20, జనవరి 2021, బుధవారం

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

7వ అధ్యాయము 

జ్ఞాన విజ్ఞాన యోగము


మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।


మనుష్యాణాం — మనుష్యులలో; సహస్రేషు — వేల మందిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; యతతి — పరిశ్రమిస్తారు; సిద్ధయే — పరిపూర్ణ సిద్ధి కొరకు; యతతామ్ — ఈ ప్రయత్నించేవారిలో; అపి — కూడా; సిద్ధానాం — పరిపూర్ణ సిద్ది సాధించినవారిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; మాం — నన్ను; వేత్తి — తెలుసుకోనును; తత్త్వతః — యదార్ధముగా.


భావము 7.3: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ది కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ది సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.


వివరణ: ఈ శ్లోకంలో 'సిద్ధి' అన్న పదం పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు ఇక్కడ చూడండి : అలౌకికమైన శక్తుల సంపాదన, పనిలో సాఫల్యము, విజయము, నిపుణత, నెరవేర్చుట, సమస్య కి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖము, మోక్షము, అసాధారణ మైన నైపుణ్యం, పరిపూర్ణత. శ్రీ కృష్ణుడు ఈ పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత కోసం వాడుతున్నాడు, ఇంకా అంటున్నాడు, "అర్జునా, అసంఖ్యాకమైన ఆత్మలలో అతి కొద్ది వాటికి మాత్రమే మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధించిన ఆ జీవాత్మలలో, నా సర్వశ్రేష్ఠమైన స్థాయిని మరియు దివ్య మహిమలను యెఱింగిన వారు చాలా అరుదు" అని.


ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, ఎందుకు భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకోనలేరు? ఇది ఎందుకంటే, దేవుని పై భక్తి లేకుండా ఆయన గురించి తెలుసుకోవటం కానీ, గ్రహించటం కానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగులు వంటి ఆధ్యాత్మిక సాధకులు, వాటితో పాటుగా భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భగవద్గీతలో, ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు పదే పదే చెప్తున్నాడు:


"ఆయన సర్వాంతర్యామి మరియు సర్వ భూతములు ఆయన యందే స్థితమై ఉన్నా సరే, ఆయన భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాడు. 8.22"


"అర్జునా, ఏ ఇతర మార్గం ద్వారా కాకుండా, కేవలం భక్తి ద్వారా మాత్రమే, నీ ముందే నిలబడి ఉన్న నేను ఎవరినో, యదార్థముగా తెలుసుకోబడుతాను. ఈ పద్దతిలో, నీవు నన్ను తెలుసుకొని, నా దివ్య దృష్టిని పొంది, నా యొక్క జ్ఞాన రహస్యాలలోనికి ప్రవేశించగలవు. " 11.54


"కేవలం ప్రేమ యుక్త మైన భక్తి ద్వారా మాత్రమే, నేను యదార్థముగా ఎవరో తెలుసుకోవచ్చు. నా వ్యక్తిత్వాన్ని భక్తి ద్వారా తెలుసుకున్న పిదప, నా దివ్య ధామానికి చేరుకుంటారు. " 18.55


ఈ విధంగా, భక్తి రహితంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటు పడే వారు భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక అనుభవపూర్వక విజ్ఞానం లభించదు.


చాలా మంది మనుష్యులలో కొద్ది మందికి మాత్రమే తాను యదార్థముగా తెలియును అని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇక తన ప్రాకృతిక (భౌతిక) మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నాడు. మొదట 'అపరా ప్రకృతి', అంటే భౌతిక శక్తి క్షేత్రము, గురించి పరిచయం చేస్తున్నాడు; ఇది నిమ్న స్థాయి శక్తి అయినా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే.

కామెంట్‌లు లేవు: