8, నవంబర్ 2020, ఆదివారం

పోత‌న త‌ల‌పులో....107

 పోత‌న త‌ల‌పులో....107


ప‌రీక్షిత్తుకు శుక‌యోగీంద్రుల వారు మైత్రేయ, విదుర సంబాష‌ణ‌ల‌లోని ప‌లు విశేషాల‌ను క‌థ‌లు క‌థ‌లుగా తెలియ‌జెప్పారు.

             **


 సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన శివుడిని, దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి. అని విదురుడు మైత్రేయుడిని అడుగ‌గా ఆయ‌న అందుకు సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జెప్పాడు.

          ***

సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు

క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న

త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా

దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.

                   ***


               “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి. శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోనివారందరూ లేచి నిలబడ్డారు.


చనుదెంచిన యా దక్షుఁడు

వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్

తన కిచ్చిన పూజలు గై

కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్.


వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని...


తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ

నాసనము దిగనట్టి పురారివలను

గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ

జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.


తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా

 గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో  ఇలా అన్నాడు....


వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు

తాశనాది సురోత్తములార! మోహ

మత్సరోక్తులు గావు నా మాట" లనుచు

వారి కందఱ కా పురవైరిఁ జూపి.



“దేవతలారా! మునులారా!

 మీరందరూ సద్దు చేయకుండా వినండి.

 నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుడిని చూపించి..

                         ***

పరికింప నితఁడు దిక్పాలయశోహాని-

  కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ

గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి-

  తం బయ్యె; నెన్న గతత్రపుండు

మహితసావిత్రీ సమానను సాధ్వి న-

  స్మత్తనూజను మృగశాబనేత్ర

సకల భూమీసుర జన సమక్షమున మ-

  ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ



జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ

దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి

నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న

నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.


                 **

ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది.  లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ య‌న‌ పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? అని ద‌క్షుడు అన్నాడు.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️దివ్య‌ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: