13, అక్టోబర్ 2020, మంగళవారం

సభా పర్వము – 1

 సభా పర్వము – 1

మయసభా వైభవం


కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్ర ప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేసాడు.


అర్జునుని చూసిన దానవ శిల్పి మయుడు ” అర్జునా ! నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బ్రతికాను. నేను దానవ శిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను ” అన్నాడు. అర్జునుడు కృష్ణుని వంక చూసాడు. శ్రీకృష్ణుడు ” కురువంశ మహారాజు ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు ” అని మయునితో అన్నాడు. మయుడు ” ఈ భూమిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారంణాంతాల వలన నిర్మించ లేక పోయాను. ఉపకరణాలను బిందుసరము అనే సరోవరంలో దాచాను వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను. నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి దేవదత్తము అనే శంఖమును అర్జునినికి ఇస్తాను ” అన్నాడు.


మయుడు బిందుసరములో ఉన్న దూలాలూ, కంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురగలను, మరకత మణులతో నీటిలోని నాచుని తయారు చేసాడు. అవి నిజమని బ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటీ పక్షులు, పాక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనం పదునాలుగు మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని ఎనిమిది వేల మంది బలిష్టులతో ఆకాశమార్గాన మోసుకు వచ్చి ధర్మరాజుకు బహూకరించాడు. ధర్మరాజు ఒక శుభ ముహూర్తాన పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయసభా ప్రవేశం చేసాడు. సామంతరాజులు ధర్మరాజు ని దర్శించి కానుకలు సమర్పించారు.

కామెంట్‌లు లేవు: