8, నవంబర్ 2020, ఆదివారం

టిఫిన్ ప్రియులకు

 🔴▬▬▬ஜ💲ஜ▬▬▬🔴


*టిఫిన్ ప్రియులకు ఘుమఘుమలాడే మృష్టాన్న కథనం.!*


*ఈ కథా రచయిత "కృష్ణోదయ" ప్రతి ఫలహారాన్ని తాను స్వయంగా తిని, అనుభవించినంత లైవ్లీ గా కథనాన్ని వండి... మనకి నోరూరించేస్తున్నారు.!*


*మన చిన్న నాటి ప్రాచీన పెంకుటిళ్ళ హోటళ్ళ నుండి.. నేటి ప్రముఖ హోటళ్ళుగా రూపాంతరం చెందిన భిన్న సంస్కృతుల, నోరూరించే తరగని రుచుల కథాకమామిషు చదివితే చాలు.. తిన్నంత సంతృప్తి చెంది, అది తీరక.. గుంటూరుకి టికెట్ బుక్ చేసుకుంటారు కూడా.!*


*మరి, పదండి..*

*గుంటూరుకి ఓ టూరేద్దాం.!*💲👇



*"గుంటూరు (బ్రాడీపేట, అరండల్ పేట) వారి టిఫిన్స్ వైభవం"*

_రచన: కృష్ణోదయ_


సాయి విలాస్ ఒక్కగది పెంకుటింట్లో నడిచేది.. రెండు ఇడ్లి 7 పైసలు మాత్రమే.. పచ్చడి కొంచెం పల్చన చేసేవాడుగానీ రుచిగా శుచిగా ఉండేది.. 


రెండు వీధులు అవతలికి వెళితే అరండల్ పేట 4వ లైను ఒకటో అడ్డ రోడ్డు మూలమీద చిన్న పెంకుటింట్లో ఉండేది లక్ష్మీ విలాస్.. **ఓనర్ మునుస్వామి.. మనిషి నల్లటి నలుపు, తెల్లటి పైజామా లాల్చీ వేసుకుని, జుట్టు పైకి దువ్వుకుని, వీధి గుమ్మంలో గల్లాపెట్టె దగ్గర దేవుడికి అగ్గరుబత్తి హారతి పడుతూ కనిపించేవాడు పొద్దున్నే ఐదున్నరకి.. వెనకనున్న వంటగదిలోంచి సాంబార్ వాసన ఘుమ ఘుమా రోడ్డుమీదకు కొడుతుండేది.. మేము ట్యూషన్ కి వెళుతున్న వాళ్ళం సాంబార్ వాసనకి అప్రయత్నంగా తలతిప్పి మునుస్వామి దర్శనం చేసుకునేవాళ్ళం.. సాంబార్ వాసనకి జివ్హ చవులూరుతుంటే, ముందు రాత్రే అమ్మని బతిమాలి బామాలి తీసుకున్న పది పైసలు పదిలంగా జేబులో ఉన్నాయని ధృవ పరుచుకుని, ముందుకు కదిలేవాళ్ళం..  


ఏడు గంటలకి ట్యూషన్ నుంచి తిరిగివచ్చే సమయానికి లక్ష్మీ విలాస్ కిటకిటలాడుతూ ఉండేది.. నా ప్రియతమ సర్వర్ ఎక్కడున్నాడో చూసి అక్క టేబుల్ ఖాళీ అయ్యేవరకు ఆగి బైఠాయించేవాణ్ణి.. ప్రియతమ అని ఎందుకన్నానంటే నాకేం కావాలో వాడికి తెలుసు, ఏమీ చెప్పక్కరలేదు, అడగక్కరలేదు.. రెండు నిముషాల్లో పొగలుకక్కుతున్న ఇడ్లి సాంబార్ నా ముందుకు వచ్చేది.. ప్లేట్ నిండా సాంబార్, అందులో పప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు తేలుతూ నయనానందం కలిగిస్తే, ఘుమఘుమలకి ఘ్రాణ శక్తి రెట్టింపై, లాలాజలం బైటికి కారిపోయేదంటే నమ్మండి.. ఎక్కడ అయిపోతుందోనని నెమ్మదినెమ్మదిగా ఒక్కొక్క చెంచా పూర్తిగా ఆస్వాదిస్తూ ఒక్క ఇడ్లీతో ప్లేటు సాంబార్ లాగించేసి విజయవంతంగా అటుఇటు చూస్తుండగానే నా ప్రియతమ మళ్ళీ సాంబార్ తెచ్చి ప్లేట్ నింపేవాడు.. సాంబార్ ఆఖరిబొట్టు వరకు తృప్తిగా లాగించేసి తేన్చుకుంటూ గల్లాపెట్టెమీద పది పైసలు పెడితే, రెండు పైసలు తిరిగిఇస్తూ సాంబార్ బాగుందా బాబూ అని అడిగేవాడు మునుస్వామి మల్లెపూవులాగా నవ్వుతూ.. నిజం చెప్పొద్దూ నాకు సిగ్గేసేది ఆబగా తినేశానని.. మా ఎదురింటి అనంత్ కి మునుస్వామి ఇడ్లి కారప్పొడి అంటే ప్రాణం.. అరటి ఆకులో రెండిడ్లీలు కారప్పొడి వేసి ఆ రెంటి మీద సువాసనలు వెదజల్లే నెయ్యి చేతికి ఎముక లేకుండా పోసి అదాటున కొబ్బరి పచ్చడి ఇచ్చేవాడు.. అనంత్ వాటిని క్షణాల్లో గుటకాయస్వాహా చేసి మళ్ళీతే అనేవాడు.. క్షణాల్లో ఇడ్లి మాయమయినా అరటి ఆకు నల్లగా మాడిపోతే మేము ఆశ్చర్యంగా చూసేవాళ్ళం.. సత్తు ప్లేటులో పెడితేనేం ఏం రుచి ఏం రుచి, లక్షి విలాస్ లో ఇడ్లి తినకపోతే బతుకు దండగరా అనేవాడు అనంత్.. 


మరో పదిఅడుగులు ముందుకు వేస్తే డాబా ఇంట్లో గీతా కేఫ్.. ఇందులో కూడా జనం కిటకిటలాడుతూ అన్ని రకాల టిఫిన్స్ లాగించేస్తారుగానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూరీ.. ఒక్కో పూరీ సైజులో ప్లేట్ కి సరిపడా ఉండేది.. బూరల్లాగా ఉబ్బిన రెండు పూరీలు కింద పడిపోకుండా నాట్యమాడుతూ సర్వర్ తీసుకొస్తుంటే అబ్బురంగా చూసేవాళ్ళం.. దానితో పాటు ఇచ్చే బంగాళాదుంప కూర చూడటానికి దుంప ఉల్లి పసుపేసి ముద్దకొట్టినట్టు ఉండేది.. చూడ్డానికి అబ్బే అనిపించినా నోట్లోపెట్టుకుంటే మాత్రం అంతా విష్ణుమాయ, స్వర్గానికి బెత్తెడు దూరంలో సజీవంగా నిలబడేవాళ్ళం.. ఇక పూరీని ముట్టుకోవాలంటే కొంచెం సందేహించేవాళ్ళం.. బుస్సుమని వదిలే ఆవిరికి వేళ్ళు కాలేవి.. భద్రం భద్రం అంటూ తినటానికి ఉపక్రమించేవాళ్ళం.. పూరీ ఉల్లిపొరలాగా పొరలు పొరలు ఒచ్చేది.. నోట్లో పెట్టుకుంటే నమిలే శ్రమ లేకుండా యిట్టె కరగిపోయేది.. ఇంతుందేమిటి అని చూడగానే అనిపించినా తినేశాక అప్పుడే అయిపోయిందా అని కించిత్తు నొచ్చుకునేవాళ్ళం .. 


మరో నాలుగడుగులు ముందుకి వేస్తే మెయిన్ రోడ్ జంక్షన్.. ప్రఖ్యాత శంకర విలాస్ జంక్షన్.. శంకర విలాస్ పేరు వింటేనే పొట్టలో కరకరలాడుతుంది.. అన్ని టిఫిన్స్ చాలా బావుంటాయని వేనోళ్ళ పొగడబడ్డ హోటల్.. గుంటూరు హోటల్స్ కి శంకర విలాస్ క్రికెట్ ఆటకి కపిల్ దేవ్ లాంటిది.. అదేంటి అనకండి.. భారత్ కి క్రికెట్ ఆటలో గెలుపు రుచి చూపించినవాడు కపిల్.. అదృష్టం మీద ఆధారపడకు, నిన్ను నువ్వు నమ్ముకో, కష్టపడి పనిచేయి, పోరాడితే విజయంనీదే అనే స్ఫూర్తిని కలిగించిన వాడు కపిల్.. బ్రిడ్జికి ఇవతల ఊరు విస్తరిస్తున్న రోజుల్లో ఒక పెంకుటింట్లో మొదలైంది శంకర విలాస్.. రుచికి శుచికి పెట్టింది పేరు.. కొద్దిరోజుల్లోనే శంకర విలాస్ టిఫిన్స్ కి మారు పేరు అయింది .. మునిసిపాలిటీవారితో నిమిత్తం లేకుండా ఆ కూడలి శంకర విలాస్ కూడలి ఐంది.. వ్యాపారాన్ని విస్తరించే దిశగా పెంకుటిని డాబా ఇల్లుగా మార్చేశారు.. హోటల్ చాలా మంచి వ్యాపారం అనేంతగా ఎదిగిపోయింది శంకర విలాస్.. చుట్టుపక్కల కొత్త కొత్త హోటల్స్ పెట్టేరుగానీ శంకర విలాస్ కి దీటుగా నాణ్యత లేకపోతె మనలేమని ప్రతిఒక్క హోటల్ నాణ్యతపై శ్రద్ధపెట్టేది.. అంచేత బోలెడన్ని హోటల్స్ యమ రుచిగా టిఫిన్స్ అందించేవి మొదలయ్యాయి.. అందుకే అన్నాను Sankara Vilas is trend setter like Kapil in cricket.. శంకర విలాస్ విస్తరించి విస్తరించి మూడు నక్షత్రాల హోటల్ ఐంది ఇప్పుడు.. తిరణాల జరుగుతోందా అన్నంత మంది జనం ఉండేవారు శంకర విలాస్ ముందు.. అదిచూసి పక్కనే సెంట్రల్ కేఫ్ మొదలైంది.. శంకర విలాస్ లో ఖాళీ లేక తొందర పనిలో ఉన్నవాళ్లు పక్కనే మొదలైన సెంట్రల్ కేఫ్ కి వెళ్ళేవాళ్ళు.. నాణ్యత బానేవున్నా యాజమాన్యం బాగాలేక సెంట్రల్ కేఫ్ మూత పడింది.. 


శంకర విలాస్ కి ఫర్లాంగ్ దూరంలో మెయిన్ రోడ్ మీద బ్రిడ్జి ఎదురుగా లక్ష్మి థియేటర్ పక్కన ఉన్నది ఆనంద భవన్.. శంకర విలాస్ కన్నా పాతది అంటారు కొందరు.. కామోసు అని లోపలకి వెళ్ళగానే అనిపిస్తుంది.. నల్ల టేకుతో చేసిన రెట్టింపు సైజు కుర్చీలు బల్లలు నిగనిగలాడుతూ, చూడగానే పురావస్తుశాలకి రాలేదుగదా అనిపిస్తాయి.. రెండు కుర్చీలు దగ్గరికి జరిపితే ఒక మనిషి హాయిగా పడుకోవచ్చు.. కుర్చీమీద వెనక్కివాలి కూర్చుంటే బల్ల చేతికి అందదు.. టిఫిన్ తినాలంటే ముందుకి కూర్చోవాల్సిందే.. ఏది కావాలని అడిగినా క్షణాలమీద వచ్చేస్తుంది ఒక్క మూడు ముక్కల అట్టు తప్ప.. ఆర్డర్ ఇవ్వగానే మూడుముక్కలు అని పొలికేక పెట్టేవాడు సర్వర్.. లోపలికివెళ్ళి చెప్పేంత టైంలేదు మరి.. లోపల దోశమాస్టర్ పోలికేకలు లెక్కపెట్టుకుంటూ దోశలు వేసేవాడు.. అంతగా ఇష్టపడేవారు ఆనందభవన్ మూడుముక్కల పెసరట్టుని.. అట్టుని మూడుభాగాలుగా విభజించి ఒక్కో భాగంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం అద్ది, కూసింత నెయ్యి తగిలించి దోరగా కాల్చేవాడు.. వేడివేడి అట్టు అల్లం పచ్చడితో లాగిస్తూ ఆ యమహా రుచికి కారణం గురజాలనుంచి తెప్పించిన పెసలు అని ఒకరు, అతి సన్నగా తరిగిన అద్దింపు అని ఒకరు, కాదుకాదు ప్రత్యేకంగా కాచిన శుద్ధ నెయ్యి అని ఒకరు వాదించుకునేవారు.. చివరికి ఏదీ తేలక ఏ నలుడో భీముడో శాపవశాన ఆనంద భవన్ దోశమాస్టర్ గ పుట్టివుంటాడని తేల్చేశేవారు.. తృప్తిగా తిని నిలువెత్తు కౌంటర్ బల్ల వెనకున్న మనిషిని వెతుక్కుని, బిల్లు చెల్లించి ఆనందో బ్రహ్మ అనుకుంటూ బయటపడేవాళ్లు.. టిఫిన్స్ గోలలో పడి మర్చిపోయానండోయ్.. ఆనంద భవన్ అరిటాకు భోజనానికి చాలా ప్రసిద్ధి.. అంతంత పెద్ద బల్లలు వేసింది అందుకే కాబోలు..!


బ్రిడ్జికి ఇవతలివైపు కాంతిలాల్ అనే రాజస్థానీ బలరాం హోటల్ నిర్వహించేవాడు.. ఇక్కడ ఉత్తరాది మిఠాయిలు, పూరి, చపాతీ మరియు చాయ్ మాత్రమే దొరికేవి.. శేషమహల్, రంగ మహల్ సినిమాహాల్స్ కి అనుకుని ఉండేది బలరాం.. ఇక్కడ పగటి వ్యాపారం తక్కువ, సాయంత్రం అవగానే కిక్కిరిసిపోయేది.. సినిమాకి వెళ్లేవాళ్లు ఇక్కడ టీ తాగకుండా పోరు.. సినిమా జనాన్ని తీసేస్తే మిగిలినవాళ్లు చపాతీ కోసం అర్రులు చాచేవారు.. నిజానికి ఆ ఆరాటం చపాతీకోసం కాదు దానితోపాటు ఇచ్చే కుర్మా కోసం.. నూనెలో దేవుతూ ఎర్రగా ఉండే కుర్మా.. అందులో చిన్నచిన్న తెల్లటి కూరముక్కలు ఏమిటో తెలిసేవి కాదుకానీ తినటానికి చాలా బాగుండేవి.. కుర్మా ఉత్తరాది వంటకం.. బలరాం కుర్మా వండటంలో మాస్టర్స్ చేసివుండాలి.. ఒక్క కుర్మాతోనే దశాబ్దాలుతరబడి వ్యాపారం నడిపాడు..!


అరండల్ పేట 7వలైన్ మెయిన్ రోడ్ మీద స్వాగత్ హోటల్.. ఉల్లిదోసె తినాలంటే ఇక్కడే.. దోశలోపల సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనె నిండుగా ఉండేవి.. చూడగానే అబ్బా ఇంత నూనె కొట్టేడే అనిపిస్తుందిగానీ తిన్నాక ఏమీ ఇబ్బంది ఉండేదికాదు.. దోశ ఉల్లి కలగలిపిన సువాసన గమ్మత్తుగా ఉండేది.. దోశతో పాటు చింతపండు పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉండేవి.. ఏం వేసి చేసేవాడోగానీ చింతపండు పచ్చడి మళ్లీమళ్లీ అడిగి వేయించుకునేవారు.. ఉల్లిదోశకి మారుపేరు స్వాగత్ అంటే అతిశయోక్తికాదు..!


మసాలాదోశ తినాలనిపిస్తే బ్రాడీపేట 4వ లైన్ 5వ అడ్డరోడ్డునున్న మైసూర్ కేఫ్ కి దారి తీయాల్సిందే.. శంకర నారాయణ అనే కన్నడం అతను ఈహోటల్ నడిపేవాడు.. మెయిన్ రోడ్డుకి దూరంగా రద్దీలేనిచోట హోటల్ నడపాలంటే ధైర్యం కావాలి.. ఆ ధైర్యాన్ని దేశ విఖ్యాత రవి ట్యుటోరియల్ కాలేజీ పక్కనే చోటు సంపాదించి కూడకూడగట్టిఉంటాడు .. కొంచెం కర్ణాటక పద్ధతిలో ఉండే టిఫిన్స్ త్వరలోనే జనరంజకమయ్యాయి .. మసాలా దోశ చట్నీ విడివిడిగా తింటే అంత గొప్పగాలేవే అనిపిస్తుంది.. కలిపితింటే అమోఘమైన రుచి.. మసాలా కూర పూర్తి కర్ణాటక పద్ధతిలో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం దాల్చిన పొడి వేసి చేస్తారు.. టిఫిన్ తిన్నాక కాఫీ తాగకుండా బయటికి వెళ్ల లేం కదా..! 


*అదీ.. గుంటూరు వారి టిఫన్ & భోజనం మహాత్యం.!*😃

కామెంట్‌లు లేవు: