12, నవంబర్ 2022, శనివారం

శ్రీచక్రం స్థాపించి

 💚🍋 అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రం స్థాపించి అందులో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం 🍋💚

🌷🌻 మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం 🌻🌷

🌺 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.

🌺 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.

🌺 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!

🌺 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.

🌺 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

🌺 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 

🌺 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 

🌺 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.

🌺  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన  తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 

🌺 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.

కామెంట్‌లు లేవు: