*ఆభరణం ఏది?!*
*ఓం శ్రీ కృష్ణ సద్గురవే నమః
*మనుషులలో కొందరికి మంచి రూపం ఉంటుంది. కొందరికి గుణం ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్పది అనే ప్రశ్న ఉదయిస్తుంది.
*రూపమా? గుణమా?.
*అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యమని కొందరు, మంచితనం ఉంటే చాలు అందరూ అతని దగ్గరకు వస్తారు అని మరి కొందరు వాదులాడుకుంటారు.
*వీటిలో ఏది ముఖ్యమో వివరించే సుభాషితం ఒకటుంది.
*నరస్యాభరణం రూపం
రూపస్యాభర ణం గుణమ్
గుణస్యాభరణం జ్ఞానమ్
జ్ఞానస్యాభరణం క్షమా
*మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.
*పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.
*అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు.
*వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగి పోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు.
*అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనులను గేలి చేయడం తగనిది.
ఇందుకు మహారాజులైనా మినహాయింపు కాదు. సామాన్యులు, గర్వాతిశయంతో తన కన్న ఏదో విధంగా తక్కువగా ఉన్న వారిని కించపరిచారంటే అది వారి మూర్ఖత్వం అని సరిపెట్టుకోవచ్చు. కాని అసామాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అని అనుకోలేం.
*అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.
*ఒక చక్రవర్తి. యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రి ఆయనకు ఆసమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు… కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
*‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు.
*అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.
*తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి ‘ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.
*పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.
*‘ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు’ అన్నాడు మంత్రి మళ్ళీ.
*పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.
*వెంటనే ఆలోచించాడు. మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్లగా ఉంచుతుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.
*ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు… మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి