13, అక్టోబర్ 2020, మంగళవారం

_*శ్రీ దేవి భాగవతం

 _*శ్రీ దేవి భాగవతం - 56 వ యధ్యాయము*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*శ్రీదేవి కాశిలో నివసించుట*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




వ్యాసు డిట్లనెను : ఆ భవానీదేవి హితవు నాలకించి సుబాహువు భక్తి యుక్తితో శ్రీదేవి కిట్లనియెను. ఒకవంక దేవలోక భూలోకముల విశాల రాజ్యసంపదలు, మరొకవంక నెనలేని నీ దివ్య సందర్శన భాగ్యము. ఓ బ్రహ్మాండ జననీ! ఈ ముల్లోకములందును నీ దివ్య సందర్శనమునకు సాటివచ్చున దేదియును లేదు. నీ దర్శనముచే నేనీభూమిపై ధన్యుడనైతిని. నేనింకేమి కోరుదును? ఐనను నేనొక వరము గోరుచున్నాను. నీ పాద పద్మములందు నా కైకాంతిక ప్రేమభక్తి కుదురుగ నుండుగాక. ఓ మాతా! ఈ పవిత్ర కాశీనగరిలో నీ శక్తిరూపము దుర్గాదేవి నామమున నెల్లకాలము నెలకొని యుండునుగాక! సుదర్శనుని శత్రు సంఘములనుండి మమ్ము సురక్షితముగ రక్షించితివి. అటులే నీ వీ నగరమును నిత్యము బ్రోచుచుండుము. ఓ జగజ్జననీ! ఈ భూమిపై నెంతకాలము కాశీపురి సుస్థిరమై ప్రసిద్ధినంది యలరారుచుండునో యంతకాలము నీవిట నెలకొనియుండి దానిని నీవు ప్రోచుచుండుము. నాకీయొకేయొక వరమిమ్ము. నేనింతకు మించి యేమియును గోరను. అమ్మా! నాకు సకలవిధకామము లొడగూర్పుము. నా వైరులను దునుమాడుము. లోకమందలి యమంగళమును ప్రతిహత మొనరింపుము. ఈ విధముగ తన్ను సంస్తుతించి వరములు పొంది తన సమక్షమున కేలుమోడ్చి నిలుచున్న సుబాహుని గని దుర్గతినివారిణి యగు దుర్గ సుప్రసన్నయై యతని కిట్లనియెను: రాజా! ఈ భూమి నిలుచునందాక నేనీ యవిముక్త క్షేత్రమునందు విశ్వసంరక్షణకై నివసింతును.' ఆపిమ్మట సుదర్శనుడు ప్రమోదసంభరితుడై వచ్చి పరమ భక్తితో మోకరిల్లి జగదంబిక నీ విధముగ కొండాడెను.



ఓహో దేవీ ! నీ దయ నెంతని వర్ణింతును? నేను భక్తి హీనుడనైనను నీచేత గాపాడబడితిని. ఎల్ల దేవతలు భక్తులపై దయజూపుదురు. కాని, నీవు మాత్రము భక్తి లేనివారిపైగూడ దయ జూపుదువు. ఇది నీ ముఖ్యవ్రతము. మహాదేవీ! నీ వీ బ్రహ్మాండము లన్నిటిని పుట్టించి పెంచి తుదకు సంహారమొనర్తు పని నేను వింటిని. అట్టి నీవు నన్నొక్కని బ్రోచుట వింతగాదు. అమ్మా భవానీ! నేను కార్యమూఢుడను. నేనిపుడేమి చేయవలయును? ఎచటి కేగ వలయును? నన్నాదేశింపుమమ్మా! నీయాన తలదాల్చి వెళ్ళుదును. విహరింతును, మనుదును. అపుడు దేవి దయాంతరంగయై యతని కిట్లనియెను. ఓ మహాభాగా! నీ వయోధ్య కేగి నీ కులోచితముగ రాజ్యమేలుము. నన్ను నియతముగ భక్తితోడ సంస్మరించుచు బూజించుచుండుము. నేను నీ రాజ్యమందు నిత్య సుఖశాంతులు నెలకొలుప గలను. నీవష్టమీ నవమీ చతుర్దశులందు నన్ను గుఱించి ప్రత్యేకముగ బలివిధానముతో నా పూజ లొనర్పవలయును. ఓ యనఘా! నా దుర్గా విగ్రహమును నీ నగరమున సుప్రతిష్ఠితము గావించి నన్ను శ్రద్ధాభక్తులతో మూడువేళల నర్చించు చుండుము. ప్రతి శరత్కాలమున నవరాత్ర విధానముగ పరాభక్తి భావముతో నాకు నిత్యము మహాశక్తిపూజ లొనర్పుము. చైత్రము-ఆషాఢము-ఆశ్వయుజము-మాఘము- ఈ మాసములందు నన్ను గూర్చి ప్రేమమీర శ్రీదేవీ మహోత్సవములు జరుపవలయును. విశేషించి నవరాత్రములందు హృదయపూర్వకములగు నివాళులతో నిత్యపూజ లొనరింప వలయును. బుధులు విశేషించి కృష్ణపక్షమందలి యష్టమీ చతుర్దశులందు నిశ్చలభక్తి యుక్తులై న న్నారాధింప వలయును.



ఇట్లు దుర్గతి నాశని శ్రీదేవి దుర్గ పలికి సుదర్శనునిచేత సన్నుతింపబడి అదృశ్యయైన పిమ్మట దేవత లింద్రుని జేరునట్లు రాజులు సుదర్శనుని జేరి ప్రణమిల్లిరి. సుబాహువు సైతమతనికి వందన మాచరించి నిలుచుండెను. రాజులందఱును సుదర్శునితో నిట్లనిరో. నీ వయోధ్యాపతివి కమ్ము. మేము నీ సేవకులము. నీవు మా ప్రభుడవు. శాసకుడవు. నీవయోధ్యారాజ్య మేలుము. మమ్ము బాలింపుము. మహారాజా! ఆదిశక్తి - మహాదేవి - చతుర్వర్గఫలప్రదాయిని-విశ్వేశ్వరి-శివ యగు పరాదేవి నీ మూలమున మాకు గోచరయైనది. ఈ భూమిపై నీవు మిక్కిలి ధన్యుడవు-కృతకృత్యుడవు-పుణ్యతముడవు-కావుననే నీ నిమిత్తమున సనాతని యగు జగదంబిక దర్శనభాగ్య మొసంగినది. నృపసత్తమా ! మేము మాయామోహితులము. తామసులము. కాన మేము శ్రీ చండికాప్రభావ మెఱుగ జాలకుంటిమి. మేము ధన దార సుతుల చింతలం దగిలి యుంటిమి. కామక్రోధములను మొసళ్ళుగల ఘోర సంసార సాగరమందు నిర్మగ్నుల మైతిమి. నీవు సర్వజ్ఞుడవు-మహామనీషివి. కనుక ఆ పరమశక్తి యెవరో ఎచ్చటి నుండి వచ్చెనో ఆమె మహా ప్రతిభా ప్రభావ మెట్టిదో నీవు చక్కగ నెఱుగుదువు. కాన నిన్నడుగుచున్నాము-దయతో సెలవిమ్ము. కాకుత్థ్స ! సాధులు సర్వభూతహితులును దయామతులును. కనుక నీవు మా దుస్తర సంసార సాగరము దాటించు నావికుడవుగమ్ము. మాకు శ్రీమద్దేవీమాహాత్మ్యము తెలియ బలుకుము. నరవరోత్తమా! ఆ మాయాదేవీ నిజస్వరూపమేది? ఆమె యెట్లవతరించినది? ఆమె విమల ప్రభావ మేతీరుది? ఇవన్నియును మాకు వినవేడుకగుచున్నవి. వినిపింపుము'' అని యిట్లు రాజులడుగగా సుదర్శనుడు ప్రమోద మలర నెమ్మదిలో శ్రీదేవిని సంభావించి వారికిట్లనియెను:


ఓ భూపతులారా! ఏమని చెప్పుదును? ఎంతని చెప్పుదును? బ్రహ్మ రుద్రుడు దేవతలు సైత మా దేవీతత్త్వము తుదముట్ట నెఱుగజాలరు. అట్టి జగదంబిక దివ్యచరిత్రము వర్ణింప నేనెవడను? ఆ శ్రీదేవి యీ సకలమున కాద్య-పరాశక్తి-వరేణ్య-మహాలక్ష్మి-సత్త్వప్రకాశమూర్తి-జగత్పరిపాలన చతుర. ఆ యంబిక యీరేడు లోకాలను రజోరూపమున పుట్టించి సత్త్వరూపమున పాలించి తమోరూపమున సంహరించి త్రిగుణమయియై విరాజిల్లు చుండును. ఆ నిర్గుణ పరమశక్తి బ్రహ్మ మొదలుగాగల దేవతలకు కారణభూతురాలు. సర్వకామఫలప్రదాయిని. ఆ నిర్గుణశక్తి పరమయోగులకును తెలియరాదు. కావున బహురూపములుగల సగుణశక్తిని విబుధులు సేవించి చింతించి తరింతురు. రాజు లిట్లనిరి. నీవు బాల్యము నుండియు భయముతో మనములందు తలదాచుకొంటివిగదా! నీవా యుత్తమ పరమశక్తి నె ట్లుఱుగ గల్గితివి? నీవా తల్లి నేతీరున పూజించి యుపాసించితివో కాని యాదేవి దయను త్వరలోనే సంపాదింప గల్గితివి' అన సుదర్శను డిట్లనెను: ఓ నరేశులారా! నాకు చిఱుత ప్రాయమందే శ్రీ భగవతియొక్క కామరాజ బీజమంత్రము లభించినది. నేను దానిని రేయింబవళ్ళదే పనిగ జపించు చుంటిని. పరమర్షులు నాకంబికా శివతత్త్వ మెఱింగించిరి. నాటినుండి నేనా దేవి నైకాంతిక భక్తితో నిరంతరముగ స్మరించితిని అనెను. అంత రాజులెల్లరు శ్రీదేవీభక్తి తత్పరులై పరమశక్తిని తమ డెందములందు దలంచుచు నిజనివాసముల కరిగిరి. సుబాహువు సుదర్శనుని వీడ్కొని కాశి కేగెను. ధర్మాత్ముడైన సుదర్శనుడును కోసలపురికి వెళ్ళెను. రణమున శత్రుజిత్తు మరణించుట సుదర్శనుడు గెలుపొందుట విని మంత్రులెల్లరును సంపూర్ణహర్షము వెలిపుచ్చిరి. సుదర్శనమహారాజేతెంచుట గాంచి సాకేతనివాసులు విలువైన కానుకలు గొని సాదర సమ్మానములతో నతనికెదురేగిరి. ఇట్లు ప్రజలెల్లరును భూరిగ కానుకలు తీసికొని ధ్రువసంధిసుతుని సన్నిధి కరిగిరి. ఈ విధముగ సుదర్శనుడు తనపత్నితో గూడ నయోధ్య కేగి యెల్లరిని గారవించి రాజమందిరమున కరిగెను. అపుడు వందిమాగధులు సుదర్శనుని సన్నుతించిరి. మంత్రులు చేతులు జోడించిరి. కన్నెపడుచులు లాజసుమములు గురిపిరి అని వ్యాసమహాముని జనమేజయునితో పలికెను.



*ఇది శ్రీమద్దేవీభాగవత మందలి తృతీయస్కంధమం దిరువది నాల్గవ యధ్యాయము.*


_*శ్రీ దేవి భాగవతం - 57 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*వ్యాసభగవాను డిట్లనియె:* ఆ విధముగ తన మిత్రులతో సుదర్శన రాజవరేణ్యు డయోధ్యకేగి శోక సంతప్త యగు శత్రుజిత్తుని తల్లికి ప్రణమిల్లి యామె కిట్లు పలికెను. తల్లీ! నేను నీ తనయునిగాని తండ్రినిగాని రణరంగమున జంపలేదు. నీ పాదములు సాక్షిగ బలుకుచున్నాను. వారు పోరులో శ్రీ దుర్గాదేవి చేతిలో మడిసిరి. ఇందు నా యపరాధ మిసుమంతయును లేదు తప్పక జరుగవలసి జరుగు కార్యముల విషయమున ప్రతీకారమెన్నడును జరుగదు. ఓ మానినీ! ఇంక నీ చచ్చిన కొడుకునకై శోకింపకుము. ప్రాణులు కర్మపరతంత్రులై సుఖ దుఃఖము లనుభవింతురు సుమా! ఓ మాతా! ధర్మజ్ఞులారా! నేను నీకు దాసుడను. నాకు నా తల్లి మనోరమ యెట్లో నీవు నట్టే. మీ యిరువురి పట్ల నాకు భేదభావము లేదు. ప్రాణులు వెనుకటి శుభాశుభము లవశ్య మనుభవించి తీరవలయును. కాన సుఖ దుఃఖములు ప్రాప్తించినపుడు శోకింపదగదు. ఎవ్వడును దుఃఖములందు దుఃఖాదికమును సుఖములందు సుఖాదికమును అనుభవించును కాని దుఃఖము కలిగినపుడు అత్యంత శోకమును సుఖము కలిగినపుడు అధిక హర్షమును పొంది వాటికి లోబడరాదు. ఈ సమస్త బ్రహ్మాండమును దైవాధీనము. ఇందాత్మాధీన మైన దేదియును లేదు. కాన మతిమంతుడగు నరుడు శోకములచే తన యాత్మను శోషింపజేసికొనరాదు. ఒక కట్టెబొమ్మ నటుని చేతిలోబడి యభినయించును. అటుల జీవుడు తాను జేసికొన్ని కర్మకు పరతంత్రుడై ప్రవర్తిల్లును. స్వయంకృత కర్మఫలముల ననుభవింపక తప్పదు. అందువలన నేను వనమందున్నను మనస్సునందు బాధపడలేదు. నా తాత చనిపోయెను. నాతల్లి విధవ యయ్యెను. ఆమె భయాతిరేకమున నన్ను వనములకు కొనిపోయెను.



ఆమె తన సర్వస్వమును ముష్కరుల వలన గోలుపోయినది. ఆమె బాలపుత్రయై నిరాశ్రయురాలై పెక్కు వస్త్రములు లేనిదై యుండెను. నా తల్లి నన్ను భారాద్వాజాశ్రమమునకు గొనిపోయినది. మావెంట విదల్లుడును నొక దాదియు నేతెంచిరి. అచ్చట మేము మువ్వురమును మునులును మునిపత్నులు నొసంగిన పండ్లును నీవారాన్నములును దిని వారిచే బోషింపబడితిమి. ఆ పవిత్ర స్థలమునందు నా నిర్మల చిత్తమందు ధనము వలని సుఖముగాని లేమి వలని దుఃఖముగాని వైరద్వేషములుగాని లేవు. రాజభోగముల కన్న నీవారాన్న భోజనములు మేలైనవి. రాజభోగి తుదకు నరకమేగును. కాని, నీవారన్నములు దిన్నవాడు జనడు. పండితుడైన పురుషుడు ధర్మాభ్యుదయము గల్గింప వలయును. అత డింద్రియ వర్గమును జయింపవలయును. అట్టివాడు నరకమున పతనము బొందడు. ఎల్ల ప్రాణులకు నాహార విహారముల వలన సౌఖ్యము చేకూరును. కాని, యీ పవిత్ర భరత ఖండమునందు మనుజజన్మము లభించుటచే మాత్రము ఇతర జన్మములందు కడుంగడు దుర్లభమగు మోక్షము లభించును. అట్టి సదుర్లభ##మైన నరజన్మ మెత్తినవాడు తప్పక ధర్మసమాచరణము జరుపవలయును. ఈ నరజన్మము స్వర్గమోక్షములకు చక్కని రాజమార్గము. ఇది యితర జంతువుల కసాధ్యమైనది. ఇట్లు సుదర్శను నోదార్పు మాటలకు లీలావతి లజ్జించి పుత్రశోకము వీడియు కన్నీరు గార్చుచు నతని కిట్లనియెను నా తండ్రీ యుధాజిత్తు. అతడు నీ తాతను జంపెను. నీ రాజ్య మపహరించెను. పుత్రా! నన్నీ దుఃస్థితి పాలుచేసెను. ఆనాడు నేను నా తండ్రిని నా కొడుకును వారింపలేక పోతిని. అతడు చేసిన పనిలో నా దోష మేమియును లేదు. వారు స్వయంకృతాపరాధమున మడిసిరి. అందులకు నీవు కారణము గావు. నా పుత్రుని గూర్చి నేను శోకించుటలేదు. అతని చెడునంతకు కుందుచున్నాను. పుత్త్రా! నీవు నాకు తనయుడవు. మనోరమ నా సోదరి. నీ మీద నాకు కోపతాపము లెంత మాత్రము లేవు. నీవు చక్కగ రాజ్యమేలుము. ప్రజలను కన్నబిడ్డలను వలె బాలింపుము. నీకీ నిష్కంటక రాజ్యము భగవతి కరుణ వలన సంప్రాప్తించినది.''



అను తల్లి మాటలు విని సుదర్శనుడామెకు నమస్కరించెను. ఆ పిదప మనోరమ మునుపు వసించిన రమ్య హర్మ్యమున కేగెను. సుదర్శను డందుండి యెల్ల మంత్రులను దైవజ్ఞులను రావించి వారికొక శుభముహూర్తము చూడుడనెను. నేనొక బంగారు గద్దె చేయింతును. దానిపై శ్రీదేవిని ప్రతిష్ఠ చేతును. మనము నిత్య మా దేవిని బూజింపవలయును. పూర్వము శ్రీరామచంద్రులు ధర్మార్థ కామమోక్షదాయిని యగు భగవతి నున్నత పీఠముపై ప్రతిష్ఠించి పూజించిరి. నేను నట్లు చేసి పిదప రాజ్యమేలుదును. ఆ దేవి శివాశక్తి - వాంఛితార్థ సిద్ధిద. అట్టి జగదంబను నాగరికజనులు భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యము పూజించవలయుననియు సుదర్శనుడు పలికెను. అపుడు మంత్రులు రాజశాసనములను తలదాల్చిరి. వారు శిల్పివరులచేత సుందర దేవీమందిరము నిర్మింపజేసిరి. సుదర్శనుడు చైతన్యముట్టిపడు దేవీ విగ్రహమును సిద్ధము చేసెను. వేదవిదులగు బ్రాహ్మణులను రావించెను. ఒక సుముహూర్తమున శ్రీదేవీ ప్రతిష్ఠ జరిపించెను. ఆ మతిమంతుడు యథావిధిగ శ్రీ మద్దేవీ యాగము జరిపించెను. సురలను బూజించెను. దివ్య పీఠముపై పరాశక్తిని ప్రతిష్టించెను. ఆ దేవీ ప్రతిష్ఠామహోత్సముల విప్రుల వేదఘోషలతో దివ్యగానములతో వాద్యనిస్వనములతో కనులకు చెవులకు పండువుగ నుండెను.



ఆ విధముగ సుదర్శనుడు వేదవిదుల వలన శ్రీదేవిని ప్రతిష్ఠించి విధి విధానమున నానావిధ పూజలు జరిపించెను. అట్లు సుదర్శనుడు పూజా విధులు సమాచరించి తన పైతృక రాజ్యము బడసెను. ఇట్లంబికాదేవి కోసల దేశమున విఖ్యాతి నందెను. అట్లు ధర్మవిజయుడగు సుదర్శనుడు రాజ్యము బడసి ధర్మిష్ఠులగు సకల సామంతులను తనకు వశుల జేసికొనెను. శ్రీ దిలీపుడు రఘువు శ్రీరాముడు పరిపాలించిన రాజ్యములోని ప్రజ లెట్లుండిరో సుదర్శనుని పాలనలోని ప్రజలు నట్లు సుఖ సంపన్నులై విలసిల్లిరి. అతని యేలుబడిలో వర్ణాశ్రమాదుల ధర్మము నాలుగు పదములతో ప్రవర్తిల్లెను. ప్రతివాడును ధర్మతత్పరుడై యుండెను. ఆనాటినుండి గ్రామగ్రామమున దేవీమందిరములు వెలసినవి. ఇట్లు కోసలదేశమున శ్రీ భగవతీ పూజ విరివిగా జరుగుచుండెను. కాశియందు సుబాహువును భక్తి భావములతో శ్రీ దుర్గా విగ్రహము చేయించెను. దేవీ మందిరము నిర్మింపజేసెను. అందా దేవిని ప్రతిష్ఠించెను. అచటి భక్తులెల్లరును భక్తి పరాయణులై శ్రీ విశ్వేశ్వరుని పూజించు విధముగ శ్రీ దుర్గాదేవిని యథావిధిగ బూజించుచుండిరి. ఈ విధముగ భూమిపై శ్రీ దుర్గాదేవి విలసిల్లినది. ఈ రీతిగ దేవీభక్తి దేశదేశముల వ్యాపించెను. ఆనాటినుండి యావద్భారతమున భూలోకమందంతటను నెల్ల వారికెల్ల భంగుల భగవతీ దేవి పూజింపదగినదయ్యెను. కొందఱు భక్తి యుక్తులై యాగమప్రోక్తములైన స్తోత్రములతో జపధ్యాన పరాయణులై దేవిని గొలుచు చుండిరి. దేవీభక్తులెల్లరును శ్రద్ధాభక్తులతో శ్రీ మద్దేవీయాగములును సమారాధనములును జరుపుచుండిరి అని వ్యాసముని జనమేజయునకు తెలిపెను.



*ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి తృతీయస్కందమం దిరువది యైదవ అధ్యాయము.*

కామెంట్‌లు లేవు: