🌹 *శంఖనిధి, పద్మనిధి అంటే ఎవరో తెలుసా..?* 🌹
(20.1.21)
తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులు తమ కాళ్ళను ప్రక్షాళన చేసుకుంటారు. అక్కడే శ్రీవారి ఆలయం గడపకు ఇరుప్రక్కలా కనిపిస్తాయి శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు. సాధారణంగా భక్తులు తమ కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము. కాబట్టి ఈ శంఖనిధి, పద్మనిధి విగ్రహాలను గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.
తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.
శంఖనిధి, పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి, ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం.
దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు. ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి