8, నవంబర్ 2020, ఆదివారం

శ్రీ దేవీ మహత్యము

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 8  / Sri Devi Mahatyam - Durga Saptasati - 8 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 2*

*🌻. మహిషాసుర సైన్యవధ - 2 🌻*


పాలసముద్రం ఒక నిర్మలమైన ముత్యాలహారాన్ని, ఎన్నటికీ పాతబడని రెండు చీరల్ని, దివ్యమైన శిరోరత్నాన్ని, కమ్మలను, కటకాలును (ఒక విధమైన గాజులు), శుభ్రమైన అర్ధచంద్రాభరణాన్ని, అన్ని బాహువులకు భుజకీర్తులును, స్వచ్ఛమైన మంజీరాలును (అందెలు), మహోత్తమైన కంఠాభరణాన్ని, అన్ని వేళ్లను శ్రేష్ఠమైన ఉంగరాలను ఇచ్చింది. 


విశ్వకర్మ మహోజ్జ్వలమైన గండ్రగొడ్డలిని, అనేక రూపాలైన అస్త్రాలను, అభేద్యకవచాన్ని ఇచ్చాడు. తలపై ఒకటి, వక్ష ప్రదేశాన ఒకటి ధరించడానికి ఎన్నటికీ వాడిపోని రెండు తామరపూల మాలలను, చేత పట్టుకోవడానికి ఒక అతి మనోహరమైన కమలాన్ని సముద్రం ఇచ్చింది. 


హిమవంతుడు ఒక వాహన సింహాన్ని, అనేక వివిధాలైన రత్నాలను ఇచ్చాడు. (25–29)


కుబేరుడు ఎన్నటికి తఱగని మద్యం గల ఒక పానపాత్రను ఇచ్చాడు. ఈ భూమిని మోయువాడు, సర్వనాగులకు ప్రభువు, అయిన శేషుడు అత్యుత్తమ రత్నాలంకృతమైన సర్పహారాన్ని ఆమెకు ఇచ్చాడు. ఇదే విధంగా ఇతర దేవతలచేత కూడా భూషణ, ఆయుధ సమర్పణ రూపమైన సమ్మానాన్ని పొంది, ఆ దేవి మహోచ్చస్థాయి గల దీర్ఘనాదాన్ని, మహాట్టహాసాన్ని (పెద్ద నవ్వు) మాటిమాటికి చేసింది. 


ఆ అత్యంత భయంకరారావము మహోన్నతమై, అనంతమై ఆకాశమంతా నిండి గొప్ప ప్రతిధ్వనులను కల్పించింది. లోకాలన్ని వణికాయి, సముద్రాలు కంపించాయి. భూమి సంచలించింది. పర్వతాలన్ని కక్కదిలాయి. దేవతలు సమ్మోదంతో ఆ సింహవాహినికి జయధ్వానాలు చేసారు. మునులు భక్తితో వినమ్రదేహులై ఆమెను స్తుతించారు. (30–34)


ముల్లోకాలు సంక్షోభమొందడం చూసి సురవైరులు (రాక్షసులు) తమ సైన్యాలన్నింటిని సంసిద్ధమొనర్చి తమ ఆయుధాలను పట్టుకొని నిలబడ్డారు. మహిషాసురుడు "అహో ఇదేమి” అని కోపంతో పలికి అసంఖ్యాకమైన రాక్షసులతో పరివేష్టించబడి ఆ శబ్దం వైపుకు పరిగెత్తాడు. 


తన కాంతితో ముల్లోకాలు వ్యాపించి, తన పాదఘట్టనతో వంగిపోవు భూమినితో, ఆకాశాన్ని తాకుతున్న కిరీటంతో, వింటినారియొక్క టంకార ధ్వనితో సర్వపాతాళాలను సంక్షోభిల్లజేస్తున్న, తన వేయి బాహువులతో సర్వదిశలను పూర్ణంగా వ్యాపించివున్న ఆ దేవిని, అప్పుడు అతడు చూసాడు. అంతట ఆ దేవికి సురవైరులకు యుద్ధం ఆరంభమయ్యింది. (35-39)


ఆ యుద్ధంలో బహువిధాలుగా ప్రయోగింపబడిన శస్త్ర అస్త్రాలతో దిగంతరాలు దీపించాయి. మహిషాసురుని సేనానియైన చిక్షురుడనే మహాసురుడు చతురంగబల* సమేతులైన చామరుడనే ఇతర రాక్షసులు సహాయులై నిలువగా యుద్ధం చేసాడు. 


ఉదద్రుడనే పేరు గల ఒక గొప్ప రాక్షసుడు అటువదివేల రథాలతో, మహాహనుడనే వాడు నూఱులక్షల రథాలతో యుద్ధం చేసారు. అసిలోముడు అనే మటొక మహాసురుడు నూటయేబదిలక్షల రథాలతో, బాష్కలుడనే వాడు అఱువదిలక్షల రథాలతోను, యుద్ధంలో పాల్గొన్నారు. 


పరివారితుడనే మటొక రాక్షసుడు పెక్కువేల యేనుగులు, గుఱ్ఱములు, కోటి రథాలు తన్ను చుట్టిరాగా ఆ యుద్ధంలో పోరాడాడు. బిడాలుడు అనే అసురుడు నూరుకోట్ల రథాలు పరివేష్టించి ఉండగా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. (40–44)


వేలసంఖ్య గల ఇతర మహాసురులు కూడా, రథాలు, ఏనుగులు, గుజ్జాలను చుట్టూ చేర్చుకొని ఆ యుద్ధంలో దేవితో పోరాడారు.

(45-46)


యుద్ధంలో మహిషాసురుడు వేనవేలుకోట్ల గుజ్జాల చేత, ఏనుగుల చేత, రథాలచేత పరివేష్టింపబడి ఉన్నాడు. ఇతరులు చిల్లకోలలు, గుదియలు బల్లెములు, రోకండ్లు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు ధరించి యుద్ధం చేసారు. 


కొందరు బల్లెములను మణికొందఱు పాశాలను విసిరారు. వారు దేవిని చంపడానికి ఆమెను ఖడ్గములతో కొట్టారు. చండికాదేవి ఆ శస్త్రాస్త్రాలను అన్నింటిని తన శస్త్రాస్త్ర వర్షం కురిపించి అవలీలగా ఖండించి వేసింది. (47–48)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: