రామాయణమ్..118
.
ఎదురుగా నిలుచున్న పర్వతాకారుడైన రాక్షసుని పేరు విరాధుడు.
.
అత్యంతజుగుప్సాకరమైన ఆకారం గలవాడు,ఏ అవయవమూ కూడా ఒకదానితో ఒకటి పొంతనలేకుండా అమరిఉన్నది వాడి వికృతాకారము చూపరులకు భయం కలిగిస్తున్నది.
.
ఒకపెద్ద శూలానికి మూడు సింహాలను,నాలుగుపెద్దపులులను,పదిచుక్కలజింకలను,పైన పసతోనిండిన దంతాలతోకూడిన ఏనుగు తలను గుచ్చి మోసుకుపోతున్నాడు.
.
సీతా రామలక్ష్మణులను చూడగనే వారిని చంపటం కోసం వారి మీదకు దూసుకుంటూ వస్తున్నాడు.
.
వచ్చీ రావడం తోనే వాడు సీతను లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకుని అందమైన ఈమెను నా భార్యను చేసుకొని మీ ఇద్దరినీ ఆహారంగా చేసుకుంటాను బాగా కండబట్టి ఉన్నారు మీ ఇద్దరూ అంటూ వికృతంగా వికటాట్టహాసం చేస్తుంటే పెనుగాలికి ఊగే చివురుటాకులా గజగజవణికి పోతున్నది సీతమ్మ.
.
వాడి ఒడిలో సీతమ్మ స్థితి చూసిన రాముడికి దుఃఖమాగటంలేదు .లక్ష్మణా అదిగో చూడు సుకుమారి,అల్లారుముద్దుగా పెరిగిన నా సీత ఎలా పరాయిమగాడి ఒడిలోకి నెట్టబడ్డదో చూశావా!
.
కైక కళ్ళు చల్లబడ్డాయి ఇప్పటికి! అయ్యో నాకెందుకు ఇంత దుఃఖము సంప్రాప్తించినది! నా రాజ్యము నాకు కాకుండా పోయినది ,నా తండ్రి మరణించాడు,నా భార్యను పరపురుషుడు తాకాడు.
.
రాముడి దీనాలాపాలు వింటున్న లక్ష్మణుడు ఒక్కసారిగా మహాసర్పము(పాము)లాగ బుసలుకొట్టాడు.
.
రామా ! దేవేంద్ర సమానపరాక్రమము గల నీవు చింతించడమా? నేను నీ దాసుడను .ఇదిగో ఇప్పుడే నేను ప్రయోగించే బాణము విరాధుడి రక్తమును భూమికి గల దాహం తీర్చగలదు..
.
వీరి సంభాషణ వింటున్న విరాధుడు ఎవరురా మీరిద్దరూ ఆడుదానిని వెంట పెట్టుకొని ముని వేషాలతో అడవులలో సంచరిస్తున్నారు.అని అడిగాడు.అప్పుడు తామెవరో రాముడు తెలియచేసి మరి నీవెవరు అని అడిగాడు.
.
అప్పుడు వాడు, నేను జవుడు,శతహ్రదలకు పుట్డినవాడను.
ఎవ్వరిచేత ఛేదించబడకుండా,చంపబడకుండా బ్రహ్మవద్దనుండి వరాలు పొందాను.మీరు నన్నేమి చేయలేరు. ఈ ఆడదానిని నాకు వదిలేసి వచ్చిన దారినే త్వరగా పారిపొండి నేనేమీ చేయను మిమ్ములను అని పలికాడు.
.
వాడి మాటలకు ఒక్కసారిగా రాముడి కన్నులు ఎర్రగా అయిపోయినాయి.ధనస్సును ఎక్కుపెట్టి బంగారుపొన్నులు గల ఏడు బాణాలను ఒక్కసారే సంధించి మహావేగంగా వదిలిపెట్టాడు ,అవి రయ్యిన దూసుకుంటూ వెళ్ళి వాడి శరీరాన్ని చీల్చి అవతలపడ్డాయి బుస్సుమంటూ రక్తం పొంగి వాడి శరీరంనుండి కార సాగింది.
.
ఆ బాధకు వాడికి కోపం వచ్చి సీతను దింపి శూలాన్ని ఎత్తి రామలక్ష్మణులవైపు పరుగెత్తాడు.వాడి మీదకు అన్నదమ్ములిరువురూ ఏకధాటిగా బాణవర్షం కురిపించినా వాడు లెక్కచేయక వారివురునీ చెరొక చేతిలో ఒడిసిపట్టుకుని తన భుజములకెక్కించుకొని అరణ్యంలో పరుగెత్తసాగాడు .అది చూసి బిగ్గరగా ఏడుస్తూ సీతమ్మకూడా వాడివెంట పరుగెత్తింది.
.
పరుగెత్తుకుంటూ ఏడుస్తూ తమను అనుసరిస్తున్న సీతను చూడగనే రాముడి హృదయంలో అగ్నిపర్వతము బ్రద్దలయినప్పుడు ప్రవహించే విధముగా క్రోధము కట్టలు తెంచుకొని ప్రవహించింది.
.
రామలక్ష్మణులు ఇరువురూ ఒకరికొకరు చెప్పుకుని వారు కూర్చుని ఉన్న రాక్షసుడి భుజాలను ఒక్కవేటుతో ఒకేసారి తెగ నరికారు.ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలపై కూలబడ్డాడు.
.
నేలపై పడ్డవాడిని కత్తులతో పొడిచి,ఖడ్గాలతో నరుకుతున్నా వాడు చావడంలేదు.
.
అప్పుడు బ్రహ్మ వరప్రసాది అయిన వాడిని చంపడం తమవల్లకాదని గ్రహించి ,తమ్ముడూ వీడిని మరల లేవకుండా భూస్థాపితం చేద్దాం ! నీవు వెంటనే వీడికి సరిపడా పెద్ద గొయ్యితవ్వు అని చెప్పి తాను వాడి కంఠం మీద కాలుపెట్టి వాడు లేవకుండా అణచిపట్టి ఉంచాడు.
.
శ్రీ రామచంద్రుడి చేతిలో చావుదెబ్బలు తిన్న వాడికి అప్పటికి గాని స్పృహ వచ్చి, రామా ! మహానుభావా నీవెవరో తెలుసుకొనలేక అజ్ఞానముతో ప్రవర్తించాను.ఓ కౌసల్యానందనా నిన్ను,లక్ష్మణుని ,సీతామాతను గుర్తించాను.కుబేర శాపము వలన నాకీ రూపము వచ్చింది.
.
ఎప్పుడైతే రాముడి చేతిలో చంపబడతావో నీ నిజ రూపం నీకు వస్తుందని చెప్పాడాయన.స్వామీ నా కళేబరాన్ని పాతిపెట్టండి అని పలికి నిజరూపాన్ని ధరించి ,ఓ రామా ఇటనుండి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగ మహర్షి ఆశ్రమము ఉన్నది అక్కడికి వెళ్ళండి మీకు శుభము కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
.
జానకిరామారావు వూటుకూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి