22, ఏప్రిల్ 2023, శనివారం

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం

 

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం

( గోలగముడి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ )


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


             347. అమ్మకిచ్చిన మాట.


           శ్రీ వెంకయ్య స్వామివారు చిన్నప్పటి నుండి వారి అమ్మ పిచ్చమ్మతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేవారు. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు వెంకయ్య స్వామి. ఆమె ఎన్నో పూజలు చేసిన తరువాత కలిగిన సంతానం. శ్రీ స్వామివారు జన్మించినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. 1897 లో శ్రీ స్వామివారు జన్మించినట్లుగా భక్తులు అందించిన సమాచారం. ఆ రోజుల్లో కాన్పు అంటే పునర్జన్మతో సమానం. పిచ్చమ్మ ప్రసవించిన తరువాత ఆమెకు చూపు కనిపించలేదు. అందరూ ఆందోళన చెందారు. తరువాత 15 నిముషాలకు మాములుగా కనిపించింది. అవతార పురుషునికి జన్మ నిచ్చానని పాపం ఆ తల్లికి అప్పట్లో తెలియదు. శ్రీ స్వామివారు అందంగా ఉన్నారు అందరూ ఆ బాలుని రూపం చూసి ఇష్టపడే వారు. నీ కొడుకు చిన్ని కృష్ణుని లా ఉన్నాడు అని అందరూ అంటుంటే పిచ్చమ్మ మురిసిపోయేది. నిజానికి భగవంతుడు ఆయా కాలాలలో అవసరమైన సమయంలో నేను యోగినై జన్మిస్తాను అని భగవద్గీతలో చెప్పారు అందుకే నిరుపేదల కోసం నారాయణ మూర్తి జననం ఆ ఇంట అలా జరిగింది.


           తరువాత ఆమెకు ముగ్గురు సంతానం కలిగారు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల. ముగ్గురు అన్న దమ్ముల మద్య ఒక్కతే అమ్మాయి కావడంతో అందరూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె పేరు మంగమ్మ రాజపద్మా పురంలో బంధువుల అబ్బాయి కే ఇచ్చి చేశారు. శ్రీ స్వామివారు ఆ సంబంధం వద్దు అన్నారు కానీ అదే చేశారు. ఆమె దురదృష్టం ఇద్దరు పిల్లలు పుట్టగానే భర్త చనిపోయారు. శ్రీ స్వామివారు తనకు వచ్చిన ఆస్తి వాటాను ఆమెకి వ్రాసి ఇచ్చేసారు.


       శ్రీ స్వామివారు చిన్నప్పుడు వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు ఎంతో సహయం చేసేవాడు. పొలం వెళ్తే ముగ్గురు కూలీలు చేసే పని తాను ఒక్కరే చేసేవాడు. ఎవరికైనా కూలీకి వెళ్తే ఆ డబ్బులు తాను అడిగి తెచ్చుకోవడం ఉండదు. వాళ్లే మీ అబ్బాయి మా దగ్గర పని చేసాడు అని ఆ డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మ కి ఇచ్చే వారు. బాల్యంలో చదువు పై ఆసక్తి కనపరచ లేదు. ఎక్కువగా కష్టం చేసేవారు. లేదా ఒంటరిగా వెళ్లి కూర్చొని కళ్ళు మూసుకుని ఉండే వారు. ఎవరైనా వచ్చి పిలిస్తే పోలీసులు వస్తున్నారు నా దగ్గరకు రావద్దు పోండి అనే వారు.


                 ఇతని ప్రవర్తన ఏదో తేడాగా ఉందని ఇంట్లో వాళ్ళు కొట్టారు తిట్టారు అవమానించారు, చాలా బాధ పెట్టారు. నాలిక మీద బంగారు కడ్డీతో వాతలు పెట్టారు. ఏదో దెయ్యం పట్టిందని భూత వైద్యం చేయించారు. గుండు గీయించి కత్తితో గాట్లు పెట్టి నిమ్మ కాయ రసం పిండారు ఇలా రక రకాలుగా హింస పెట్టారు. ఇన్ని చిత్ర హింసలు పెట్టినా తల్లి మీద అభిమానం తో భరించారు. ఆమె నా పిల్లాడిని ఏమి అనొద్దు అని ఇంట్లో అందరికి చెప్పేది.


                ఒకరోజు శ్రీ స్వామివారిని పొలం వెళ్లి, తోటలో నీరు పెట్టమన్నారు. వెళ్లి తోటలో ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టకుండా ఏ పంట లేని పొలములో పెట్టాడు అక్కడ పారతో ఏదో కట్టలు వేస్తున్నారు. బావిలో నుండి ఇంజిన్ ద్వారా వచ్చే నీరు అంతా వృధా చేస్తున్నాడని వాళ్ళ సోదరుడు చూసి వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఆయన కోపంగా కొట్టడానికి సిద్ధ పడి ఆవేశంగా వచ్చి తోటలోకి వెళ్లి చూసాడు. తోటలో మొక్కల పాదుల నిండా నీళ్లు ఉన్నాయి. ఏమిటి ఈ చిత్రం అని ఆశ్చర్య పోయాడు. అతని దగ్గర ఏదో శక్తి ఉందని అప్పటి నుండి ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమి అనలేదు .


            తరువాత పెళ్లి ప్రయత్నం చేయాలని అందరూ బంధువులు సమావేశం అయ్యారు. శ్రీ స్వామివారు ఆ రోజు ఎటు వెళ్ళారో కనపడలేదు. అందరూ వెళ్లిన తరువాత వచ్చి తల్లితో నాకు పెళ్లి వద్దు అని చెప్పారు, ఆమె ఎంతో నచ్చచెప్పింది కానీ ఆ విషయంలో స్వామి అంగీకరించలేదు. తరువాత ఇంటికి వచ్చి పనిచేసే చాకలి వాళ్ళ బుట్ట లో అన్నం పెట్టగానే వాళ్ళు తాకక ముందే స్వామి వచ్చి చేయి పెట్టి తీసుకుని తింటున్నారని అలాగే హరిజనుల దగ్గర తింటున్నారని ఊరంతా పిర్యాదు చేసారు. అప్పట్లోకుల పట్టింపులు ఎక్కువగా ఉన్న రోజులవి. అందరూ వెంకయ్యకి పిచ్చి ఎక్కింది అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది.


       ఒక రోజు ఇంట్లో పెట్టి తలుపు వేసింది. బిడ్డను చూసి ఆకలితో ఉన్నాడని అర్థం అయింది అన్నం పెట్టింది శ్రీ స్వామివారు తింటున్నారు. ఏమైంది రా నీకు అని యశోద చిన్ని కృషుడికి చెప్పినట్లుగా ఇలా చెప్పింది. నువ్వూ ఎన్నో పూజలు చేసుకున్న తర్వాత పుట్టావు ఆ వెంకటేశ్వర స్వామివారి దయ వలన, నా కడుపున జన్మించావు. నువ్వు ఆ స్వామి వారి అనుగ్రహతో పుట్టావని వెంకటపతి అని పేరు పెట్టుకున్నాము ప్రేమగా వెంకయ్యా అని పిలుచుకుంటున్నాము. శ్రీ స్వామివారికి ఎప్పుడూ ఎంగిలి అన్నం పెట్ట కూడదు నీకు అందుకే ఎవరికి పెట్టక ముందు అన్నం తీసి పెడుతున్నాను. నువ్వు ఎప్పుడూ ఇలాగే తినాలి. తినేదాన్ని శ్రీ స్వామివారి ప్రసాదంగా భావించి తినాలి, తినే ముందు మన ప్రక్కనున్న జీవ రాశులకు పెట్టి తినాలి ఎక్కడైన తినేటప్పుడు ఎవరూ చూడకుండా తినాలి ఒక్కసారే పెట్టించుకోవాలి, పదే పదే పెట్టించుకుని వాళ్ళకు కష్టం కలిగించకూడదు అని చెప్పింది. అలాగే అమ్మా అని మాట ఇచ్చారు.


             శ్రీ స్వామివారు అప్పటి నుండి ఎక్కడ బిక్ష చేసినా పక్షులకు మూగజీవాలకు పెట్టి తాను తీసుకుంటారు. బహిరంగంగా చేసేవారు కాదు. ఒకేసారి అన్నీ పదార్థాలు తాటి ఆకుతో చేసిన రేక లో పెట్ట మనే వారు స్వల్ప ప్రమాణంలో మాత్రమే స్వీకరించే వారు. ఆరోజు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తల్లి గౌరవం నిలపెట్టే విధంగా ప్రతీ స్త్రీ మూర్తిని అమ్మా అని ఆప్యాయంగా పిలిచే వారు.


       అవతార పురుషులై ఆమె కడుపున జన్మించినా కూడా ఆమెను తన మాతృ మూర్తిగా గౌరవించి ఆమెకి భోజనం విషయంలో ఇచ్చిన మాటని జీవితాంతం నియమంగా పాటించారు. అమ్మ అనే పిలుపుకి భగవంతుడు కూడా బంది కావాల్సిందే...!


🔥ఓం నారాయణ           ఆదినారాయణ🔥


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


నాకు ఒకే ఒక చెల్లెలు వున్నది. ఆమె మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూవుంటే ఎక్కడా కుదరలేదు. మా తల్లి దండ్రులు విసిగిపోయారు. అప్పుడు మాస్టార్ గారికి చెప్పుకుంటే “ఆమె పేరు ఏమిటి? " అని అడిగారు.   “పార్వతి”అన్నాను. క్షణకాలం కళ్ళుమూసుకున్నారు. లాస్ట్ కి "జరుగుతుందిలే” అన్నారు. తర్వాత ఆమెకు మారేజ్ అయిపోయినది. ఈయన స్టూడెంట్స్ ని ఎప్పుడూ తిట్టడం గాని, అరవటం గాని చేసేవారు కాదు. లెసన్ మధ్యమధ్యలో జోక్స్ వేసేవారు. కాబట్టి ఆయన ఎంత సేపు చెప్పినప్పటికి కూడా క్లాస్ విసుగనిపించేది కాదు. ఇంకా చెప్తే బాగుండు అని అన్పించేది. పిల్లలు క్లాస్ లో వెనుక బెంచీలో కూర్చుని నవ్వుతూ అల్లరి చేస్తూంటే "ఆ చేసేదేదో పెద్దగా చెప్పి చెయ్యండి మేము కూడా మీతో పాటు నవ్వుతాము” అని అనేవారు కానీ తిట్టేవారు కాదు. కానీ జనరల్ గా ధైవం అంటే ఆసక్తి లేని వారు కూడా ఆయన క్లాస్ అంటే మాత్రం లైక్ చేసేవారు. ఇప్పుడు వివేకానందుడు, గాంధీ మహాత్ముడు స్పీచ్ ఇస్తుంటే మంత్ర ముగ్ధులై విన్నట్లు వినేవారని చెప్తూంటారు చూడండి, ఆ టైప్ వుండేది ఆయన క్లాస్. ఆయన గొంతులో ఒక రకమైన ప్రత్యేకత వుండి స్టూడెంట్స్ ని ఎట్రాక్ట్ చేసేది. ఆయన దేవుడు గురించి, బాబా గురించి క్లాస్ లో చెప్పేవారు కాదు.


                        🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*రోజుకు ఒక్క నామాన్ని భావయుక్తంగా చదువుకుందాము*


*ఓం సర్వస్మై నమః*


*సర్వము తాను అయిన శ్రీ సాయినాథునికి నమస్కారము*


 వివరములకు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్  విరచిత "సాయినాథ పూజ" అను  గ్రంథమును పరిశీలించ గలరు.

online లో చూచుటకు.. www.saibharadwaja.org పరిశీలించగలరు.

*ఓం సాయి రాం......జై సాయి మాస్టర్*

పేజీ నెంబర్ : 48


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: