13, నవంబర్ 2022, ఆదివారం

నీ పాదపద్మాలకు నమస్కారము

 శ్లోకం:☝️

*యోఽన్తః ప్రవిశ్య మమ*

  *వాచమిమాం ప్రసుప్తాం*

*సంజీవయత్యఖిల-*

  *శక్తిధరః స్వధామ్నా l*

*అన్యాంశ్చ హస్తచరణ-*

  *శ్రవణత్వగాదీన్*

*ప్రాణాన్ నమో భగవతే*

  *పురుషాయ తుభ్యమ్ ll*


భావం: అఖిలశక్తులుగల ఏ పరమాత్మ నాలో ప్రవేశించి నాలో అణగారిన వాక్కు మొదలైన ఇంద్రియాలను ప్రాణాలను తన కాంతిచే ఉజ్జీవింపచేసినో ఆ ఓ పరమపురుషా! నీ పాదపద్మాలకు నమస్కారము.🙏

ఈ శ్లోకరత్నం నిత్యం కఠాభరణంగా ధరించతగినది. ధ్రువుడు చేసిన స్తుతి. సవతి తల్లి మాటలకు స్ఫూర్తిని పొంది తల్లి అనుమతితో అధోక్షజుణ్ణి ఆరాధించుటకు స్థిరమైన నిశ్చయంతో ధ్రువుడు బయలుదేఱెను. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించే దేవర్షి నారదుడు ఎదురొచ్చి పరీక్షించి నారాయణమంత్రం ఉపదేశించెను. మధువనంలో ధ్రువుడు కఠినమైన నియమాలతో తపమాచరించెను. అతని తఫఃఫల పరిపాకంగా ధ్యేయమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు లోపల అంతర్ధానమయి కళ్ళకు గోచరించెను. కాని ఆశ్చర్యంతో నోటమాట రాక తబ్బిబ్బయ్యెను. కృపాళువైన పరమాత్మ వేదమైన తన శంఖాన్ని ధ్రవుని చెక్కిళ్ళకు తాకించెను. అంత ఆబాలుడు ప్రౌఢునివలే పన్నెండు (ద్వాదశాదిత్యులు గదా) శ్లోకాలతో స్తుతించెను. అందు తొలి పద్యమిది.

కామెంట్‌లు లేవు: