17, జులై 2024, బుధవారం

చాతుర్మాస్యము

 🕉 *నేటి నుండి చాతుర్మాస్య దీక్షారంభము* 🕉️


చాతుర్మాస్యము- అవశ్యకర్తవ్యము


ఆషాఢే తు సితే పక్షే 

ఏకాదశ్యా ముపోషితః|

చాతుర్మాస్య వ్రతం కుర్యా

దత్కించిన్నయతో నరః’’||


చాతుర్మాస్యం గురించి ఇతిహాసం

ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ

అలసిపోయి నిదురించాడట. అది

గమనించిన దేవతలు ఒక యజ్ఞం

చేసి, అందులోంచీ ఉద్భవించిన

హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట.

అది ఔషధంలా పని చేసి ఆయన

అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది.

నియమనిష్ఠలతో, శ్రద్ధతో

నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం.


బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’,

‘ద్వే’, .త్రీణీ’, ‘చత్వారీ’ అంటూ

నాలుగు సార్లు ఆజ్యాన్ని

సమర్పించి, చివరగా ఒక సమిధను

కూడా వేశాడు. ఫలితంగా-

దేవతలు, దానవులు, పితరులు,

మానవులు అనే నాలుగు రకాల

జీవులను సృష్టించి, వారికి

రోమములు, మజ్జ మాంసములు,

ఎముకలను కూడా ఇచ్చాడు.

‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే

అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల

జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా

ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ

బ్రాహ్మణం అంటోంది. మరొక

నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన

బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు.

‘చతుః+ మా+అస్యం

చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు

ముఖాలుగా- నాలుగు వేదాలు

చెప్పినవాడు బ్రహ్మ. వేదలక్ష్మియే

శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతి

రోజూ వేదాలను పూజించాలి.

అధ్యయనం, అధ్యాపనం చేయడం

ముఖ్యమైన అనుష్ఠామంగా భావన

చేయాలని ఉపనిషత్తు అంటోంది.


చాతుర్మాస్య వ్రతమును ప్రతి

ఒక్కరూ తప్పకుండ ఆచరించి

తీరవలెను. బ్రాహ్మణ, క్షత్రియ,

వైశ్య, శూద్ర, విధవాస్త్రీ, ముత్తైదువ, బ్రహ్మచారి, గృహస్థ,

వానప్రస్థ, సన్యాసి మొదలగువారు

ఈ వ్రతమును వదలకుండ చేసి

తీరవలెనని శాస్త్రాలు చెబుతున్నవి.


ఇటీవలి కాలంలో యతులు

మాత్రమే ఆచరిస్తున్న కారణంగా-

చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు

లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా

భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని

వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు

చాతుర్మాస్య వ్రతం పాటించాలని

శాస్త్రాలు చెబుతున్నాయి.


నిత్యం కార్యం చ సర్వేషాం 

ఏతద్ వ్రత చతుష్టయం |

నారీభిశ్చ నరైర్వాపి 

చతురాశ్రమ వర్తిభిః || 

బ్రాహ్మణః క్షత్రియః వైశ్యః 

స్త్రియః శూద్రో ప్రతీయథా || 

గృహీ వనస్థః కుటచోబహూదః

పరమహంసకః ॥ 

నరకాన్న నిర్వర్తంతే 

త్యక్త్వా వ్రత చతుష్టయం ॥ 


చాతుర్మాస వ్రతం

ఆచరించడమనేది ఇటీవలి

కాలంలో వచ్చినది కాదు. యుగ

యుగాలుగా ఆచరణలో ఉందని

విష్ణు ధర్మోత్తర, భవిష్య, స్కాంద

పురాణాలలోని కథనాల వలన

అవగతమవుతుంది. ఒకప్పుడు

ఇప్పటిలాగా కాక నాలుగు

నెలలుపాటు కొనసాగే ఋతువులు

మూడే ఉండేవట. అనంతర

కాలంలో రెండేసి నెలల పాటు 

ఉండే ఆరు ఋతువులుగా అవి

మారాయి. తొలినాళ్ళలో వర్ష,

హేమంత, వసంత - అనే మూడు

ఋతువులు మాత్రమే ఉండేవి. 

వర్ష ఋతువుతోనే సంవత్సరము

ఆరంభామవుతూ ఉండేది. ఈ

కారణం వల్ల సంవత్సరానికి " వర్షం"

అనే పేరు వచ్చింది. సంవత్సరానికి

మూడు ఋతువులున్న ఆ

కాలములో ఒక్క ఋతువు

ప్రారంభంలో ఒక్కో యజ్ఞం

చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ

నుండి వరుణ ప్రఘాస యజ్ఞం,

కార్తీక పూర్ణిమ నుండి సాకమేద

యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి

వైశ్వ దేవయజ్ఞము చేస్తూ

ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో

చేసే యజ్ఞమే అనంతర కాలం

నాటికి చాతుర్మాస్య వ్రతము గా

మారి ఆచరణలోకి వచ్చిందని

పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస

వ్రతము పాటించేవారు. ఆహార

నియమాలలో భాగంగా శ్రావణ

మాసంలో ఆకుకూరలను, భాద్రపద

మాసంలో పెరుగును ఆశ్వయుజ

మాసంలో పాలను కార్తీక మాసంలో

పప్పు పదార్థాలను విధిగా వదిలి

పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ

మాత్రము స్వీకరించ కూడదు. 

పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం

వాడవచ్చును. ఈ ఆహార

నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ

సంబంధ రోగాల నుంచి కాపాడు

కోవటానికి బాగా ఉపకరిస్తాయి.

ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య

వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య

పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత

దీక్ష అని పురాణ వాఙ్మయం

వివరిస్తోంది. 


ఏకభుక్త మధశ్శయ్యా

బ్రహ్మచర్య మహింసనమ్

వ్రతచర్యా తపశ్చర్యా

కృచ్చచాంద్రాయణాదికమ్

దేవపూజా మంత్రజపో దశైతే

నియమాః స్మృతాః


చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల

ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి

వరకు గల సమయం నాలుగు

నెలలు. ఆషాఢ, శ్రావణ, భాద్రపద,

ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే

కాలంలో సాధకులు భూశయనం

చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి,

సొరకాయ, టమాట, ఆవనూనెల

సేవనం మానివేయటం, నిరంతర

జప, తప, హోమ, పురాణ కథా

శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ

ఒకే పూట భోజనం చేయటం,

ఏకాదశులలో పూర్తిగా ఉపవాస

దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను

పాటిస్తారు. పీఠాధిపతులు,

దీక్షితులు ఒకే స్థానంలో

నివసించటం, క్షురకర్మలు

నిషేధించడం వంటి నియమాలు

పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద

మాసాలు గృహస్థుల నియమాలకు

సరైనవని పద్మపురాణం

తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ

ఏకాదశిని అజా ఏకాదశి అంటారు.

ఇది సమస్త పాపాలను

తొలగిస్తుందంటారు. 


హరిశ్చంద్ర మహారాజు సత్యం,

ధర్మం తప్పక తన భార్యకు

దూరమై అనేక ఇక్కట్ల

పాలైనప్పటికీ చాతుర్మాస్య

వ్రతాన్ని మరువలేదని, చివరికి

విజయం చేకూరిందని చెబుతారు.


చాతుర్మాస్యవ్రతము త్యజించినచో

మహాదోషము.


అవ్రతేన నయేద్‌యస్తు

చాతుర్మాస్యమనుత్తమం॥

సపాపీ నరకం యాతి

యావదాభూత సంప్లవం ॥ 


వ్రతము చేయకుండ ఎవరైతే 

ఈ చాతుర్మాస్యాన్ని గడిపెదరో

అటువంటివారు మహా

ప్రళయకాల పర్యంతము

నరకములో పడతాడు.


వ్రతము చేయుట వలన మహాపుణ్యము


ఇదం వ్రతం మహాపుణ్యం

సర్వపాపహరం శుభం ॥

సర్వాపరాధ శమనం

సర్వోపద్రవనాశనం ॥


ఇతర వ్రతములు


పరాకం షష్టకాలం చ 

తథా ధారణపారణం | 

లక్షవర్తివ్రతం చైవ 

భీష్మ పంచకమేవచ ||

తథాలక్షనమస్కారవ్రతం 

లక్ష ప్రదక్షిణం || 

చాతుర్మాస్యే వ్రతాన్యాహుః 

ఏతత్ కామ్యమితీరితం॥


శాకాదివ్రతములే కాక,

పరాకవ్రతము, 

షష్ఠకాల వ్రతము,

ధారణ పారణ వ్రతము, 

లక్ష ఒత్తుల వ్రతము,

భీష్మపంచకవ్రతము, 

లక్ష నమస్కార వ్రతము, 

లక్ష ప్రదక్షిణ వ్రతము,

తులసీ, గో ప్రదక్షిణము,

గోదానము ఇత్యాది వ్రతములు

కూడా చేయుట వలన విశేష

పలములు లభించును.


‘శ్రావణే వర్జయేత్‌ శాకం 

దధి భద్రపదే తథా!

దుగ్ధ మాశ్వయుజే మాసి 

కార్తికే ద్విదళాం తథా!!’’


శ్రావణ మాసంలో కూరగాయలను,

భాద్రపద మాసంలో పెరుగును,

అశ్వయుజ మాసంలో పాలు, పాల

పదార్ధాలనూ, కార్తీకంలో రెండు

బద్దలుగా విడివడే పప్పు

ధాన్యాలూ లేదా పప్పుతో చేసిన

పదార్ధాలనూ త్యజించాలి.


దీనికి కారణాలు ఏమిటంటే,

ఋతువులు మారుతున్న

సమయంలో వ్యాధులు

ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం

నుంచి వర్ష ఋతువు, ఆపైన

శరదృతువు కాలంలో వీటి ప్రభావం

మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ

ఋతువుల సంధ్య కాలాన్ని

యమదంష్ట్రలని అందుకే అన్నారు. శాస్త్ర రీత్యా ఆషాఢంలో

కామోద్దీపకం హెచ్చు. అందుకే

నూతన దంపతులను దూరంగా

ఉంచుతారు. భాద్రపదంలో

వర్షాలతో నదులలో నీరు

బురదమయంగా ఉంటుంది.

ఆ నీరు తాగితే రోగాల బారిన

పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని

నియంత్రించడానికి నియమిత

ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు

మాసాల్లో చెయ్యాలి. వీటినే

చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య

రీత్యా చెప్పడం జరిగింది. ఈ

నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు,

పర్వాలు పేరిట కట్టడి చేయడం

 కూడా జరిగింది. వ్రతాలు,

మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, 

శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.


శాక వ్రతము:-


శాక వ్రతములో సకల

కూరగాయలను త్యజించవలెను.

దశవిధములైన శాకములు.

శాకములనగా కేవలము

కూరగాయలని అర్థము కాదు.

చెట్టుకు సంబంధించిన, మూలము,

పత్రము, కరీరము, మొలకలు,

చెట్టు అగ్రభాగము, ఫలములు,

కాండము, వేరు, పండు, దంటు,

చెక్క, పూవు, తొక్క, మొగ్గుచిగురు,

ఆకులు, ఆకుకూరలు, కరివేపాకు, ఇవే మొదలైనవాటిని

శాకవ్రతములో వర్జ్యము.


శాకవ్రతములో స్వీకరించుటకు

యోగ్యములు:- 

బేడలు, తులసీ, అతసీ, బ్రాహ్మీ,

 మిరియాలు, జీలకర్ర, ఎండుశుంఠి,

 పాలు, పెరుగు, నెయ్యి, తేనె,

 ఇంగువ, ఎండిన ఉసిరికాయ

 ఉపయోగిస్తారు.


ప్రప్రథమముగా చాతుర్మాస్య వ్రత

సంకల్పమును చేసుకొనవలెను.

ప్రథమ మాసములో శాక

వ్రతమును, ద్వితీయ మాసములో

దధి వ్రతమును, తృతీయ

మాసములో క్షీర వ్రతమును,

నాల్గవ మాసములో 'ద్విదల'

మరియు బహుబీజ వ్రతమును

ఆచరించవలెను.


కర్కాటక సంక్రమణం నుండి కానీ,

అషాఢ శుక్ల దశమి, ఏకాదశి,

పూర్ణిమ తిథి నాడు ప్రారంభించి

కార్తీక  శుద్ధ ద్వాదశి, పౌర్ణమికి

సమాప్తి చేయవలెను. 


సుప్తే త్వయిజగన్నాథ 

జగత్‌సుప్తం భవేదిదం|

విబుద్ధే చ విబుద్ధ్యేత 

ప్రసన్నోభవ మేకచ్యుత | 

చతురో వార్షికాన్ మాసాన్ 

దేవ దేవ జగత్పతే |

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

ప్రసాదాత్ తవకేశవ |

గృహీతే॑స్మిన్ వ్రతే దేవ 

పంచత్వం యదిమేభమే|

తదాభవేత్ సుసంపూర్ణం 

ప్రసాదాత్తే జనార్దన||


ఈ విధముగా ప్రార్థించవలెను.

పంచగవ్య శుద్ది చేసుకొని,

అచమన, ప్రాణాయామ,

సంకల్పంతో శ్రీధర, హృషీకేశ,

పద్మనాభ, దామోదర రూపాణాం

ప్రీతిం కామయమానః చాతుర్మాస్య

వ్రతాంగ శాకవ్రత, దధివ్రత, క్షీరవ్రత

ద్విదళ వ్రతాఖ్య చతుర్విధ వ్రతం

స్వీకరిష్యే.


శాకవ్రత సంకల్పము 

(ఆషాఢ శుక్ల ద్వాదశీ- పూర్ణిమ):


శాకవ్రతం మయాదేవ

గృహీతం పురతస్తవ। 

నిర్విఘ్నం సిద్ధి మాయాతు

ప్రసాదాత్ తే రమాపతే ॥


శాక సమర్పణ:-

ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే । 

శాకంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం॥


దధివ్రత సంకల్పము : 

(శ్రావణ శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)


దధిభాద్రపదే మాసి 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


దధివ్రత సమర్పణము:-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే !

ద్విజవర్యాయ దాస్యేంహం

స హిరణ్యం ఘనం దధి ॥


క్షీర వ్రత సంకల్పం 

(భాద్రపద శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)

క్షీరవ్రతమిదం దేవ 

గృహీతం పురతస్తవ | 

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

ప్రసాదాత్ తే రమాపతే ॥


క్షీరవ్రత సమర్పణ :-

ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

క్షీరంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


ద్విదళవ్రత సంకల్పము:-

(ఆశ్వయుజ శుక్ల ద్వాదశీ)

కార్తికే ద్విదలంధాన్యం 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


ద్విదళ సమర్పణ :-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

ద్విదలం ద్విజవరాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


చాతుర్మాస్యవ్రత సమర్పణ


ఇదం వ్రతం మయాదేవకృతం

ప్రీత్యై తవప్రభో | 

న్యూనం సంపూర్ణతాం యాతు

త్వత్ప్రసాదాత్ జనార్ధన ॥


అదీ కాకుండా, పరివ్రాజకులు

గ్రామాల్లో సంచరిస్తే, వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్‌ చింతనతో పాటు ధర్మప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబవ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని

కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు

చెబుతున్నాయి.


🔯

కామెంట్‌లు లేవు: