట చేసామో తెలీదు సామీ!
నేనంత చదువుకోలేదు కాని - ఒకటి చెప్పగలనయ్య.. నీ పాట చానా బాగుంటదయ్యా.. కాని నీ పాట కంటే నీ మాట యింకా బాగుంటది.. కాకపోతే నీ మాట కంటె నీ పాట బాగుంటదయ్యా.. యేందో యెట్టా చెప్పాలో అర్దం కావట్లా.. అవును నాకు తెలవక అడుగుతా ? యిన్ని బాసల్లో యిన్ని పాటలు యెట్టా పాడావు సామి ? యెప్పుడంటే అప్పుడు యే పాటైనా యిట్టే పాడేటోడివి. మడిసన్నోడికి అది సాద్యమంటావా? అందుకే సామి నువ్ మడిసివి కాదు.. మరేందో నాకు తెలవదు.
మన నెల్లూరుకి బలే పెరు తెచ్చావులే అటు చేసి యిటు చేసి. అయినా నువ్ నెల్లూరోడివేం దయ్యా? ఆ మద్య ఆడెవడో నువ్వు తెనాలోడివని వాట్సాప్లో పెట్టాడంట. యేమనుకోబాకలే.. మేం పిచ్చోళ్ళం. యిట్టాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. నీకు బాసేంది? కులమేంది ? మతమేంది? ప్రాంతమేంది? రాస్ట్రమేంది ? ఆయనెవరో చెప్పినట్టు నువ్వు యిస్వ నరుడువి.. యిస్వ గాయకుడివి.. యిస్వ నాయకుడివి.. పోన్లే.. మా మడుసుల్ని మన్నించు... మేం యింతకంటే ఆలోచించలేంలే. .. మొత్తానికి బలే చేసావులే సామీ ? చూద్దాం.. నిన్ను యెప్పుడు మరిచి పోతామో.. యెట్టా మరిచి పోతామో.. అయినా యెట్టా మరిచి పోతాం? నువు యెక్కడోక్కడ కనబడుతూనే వుంటావు.... వినబడుతూనే వుంటావు కదా సినిమా పాటున్నన్నాళ్ళు.. అది సాల్లే మాకు.. చివరగా.. ఒకటి మాత్రం చెబుతా సామి! నా కంత సంగీతం, సాహిత్తెం తెలీదుకాని.. నాకు తెలిసినంతమటుకు చెబుతా.. నీ అసుమంటోడు మళ్ళీ పుట్టడయ్యా.. పుట్టడు.... అంతే…కళ్ళెంబడ నీళ్ళొస్తన్నయి గాని.. యికుంటా ! ! !
మీ వూరోడందామనుకొన్నా గాని అనకూడదులే..
అందుకే
నీ చచ్చే అభిమాన్ని. నెల్లూరోణ్ణి
ఉంటా అయితే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి