13, నవంబర్ 2022, ఆదివారం

బుద్ధి మనసు

 బుద్ధి మనసును తన అధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్టు మనసు నడచుకునేటట్టు చేయాలి. అది ఎలా చేయాలి అంటే గబగబా చేయకూడదు. నెమ్మదిగా నిదానంగా చేయాలి. శనైశనై అంటే మెల్లమెల్లగా చేయాలి. 


తనకు అధికారం ఉంది కదా అని ఆఫీసరుగారు, బంట్రోతును చీటికి మాటికి తిడితే వాడు ఆ పని చేయకుండా వెళ్లిపోతాడు. అలా కాకుండా, నెమ్మదిగా బుజ్జగించి చెబితే, ఎంత కష్టమైన పనైనా చేస్తాడు. అదే ఇక్కడ చెప్పాడు. బుద్ధి కూడా మనసును ఇంద్రియములను మెల్ల మెల్లగా బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవాలి. చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా 


బలవంతంగా మనసును ఇంద్రియాలను దారిలో పెట్టాలంటే అవి మాట వినవు సరికదా బుద్ధిని కూడా తమతో లాక్కుపోతాయి. అగ్నిహోత్రం వెలగాలంటే ముందు చిన్న కర్పూరం బిళ్ల అంటించి, దాని మీద చిన్న చిన్నచితుకులుపెట్టి, ఊది, మంటపెద్దదిగా చేసి అప్పుడు పెద్ద పెద్ద సమిధలు వేయాలి. అంతే కానీ కర్పూరం బిళ్ల అంటించగానే, ఆ చిన్ని మంటలో పెద్ద పెద్ద సమిధలు వేస్తే ఆరిపోతుంది. 

అందుకే శనైః శనైః అంటే మెల్ల మెల్లగా మనసును బుద్ధితో లాలించి, బుజ్జగించి, దారిలోకి తెచ్చుకోవాలి.


అలా దారిలోకి తెచ్చుకున్న మనసును అలాగే వదిలేస్తే మరలా పారిపోతుంది. అలా పారిపోకుండా వెంటనే ఆత్మలో పెట్టెయ్యాలి. అంటే మరలా మనసు అటు ఇటు పారిపోకుండా “ఆత్మ చింతన” అనే తాయిలాలు దానికి రుచి చూపించాలి. ఒకసారి ఆత్మలో లీనమైన మనసు ఇంక అక్కడి నుండి కదలదు. స్థిరంగా ఉంటుంది.

ఇదంతా ఎలా చేయాలి అంటే..

"ధృతి గృహీతయా" అంటే ధైర్యంగా చేయాలి. బుద్ధితో, జ్ఞానంతో చేయాలి. మనం చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానంతో చేయాలి కాని ఏమీ తెలియకుండా చేయకూడదు. ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ స్థితి అంటే ఏమిటో తెలియకుండా మనసును ఆత్మలో కలపడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి మనం సంపాదించుకున్న శాస్త్రజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.


ఒకసారి ఆత్మను మనసులో లీనం చేసా అని ఏమనుపాటుగా విషయములలో తల దూరిస్తే, మనసు కూడా అటు తొంగి చూస్తుంది. అందుకనే ఉంటే, పాపంచిక న కించిదపి చిన్తయేత్ అన్నారు. అంటే ఒక సారి ఆత్మసాక్షాత్కారం పొందడానికి ధ్యానంలో కూర్చున్న తరువాత, ఇంక ఇతర విషయాల వంక చూడకూడదు. చింతించకూడదు. ఆలోచించకూడదు. అందుకే..

“ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చిన్తయేత్" అంటే ఆత్మయందు మనసును నిలిపిన తరువాత, ఇతరాలైన వేటి గురించి కూడా ఆలోచించకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు మనసులో ఏ పరమాత్మ ఉన్నాడో లేక ఎదురుగా ఏ దేవతా మూర్తి ఉన్నదో, దానిని తప్ప మరి ఏ విషయం. కూడా మనసులోకి రానీయకూడదు. అప్పుడే ఆత్మసాక్షాత్కారం పొందే అవకాశం ఉంది.


        🚩🙏...హరే కృష్ణ...🙏🚩


#భగవద్గీత #bhagavadgita

కామెంట్‌లు లేవు: