12, నవంబర్ 2022, శనివారం

*కార్తీక మహాత్మ్య

: 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴


    🕉️ _*బుధవారం*_ 🕉️

🪔 *నవంబరు 9, 2022* 🪔


*కార్తీకపురాణం  - 15వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*


🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా ! కార్తీక మహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని , మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.


ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక  వినుట సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ధ త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను.


ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక , ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు , వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.


సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి , నీళ్లతో కడిగి , బొట్లుపెట్టి , ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులుజేసి , పండ్రెండు దీపములుంచి , స్వామిని పూజించుచు , నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి , నలుమూలలు వెదకి , తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను , శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా , ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి *"ఓయీ ! నీవెవ్వడవు ? ఎందుకిట్లు నిలబడియుంటివి ?"* అని ప్రశ్నించగా , *"ఆర్యా ! నేను మూషికమును , రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ , నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని , ఓ మహానుభావా ! నేను ఎందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"* మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని , *"ఓయీ ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ , ధనాశపరుడై దేవపూజలు , నిత్యకర్మలు మరచి , నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు , మంచివారలను , యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు , సమస్త తినుబండారములను కడుచౌకగా కొని , తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి , అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన , నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి , ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"* మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


  *ఇట్లు స్కాంద పురాణాంతర్గత* 

               *వశిష్ఠ ప్రోక్త* 

     *కార్తీక మహాత్మ్య మందలి*


    *పదిహేనోవ అధ్యాయము*

         *పదిహేనోవ రోజు* 

 *పారాయణము సమాప్తము*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

: 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴


      🕉️ _*గురువారం*_ 🕉️

🪔 *నవంబరు 10, 2022* 🪔


*కార్తీకపురాణం  - 16వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔



*స్తంభ దీప ప్రశంస*


🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹


*వశిష్టుడు చెబుతున్నాడు*


*"ఓ రాజా ! కార్తీకమాసము దామోదరునికి అత్యంత  ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ  విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి , భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు , నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.


సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీపముగాని , స్తంభ దీపము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యములు కలిగి , వారి జీవితము ఆనంద దాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు  శాలిధాన్యంగాని, నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాస మాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.


*దీప స్తంభము విప్రుడగుట*


ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని , దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని , నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ ఆశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయద్వారాలపై దీపములు వెలిగించి , కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి *"ఓ సిద్దులారా ! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా ! రేపు కార్తీకశుద్ధ  పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక  స్తంభముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము , రండు"* అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి , దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి  వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి *"ఓయీ నీ వెవడవు ? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి ? నీ వృత్తాంతమేమి"* అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి *"పుణ్యాత్ములారా ! నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక , దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి , ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై , పదివేల జన్మలు కాకినై , ఐదువేల జన్మలు తొండనై , ఐదు వేల జన్మలు పేడపురుగునై , తర్వాత వృక్ష  జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని , నన్ను మన్నింపు"* డని వేడుకొనెను.


ఆ మాటలాలకించిన , మునులందరు నమితాశ్చర్యమొంది *"ఆహా ! కార్తీకమాస మహిమ మెంత గొప్పది అదియునుగాక , కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు , రాళ్లు , స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తికలిగినదని* మునులు అనుకొనుచుండగా , ఆ పురుషుడా మాటలాలకించి *"మునిపుంగవులారా ! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును ? అది నశించుటెట్లు ? నాయీ సంశయము బాపు"* డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునీశ్వరులందరును తమలో ఒకడగు అంగీరస మునితో *"స్వామి ! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన , వివరించు"* డని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.


    *ఇట్లు స్కాంద పురాణాంతర్గత* 

                   *వశిష్ట ప్రోక్త* 

       *కార్తీక మహాత్మ్య మందలి*


      *పదహారవ అధ్యాయము* 

            *పదహారవ రోజు* 

     *పారాయణము సమాప్తం*


            🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

[: 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴


       🕉️ _*శుక్రవారం*_ 🕉️

🪔 *నవంబరు 11, 2022* 🪔


*కార్తీకపురాణం  - 17వ అధ్యాయము*


🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.


కర్మవలన ఆత్మకు దేహధారణము  సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా


*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజేయండి"* యని ధనలోభుడు కోరెను.


అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే  *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.


ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల  సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.  


దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింప జేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.


జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.


     *ఇట్లు స్కాంద పురాణాంతర్గత* 

                   *వశిష్ట ప్రోక్త* 

        *కార్తీక మహాత్మ్య మందలి*


        *పదిహేడవ  అధ్యాయము* 

              *పదిహేడవ రోజు* 

       *పారాయణ సమాప్తము*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

: 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🍁 _*శనివారం*_ 🍁

🪔 *నవంబరు 12, 2022* 🪔


*కార్తీకపురాణం  - 18వ అధ్యాయము*


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు"* డని ప్రార్ధించెను.


*"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలు నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడేజాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నాచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము  చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు"*. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.


*"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు"* డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.


*"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి'* అనియు , *కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".*


తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. *"నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?"* అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి *"ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి  రక్షింపు"* మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.


ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు *"ఈ ముసలి వానితో మనకేమి పని"* అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి *"వీరినెట్లు తరింపజేతునా ?"* అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.


ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.


*శ్లో|| శాంతకారం!  బుజగశయనం! పద్మనాభం! సురేశం!*

*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*

*లక్ష్మీకాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*

*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*


*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*

*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*

*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*

*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*


    *ఇట్లు స్కాంద పురాణాంతర్గత* 

                  *వశిష్ఠ ప్రోక్త* 

       *కార్తీక మహాత్మ్య మందలి*


       *పద్దెనిమిదో అధ్యాయము*

             *పద్దెనిమిదో రోజు* 

      *పారాయణం సమాప్తం* 


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

కామెంట్‌లు లేవు: