🌹అన్నమాచార్య చరితము 🌹
సర్వేశ్వరుని కృపన్ సంకల్ప మొందియు
యానాటి నుండియు యన్నమయ్య
దినమున కొకభక్తి దివ్యగీతంబుతో
పరమాత్మ శ్రీ హరిన్ ప్రస్తుతించి
యానంద పరవశం బనుభవించుచు నుండె
యత్యంతగా తన యాత్మ యందు
అన్నమాచార్యుని హరి కీర్తనంబులు
తిరుమల దాటియు తిరిగె భువిలొ
వేంకటేశుకు జరిగెడి వేడుకలను
నిగమ వేద్యుకు జరిగెడి నిత్య పూజ
శ్రీని వాసుకు జరిగెడి సేవ లన్ని
వర్ణనము జేసె పాడెను నన్నమయ్య
కొండ పైన నతడు కొండలరాయుని
యర్చనంబు జేసి యనుదినంబు
తిరిగి పయనమయ్యు తిరుమల నుండియు
తాళ్ళ పాక జేరె సతుల తోడ
అన్నమయ్యంతట హరికీర్తనంబుల
నప్పటి కప్పుడు జెప్పు చుండ
సంతోషడెందాన సహచరశిష్యులు
గ్రంధస్థపరచేరు కంఠబట్టి
కాలగర్భము నందు గలసిపోకుండగ
పదికాలముల పాటు భద్రపరచ
తదుపరి వానిని తామ్ర రేకుల పైన
చెక్కించి యుంచేరు సిద్ధముగను
యన్నమయ్య నోటి హరికీర్తంబులు
వాడ వాడ లందు వ్యాప్తి పొంది
సకల జనుల యొక్క సన్మతి గెలిచియు
నిలిచె పదకవితగ నిఖిల మందు
తదుపరన్నమయ్య ధర్మపత్నులతోడ
తీర్థయాత్ర లందు దిరుగ నెంచి
సకల దేవళముల సందర్శనము సేయ
పయనమయ్యె తాళ్లపాక నుండి
తీర్థ యాత్రలు
తొలుత తన గ్రామమందున వెలసి యున్న
చెన్నకేశవు దర్శించి సన్నుతించి
సకల సంబారముల తోడ సతుల తోడ
భక్తి మీరగ యాత్రకు పయన మయ్యె
మార్గ మధ్యమందు మహిమాన్వితంబగు
నందలూరు గ్రామ నడిమి నున్న
సౌమ్యనాధ స్వామి సన్నిధిం జేరియు
ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ
ఘనత నొంటిమిట్ట గ్రామంబు నందున్న
రఘుకుల గుణధాము రామచంద్రు
దివ్య దర్శనంబు భవ్యంబుగా పొంది
ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ
కడప నగరమందు కడు వైభవంబున
వెలసి యుండినట్టి వెంకటేశు
కన్నులార గాంచి కాన్కల నర్పించి
ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ
చనియు నన్నమయ్య చాగలమర్రికి
చెన్నకేశవుడిని సన్నుతించె
కన్నులార గాంచి కాన్కల నర్పించి
ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ
తదుప రన్నమయ్య దారిలో నెలకొన్న
వివిధ దేవళముల వేడ్క జూచి
క్షితిని నారసింహ క్షేత్రమై వర్ధిల్లు
శ్రీ యహోబిలమును జేరె కడకు
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి