8, నవంబర్ 2020, ఆదివారం

శ్రీ శివ మహా పురాణము

 *🌹 . శ్రీ శివ మహా పురాణము - 267 🌹* 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

62. అధ్యాయము - 17


*🌻. సతీ కల్యాణము -2 🌻*


రుద్రుడిట్లు పలికెను -


ఓ సృష్టి కర్తా! నీతో మరియు నారదునితో గూడి నేను స్వయముగా ఆతని ఇంటికి వెళ్లగలను. కాన నీవు నారదుని స్మరింపుము (15). ఓ విధీ! నీ మానసపుత్రులగు మరీచి మొదలగు వారిని కూడా స్మరించుము. నేను వారితో, మరియు గణములతో కూడి దక్షుని గృహమునకు వెళ్లెదను (16).


బ్రహ్మ ఇట్లు పలికెను -


లోకాచార పరాయణుడగు ఈశ్వరుడిట్లు ఆజ్ఞాపించిగా, నేను నిన్ను (నారదుని), మరియు మరీచి మొదలగు కుమారులను స్మరించితిని (17). అపుడా మానసపుత్రులందరు నీతో గూడి నేను స్మరించినంతనే ఆనందముతో ఆదరముతో వెను వెంటనే అచటకు వచ్చేసిరి (18). 


శివభక్తా గ్రగణ్యుడగు విష్ణువును రుద్రుడు స్మరించగ ఆయన లక్ష్మీదేవితో గూడి తన సైన్యమును వెంటబెట్టుకొని గరుడుని అధిష్ఠించి వెను వెంటనే విచ్చేసెను (19). తరువాత చైత్ర శుక్ల త్రయోదశీ ఆదివారము ఉత్తరా నక్షత్రము నాడు ఆ మహేశ్వరుడు బయలు దేరెను (20).


ఆ శంకరుడు సర్వ దేవతాగణములతో, బ్రహ్మ విష్ణువులతో, మరియు మహర్షులతో కూడి మార్గము నందు వెళ్లుచూ మిక్కిలి శోభిల్లెను (21). 


దేవతలకు శివగణములకు, ఇతరులకు వెళ్లుచుండగా మార్గము నందు గొప్ప ఉత్సాహము, మనస్సులో పట్టరాని ఆనందము కలిగెను (22).


 గజము ,గోవు , వ్యాఘ్రము, సర్పములు, జటాజూటములు, మరియు చంద్రకళ అనునవి శివుని సంకల్పముచే యోగ్యమగు భూషణములుగా మారిపోయినవి (23). 


తరువాత శివుడు విష్ణువు మొదలగు వారితో గూడి బలశాలి, యోగశక్తి గలది అగు వృషభము నధిష్ఠించి క్షణకాలములో ఆనందముగా దక్షుని గృహమునకు చేరెను (24). 


అపుడు ఆనందముతో గగుర్పాటు గల దక్షుడు వినయముతో కూడిన వాడై తన బంధువులందరితో గూడి ఆయనకు ఎదురేగెను (25)


దక్షుడు తన గృహగమునకు విచ్చేసిన దేవతలనందరినీ స్వయముగా సత్కరించెను. శ్రేష్ఠుడగు శివుని కూర్చుండ బెట్టి, ఆయన ప్రక్కన మునులందరిని వరుసలో కూర్చుండునట్లు చేసెను (26). 


అపుడు దక్షుడు దేవతలనందరినీ, మరియు మునులను ప్రదక్షిణము చేసి, వారితో సహా శివుని ఇంటిలోపలికి దోడ్కోని వెళ్లెను (27).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: