13, అక్టోబర్ 2020, మంగళవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


109 - విరాటపర్వం.


మత్స్యదేశ పౌరులు యెల్లవేళలా, పాండవుల ప్రజ్ఞా విశేషాలను కీర్తిస్తూ ఆరుబయలు స్థలాలలో కధలు కధలుగా వారిని గురించి వర్ణిస్తూ చెప్పుకుంటుంటే, మారువేషాలలో వున్న పాండునందనులు యెంతో మురిసిపోయేవారు.  


విరాటరాజు కొలువులో కంకుభట్టు పాత్రను ధర్మరాజు యెంతో సమర్ధవంతంగా, విరాటరాజు గారికి సంతృప్తి కలిగేలా నిర్వహిస్తున్నాడు. తనకు వున్న ద్యూతవిద్యతో, అలవోకగా పాచికలను విసురుతూ, విరాటరాజు కోరిన పందెంవేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇంకొక ప్రక్క వల్లవుడు నామంతో, రకరకాల రుచులతో విరాటరాజు పాకశాలను మధురపదార్ధాలతో నింపివేస్తూ, సునాయాసంగా, కావలసిన వంటచెరకును, తన భుజస్కందాలపై అవలీలగా మోసుకొస్తూ, భీమసేనుడు అందరి మన్ననలూ పొందుతున్నాడు. నగరపౌరులకు ఒక నాయకత్వ లక్షణాలు వున్న యోధునిలాగా కనబడసాగాడు. అప్పుడప్పుడు తీరికసమయంలో మల్లవిద్య కూడా ప్రదర్శిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకతను, యేర్పరచుకున్నాడు. అయితే, మిగిలిన పాండవులూ, ద్రౌపదీ, యేవిధమైన ప్రత్యేకతలు బైటకు చూపించకుండా, గౌరవంగా కాలం నెట్టు కొస్తున్నారు. వారిని గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నారు.


ఈ విధంగా, విరాటరాజు కొలువులో పాండవులకు మూడునెలలు గడిచిపోయాయి. కాలమొక్కరీతిగా వుండదుకదా ! నాల్గవమాసంలో విరాటరాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వారు జరుపుకొనే, ' బ్రహ్మోత్సవం ' అనే వేడుక వచ్చింది. అందులో భాగంగా దేశదేశాలనుండి, మల్లయుద్ధ వీరులు మత్స్యదేశానికి వచ్చి వారి పరాక్రమం ప్రదర్శించి, విరాటరాజు చే సత్కరింపబడి, ధనము,కనుకలూ, కీర్తీ మూటగట్టుకుని ప్రతీసంవత్సరం లాగానే వెళ్తున్నారు.


అలావచ్చిన మల్లయుద్ధవీరులలో, జీమూతమల్లుడు ఒకడు. అతి పెద్దకాయంతో, గట్టిగా గర్జిస్తూ, కేవలం, నైపుణ్యప్రదర్శనే లక్ష్యంగా కాకుండా, అహంభావంతో తొడగొట్టి,అక్కడి మల్లయోధులను రెచ్చగొడుతూ, కించపరుస్తూ, నానా అల్లరి చేస్తున్నాడు. తనతో మల్లయుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. వినయంలేని, విద్యను ప్రదర్శించి విరాటుని మెప్పు పొందాలని చూస్తున్నాడు.


ఇది అంతా గమనిస్తున్న, విరాటరాజుకు, అతడి తెంపరితనానికి, యేవిధంగా సమాధానం చెప్పాలో తోచక, ముందుగా ఆస్థాన మల్లయోధులను బరిలో దింపి, జీమూతమల్లుని యెదుర్కొనేటట్లు చేశాడు. అయితే, వారు అతనిముందు నిలబడలేక, కొద్దిసేపటికే వెనుకకు తగ్గారు.  


అప్పుడు హఠాత్తుగా విరాటరాజుకు, తమ పాకశాలలో, ముఖ్యుడుగా వున్న వల్లవుడు, అతని, కండలుతిరిగిన బలిష్ఠదేహం, అతను వంటచెరకును, తన భుజాలపై తీసుకు వచ్చే తీరు స్ఫురణకు వచ్చాయి. వెంటనే వల్లవుని అతనిపై మల్లయుద్ధం చెయ్యమని అడుగుతూ, కంకుభట్టు వైపు కూడా యిది మంచి ఆలోచనే కదా అని అడిగినట్లు చూసాడు. . అందుకు కంకుభట్టు విరాటరాజును మెచ్చుకోలుగా చూస్తూ, తన తల పంకించాడు.  


ఇప్పుడు భీమసేనుడు ధర్మసంకటంలో చిక్కుకున్నాడు. తమ అజ్ఞాతవాసం యిప్పుడే నాలుగవ మాసం లోనికి వచ్చింది. ఇంకా తొమ్మిదినెలలు రహశ్యజీవితం వారు గడపాల్సిన అవసరం వున్నది. ఇట్టి పరిస్థితులలో, తన మల్లయుద్ధవిద్య జీమూత మల్లుని వంటి వానిపై ప్రదర్శిస్తే, తమ వునికి బయటపడే ప్రమాదం వున్నది.   


కాదూ, తనకు పట్టనట్లు వుందామా, రాజాజ్ఞ ధిక్కరణ, తమకు ఆశ్రయం యిచ్చిన విరాటరాజ్యప్రతిష్ట. ఈ రెండిటి నడుమ కొట్టుమిట్టాడుతూ ధర్మజుని అంగీకారానికై చూసి, ఆయన తన నుదిటి పై వ్రేలితో వ్రాసుకుని, విధి బలీయం అన్నట్లు సంజ్ఞ చేయగా, యేది యేమైనా కానీ, అని తనసహజ సమరోత్వహంతో జీమూతమల్లుని మట్టు పెట్టడానికి, బరిలోకి దిగాడు, ప్రజల హర్షధ్వానాల మధ్య, విరాటరాజు, కంకుభట్టుల ఆశీర్వాదం తీసుకుని.    


నడుం బిగించి, సింహమువలె గర్జిస్తూ, మదపుటేనుగుపై లంఘించినట్లు, జీమూత మల్లునిపై దూకాడు, భీమసేనుడు. యుద్ధనీతిలో భాగంగా అతనితో చేతులు కలిపి కరస్పర్శ చేసాడు. ఇక అక్కడినుండి, రకరకాల మల్లయుద్ధ విన్యాసాలతో, రెండు మదపుటేనుగులు కుమ్ముకుంటున్నట్లుగా, యిరువురూ భయంకర మల్లయుద్ధం చేసి, చూపరులను ఆశ్చర్యానికి లోనుచేశారు. వారి హస్తచాలనము, పాదపీడనమూ అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుండగా, మల్లయుద్ధవీరులు కూడా తమకు తెలియని విషయాలను వీరి పోరాటంలో చూసి నేర్చుకుంటున్నారు .  


తన సింహనాదంతో, జీమూతమల్లుని భయభ్రాంతుని చేసి, ఒక్కసారిగా అతని పైబడి, రెండు బలమైన చేతులతో ఒడిసి పట్టుకుని, జీమూతమల్లుని చలన రహితుడిని చేస్తూ, ఒక పెద్ద బండరాయిని పైకెత్తినట్లు, పట్టుకుని, బండి చక్రాన్ని ఆకాశం వైపు చూపి త్రిప్పినట్లు, అతనిని గిరగిరా త్రిప్పసాగాడు. ప్రేక్షకులు అప్పటికే భీమసేనుని బలపరాక్రమాలతో మమేకమై వున్నందున, హర్షధ్వానాలతో, భీముని ఉత్సాహపరిచారు. భీమసేనుడు, జీమూతమల్లుని ఆ విధంగా త్రిప్పి, తిప్పి, ఒక్కసారిగా నేలపైకి విసరి వేసాడు. పెద్ద వృక్షం కూకటివేళ్లతో పెద్ద శబ్దంతో పెనుతుఫానుకు ఒరిగినట్లు జీమూతుడు నేలకూలాయి అసువులుబాసాడు. విరాటరాజు గొప్ప సంతోషంతో, భీమసేనుని ప్రశంచించి, అనేకకానుకలు యిచ్చి, విరాటదేశ కీర్తి ప్రతిష్టలు కాపాడినందుకు, వేనోళ్ళపొగిడాడు. 


ఆ సంఘటన తరువాత, భీమసేనుడు అంత:పుర కాంతల దృష్టిలో కూడా పడి, వారికాలక్షేపం కోసం, క్రూర జంతువులతో భీమసేనుడు తరచూ తలపడే ఏర్పాట్లు చేయించుకుని, చూసి ఆనందించేవారు. ఆవిధంగా భీమసేనుడు ఒక వినోదక్రీడకు ఆటపట్టుగా మారి, అందరినీ తన బాహుబలంతో రంజింపజేస్తూ వుండేవాడు.  


అయితే, పాండవ పట్టమహిషి, ద్రౌపది, మారువేషంలో వున్న సైరంధ్రి, వాయుదేవుని వరపుత్రుని, గొప్ప గొప్ప రాక్షసులను సంహరించిన వాడిని, భీమసేనుని, విరాటరాజ్య స్త్రీలు క్రీడా వస్తువుగా వాడుకుంటున్న తీరుచూసి, మిగుల ఆవేదన చెందుతూ వుండేది. అన్నిటికీ ఒకే సమాధానం. విధి బలీయం. చూద్దాం ! ముందు ముందు విరాటరాజు కొలువులో పాండవులు యెదుర్కొనే సన్నివేశాలు, యింకా యెలావుంటాయో !


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: