13, అక్టోబర్ 2020, మంగళవారం

16-04-గీతా మకరందము

 16-04-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక అసురసంపదను (అసురగుణములను) పేర్కొనుచున్నారు -


దమ్భో దర్పోఽభిమానశ్చ 

క్రోధః పారుష్య మేవ చ | 

అజ్ఞానం చాభిజాతస్య 

పార్థ సమ్పదమాసురీమ్ || 


తాత్పర్యము:- ఓ అర్జునా! డంబము, గర్వము, అభిమానము (దురహంకారము), కోపము, (వాక్కు మున్నగువానియందు) కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి. (అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించినవానికి కలుగుచున్నవని భావము).


వ్యాఖ్య:- ఇదివఱలో తెలుపబడిన సుగుణములను దైవనిష్ఠులు, భక్తులు, ఎట్లు సంపదగను, గొప్పదనముగను భావించుచున్నారో అట్లే ఈశ్లోకమునందు తెలుపబడిన దుర్గుణజాతమును అసురులు, దుర్మార్గులు గొప్పసంపదగ తలంచుకొని మురిసిపోవుచు వానినే ప్రీతితో సేవించుచున్నారు. కాబట్టియే వానికి అసురసంపదయను పేరు గలిగినది. అంతియేకాని వాస్తవముగ అవి సంపద్రూపములుకావు. దారిద్ర్యరూపములేయగును. పూర్వము ఇరువదియాఱు సుగుణములను పేర్కొని, ఇపుడు ఆఱు దుర్గుణములను మాత్రము వచించుచున్నారు. ఈ దుర్గుణములనే వివరించి భగవానుడు విస్తారముగ చెప్పబోవుదురు. సాధకుడు మాయతో, ప్రకృతితో, అవిద్యతో నొనర్చు సంగ్రామమందు స్వపక్షవీరులను, ప్రతిపక్షవీరులను ఇరువురినిగూర్చి బాగుగ తెలిసికొని యుండవలెను. అపుడే స్వపక్షసైనికులను బలపఱచుకొనుటకును, పరపక్షసైనికులను దునుమూడుటకును వీలుండును. కనుకనే భగవాను డిచట దైవసంబంధమైన పవిత్రగుణములను పేర్కొని అంతటితో ఊరుకొనక అసురసంబంధమైన అపవిత్రగుణములనుగూడ పేర్కొనుచున్నారు. ఒకయిల్లు శుభ్రముగానుండవలెననిన, అందు పూర్వముండిన దుమ్ము, బూజు, మురికినీరు మున్నగువానిని నిర్మూలించి, శుభ్రజలముచే కడిగి, ధూపాదులచే ఇంటిని పరిమళవంతముగజేసి, త్రాగుటకు బయటనుండి మంచినీరు మున్నగువానిని లోనికి తెచ్చుకొనవలెను. శరీరము ఆరోగ్యముగ, పుష్టిగ నుండవలెననిన, లోనగల మలమూత్రాదులు బయటపోవలెను; చక్కని పుష్టికరఆహారము, పానీయము లోనికి పోవలెను. ఆ ప్రకారముగనే మనఃపారిశుద్ధ్యము నిమిత్తము ఆ మనస్సునందు అనాదిగనుండుచున్న దుష్టప్రవృత్తులను, దుర్వాసనలను, దుర్గుణములను బయటకుగెంటివేసి, అనగా ఆసురీసంపదకు ఉద్వాసనముచెప్పి, సద్గుణములను (సచ్ఛీలమును) అనగా దైవీసంపదను ఆహ్వానించవలెను, అవలంబించవలెను.

       దుర్గుణములలో మొట్టమొదట దంభము చెప్పబడినది. పరమార్థరంగమునగాని ఏ రంగమునగాని కపటము, వేషము, మోసము పనికిరాదు. తాము గొప్పవారమని నటించినంత మాత్రమున ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కాని భగవంతుని మోసపుచ్చలేరు. వారి హృదయగుహయందు దాగి వారి సంకల్పములన్నిటిని సర్వేశ్వరుడు కనిపెట్టుచునేయున్నాడు. కాబట్టి డంబమను దుర్గుణమును మొదలంట నఱకివేయవలెను. గర్వమును పారద్రోలవలెను. తనకేదైన గొప్పవిద్యగాని, అధికారముగాని లభించినచో గర్వపడక, అదియంతయు సర్వేశ్వరుని యనుగ్రహమువలననే కలిగినదని భావించి వినయాన్వితుడై యుండవలెను. అట్లే క్రోధమును విడువవలెను. దైవగుణములలో ‘అక్రోధము’, అసురగుణములలో ‘క్రోధము’ చెప్పబడుట గమనింపదగినది. అక్రోధమును గ్రహింపుమని చెప్పినను, క్రోధమును త్యజింపుమని చెప్పినను రెండును ఒకటే. దైవ, అసురసంపత్తుల రెండిటియందును క్రోధమును గూర్చిన ప్రస్తావన వచ్చుట వలన క్రోధరాహిత్యము అధ్యాత్మక్షేత్రమున ఎంత ఆవశ్యకమో తేటతెల్లమగుచున్నది. మఱియు సాధకుడు పరుషముగా మాట్లాడరాదు. వాక్కు మున్నగు వానియందు కాఠిన్యము చూపరాదు. దైవగుణములలో పేర్కొనబడిన "మృదుత్వము”నే స్వీకరించవలెను.


ప్రశ్న:- అసురగుణము లెన్ని చెప్పబడెను? అవియేవి?

ఉత్తరము:- ఆఱు. అవి క్రమముగ (1) డంబము (2) గర్వము (3) అభిమానము (4) కోపము (5) కాఠిన్యము (6) అవివేకము అనునవి అయియున్నవి. ఈ దుర్గుణములే ఆసురీసంపద యనబడును.

ప్రశ్న:- ఈ దుర్గుణముల నేమిచేయవలెను? 

ఉత్తరము:- లెస్సగ పరిత్యజించవలెను.

కామెంట్‌లు లేవు: