8, నవంబర్ 2020, ఆదివారం

భర్తృహరి

 విపది ధైర్య మధాభ్యుదయే క్షమా

సదసి వాక్పటుతా,యుధి విక్రమః,

యశసి చాభిరతి ర్వ్యసనం శ్రుతౌ

ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మానామ్.

                            - భర్తృహరి


ఆపదలందు ధైర్యగుణ, మంచి సంపదలందు దాల్మియున్

భూపసభాంతరాళమున, బష్క అవాక్చతురత్వ, మాజి బా

హాపటుశక్తియున్, యశము నం దమనురక్తియు, విద్యయందు వాం

ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్.

      - అనువాదం యేనుగు లక్ష్మణకవి


తా !! : ఆపదలు వచ్చినప్పుడు ధైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభయందు వాక్పాటవము, యుద్ధమునందు శౌర్యము చూపుట, కీర్తియందాసక్తి, వేదశాస్త్రాభ్యాసమునందు చింత- ఇవి మహాత్ములకు స్వభావ గుణములు.


వ్యాఖ్య : మానవుడు తన నిజ జీవితంలో ఏ ఏ సమయాల్లో ఎలా ఉండాలి అని తెలిపే శ్లోకమే ఇది. 1) ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా నిలబడాలి. కొందరు ఆపదలు రాకమునుపే వస్తాయేమోనని ప్రతీదానికి భయపడుతూ, అన్నింటికీ దూరంగా ఉంటారు. జరగవలసినది ఎలాగూ జరుగుతుంది. కేవలం మనం చేతనైన ప్రయత్నంచేస్తూ పోవాలి. కరోనా వ్యాధి వచ్చిందని కొందరు భయంతో, మరికొందరు ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోయారు. 2) సంపద కలిగినప్పుడు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలి. 3) సభలో మాట్లాడినప్పుడు సందర్భానికి తగిన విధంగా మాటలుచెప్పి, అనవసరమైన మాటలతో విసిగించక సమయ పాలన చేయాలి. 4) యుద్ధములో వెనుకంజవేయక సాహసం చూపాలి. 5) మనం కీర్తి పొందాలంటే మంచిపనులు చేయాలి, నలుగురికి సహాయం చేయాలి. అందుకని పబ్లిసిటీ చేసుకోకూడదు. 6) పై పనులన్నీ చేయాలంటే వేద శాస్త్రాలు తెలియాలి. ఇవి మనం ఎలా నడుచుకోవాలో తెలిపే మార్గదర్శకాలు.

కామెంట్‌లు లేవు: