Srimadhandhra Bhagavatham -- 72 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
యమళార్జున భంజనము:
యశోదాదేవి కృష్ణుని తీసుకుని వెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ, పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు. ఆశ్చర్యకరమయిన ఒక లీల ప్రారంభం అయింది. ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. వాటి మానులు చాలా స్థిరమయిన స్థితిలో ఉన్నాయి. వాటిని కూలదోయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలియై ఆయన పాకుతూ వెనకాల రోలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ రెండుమద్దిచెట్ల మధ్యనుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగి రెండు మద్దిచెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు. ఆ రెండు మద్దిచెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.
ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన ఇద్దరు కుబేరుని కుమారులయిన నలకూబర, మణిగ్రీవులనే యక్షులు. కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండుశక్తులు ఉన్నాయి. ఒకటి ఆయన అపారమయిన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. రెండు – సర్వకాలములయందు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడయినా పని చెపుతారేమో నని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ రెండు లక్షణములు గలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణములలో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్రవసువుబ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి ‘ఏమి కావాలి?’ అని అడిగారు. కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు ‘నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు’ అన్నారు.
కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రిగారయిన విశ్రవసు బ్రహ్మగారు ఎలా చెపితే అలా ప్రవర్తించేవాడు. తండ్రిగారు కాంచనలంకను విడిచి పెట్టివేయవలసిందని చెపితే విడిచిపెట్టేసి తమ్ముడయిన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తరదిక్కుకు పోయి వేరే నగరమును నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానమును రావణాసురుడు ఎత్తుకు పోతే మారుమాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యమునకు మాత్రమే వారసత్వమును పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందక పోతే వారు ప్రమాదంలో పడతారు. అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం.
నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుంది. నలకూబరమణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. వారు మధువు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయమును మరచిపోయి ఉన్నారు. వీళ్ళు అటువంటి స్నానం చేస్తుండగా ఆకాశమార్గమున నారదమహర్షి వెళుతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగి గబగబా ఒడ్డుకువచ్చి వస్త్రములు కట్టుకుని నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారదమహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచిపద్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి ఉండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒకమాట అనుకున్నాడు.
‘వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును తీసివేస్తాను. వీరికి దేనివలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అన్జనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళకు బుద్ధి చెపుతాను’ అనుకుని వారితో ‘మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్టకట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్దిచెట్లయి నందవ్రజమునందు పడి ఉండెదరు గాక!’ అని శపిస్తే ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళమీద పడ్డారు.
గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహించి ఆయన ‘ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందములనుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉన్నది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తలమీద పడాలి. భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు. అదే వారి పుణ్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. మీరు నందవ్రజంలో మద్దిచెట్లయి పుట్టండి. కృష్ణపరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేసారు కానీ నా అనుగ్రహము వలన ఉత్తరోత్తర మోక్షమును పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథారూపమును పొంది మీ యక్షలోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు’ అని అనుగ్రహించాడు. ఈ విధంగా నారదమహర్షి శాపావసానమును ఇచ్చారు. దీనివలన పడిపోయిన రెండుచెట్లనుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవ నలకూబరులు రెండుచెట్ల మధ్యవున్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు.
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీమూర్తిపై జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్త్రేక్షణా!!
ఈపద్యమును ఒకసారి చదువుకుంటే చాలు. మనం పూజ చేసినట్లే. స్వామీ! మేము ఎప్పటికీ మరల అహంకారం రాకుండా, మా కళ్ళు ఎల్లప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి. మా శిరస్సులు నీ పాదములను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అని మనస్సునందు తొందర గలగాలి. అటువంటి చిత్తమును మాకు ప్రసాదించవలసినది’ అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. ఆయన ‘తథాస్తు’ మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకమును చేరుకోండి ’ అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్షలోకమునకు వెళ్ళిపోయారు.
ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలిగితే ఎల్లప్పుడూ ఐశ్వర్యమును అనుభవిస్తూ ఆనందముగా ఉండగలరు అనే మహోత్కృష్టమైన సందేశమును ఈ లీల మనకు అందజేస్తోంది. యశోదానందులు అక్కడ ఉన్న గోపాలురు ఈ చెట్లు పడిపోయిన శబ్దమును విన్నారు. ఈ రెండు చెట్లూ భూమిమీద ఎలా పడ్డాయని అక్కడి వాళ్ళందరూ అనుకుంటున్నారు. చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఈ చిన్ని కృష్ణుడే రోలు ఈడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలో వచ్చాడు. అలా వచ్చినపుడు ఈ రెండుచెట్లూ భూమిమీద పడిపోయాయి. అందులోనుండి దివ్యతేజస్సుతో ఇద్దరు మహాపురుషులు వచ్చారు. వారు చిన్నికృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు. అది మేము చూశాము అన్నారు.
పెద్దవారు వీళ్ళమాటలు కొట్టి పారేశారు. కృష్ణుడు ఏమీ తెలియని చిన్నపిల్లవాడి వలే ఏదో పాటను పాడుతున్నాడు. ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు. గోపవనితలు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జెలు మోగేటట్లుగా కాళ్ళు చేతులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు. ఇంతగా అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వానికి దైవీశక్తులు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? ఈవిధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతున్నాడు. అలా మభ్యపెడుతున్న కృష్ణుని మనసు దర్శనం చేసిన నాడు మనలను ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమస్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి