13, అక్టోబర్ 2020, మంగళవారం

ఇంద్రియాలంటే

ఇంద్రియాలంటే ? ఇంద్రియ నిగ్రహమంటే ? ఇంద్రియనిగ్రహం తేలికా - కష్టమా ? ఉదాహరణాత్మక వివరణ

నిర్గుణోపాసకులకు ప్రత్యేకంగా 3 జాగ్రత్తలను భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేసే పనులు వ్యర్థమైపోతాయి. కళాయిలేని పాత్రలో వండిన పులుసు చిలుమెక్కి విషపూరితం అవుతుంది. దానిని పారబొయ్యవలసిందే. అలాగే హృదయనైర్మల్యం లేకుండా, ఇంద్రియనిగ్రహం లేకుండా భగవంతుని ఎలా ఉపాసించినా - సాకారంగానైనా, నిరాకారంగానైనా ఎలా అర్చించినా ఫలితం కలగదు. అందుకే నిర్గుణోపాసకులు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు మూడింటిని భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఏమిటవి?

1. సంనియమ్యేంద్రియ గ్రామం = అన్ని ఇంద్రియాలను గ్రహించుట.

2. సర్వత్ర సమబుద్ధయః = అన్నివేళలా, అందరిపట్ల సమబుద్ధి.

3. సర్వభూత హితే రతాః = సమస్త ప్రాణులకు మేలు కలిగించుట యందు ఆసక్తి.

ఈ 3 జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. సంనియమ్యేంద్రియ గ్రామం :- ఇంద్రియగ్రామం సంనియమ్య. అంటే ఇంద్రియ సమూహాన్ని = అన్ని ఇంద్రియాలను లెస్సగ నిగ్రహించుట. నిరాకార నిర్గుణ పరమాత్మను ధ్యానించాలన్నా, ఉపాసన చేయాలన్నా ఇంద్రియాలన్నింటిని చక్కగా నిగ్రహించాలి. ఏదో ఒక ఇంద్రియాన్ని గాక అన్నింటిని పూర్తిగా నిగ్రహించాలి.

బయటి ప్రపంచంలో ఎన్నో విషయవస్తువులు, ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి. అవి మనలో ప్రవేశించి తుఫానులు రేపటానికి ముఖ్యద్వారాలు మన ఇంద్రియాలే. అవే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. వీటిని మన అధీనంలో ఉంచక అవి చెప్పినట్లు మనం విన్నామా మనను అవి అల్లకల్లోలం చేస్తాయి. మన జీవశక్తిని వ్యర్థం చేస్తాయి. అందుకే వీటిని మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. వాటికి బానిసలం కాకుండా యజమానులం కావాలి.

ఇంద్రియాలు గుర్రాల వంటివి. వాటిని స్వేచ్ఛగా వదిలితే అవి ఎటుపడితే అటు మనను పరుగెత్తించి ఎక్కడో మనను పడవేస్తాయి. బండిని గోతిలో పడవేస్తాయి. అలాగాక వాటిని మన చెప్పుచేతల్లో ఉంచుకున్నామా ప్రయాణం సాఫీగా సాగుతుంది. చేరవలసిన చోటికి చేరతాం. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి. అంటే వాటిని ప్రపంచం మీదకు వదలకుండా అంతర్ముఖం చేయాలి. లోపలకు త్రిప్పాలి. ఆత్మవైపుకు త్రిప్పాలి. అప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తగిన అర్హత లభిస్తుంది. మనకు కావలసింది పుస్తకజ్ఞానం కాదు, మస్తకజ్ఞానం. బయట నుండి లోపలకు కూరేదిగాక, లోపలనుండి బయటకు ఊరేది కావాలి.

మన ఇంద్రియాలకు 3 అవస్థలున్నాయి. అవి -

1. ప్రపంచంలో తిరుగాడటం.

2. నిద్రపోవటం.

3. భగవంతుని వైపుకు తిరగటం.

మొదటి రెండూ అందరికీ సాధారణమే. ఐతే 3వదే కష్టమైనది. తీవ్రంగా ప్రయత్నించవలసింది. భగవంతుని కొరకు, భగవత్పరమైన కర్మలు చేసేవారు ఆ ఉత్తమస్థితిని - ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలుగుతారు.

TVలో వచ్చే ప్రోగ్రాములను చూడాలనుకున్న మీ కళ్ళను నిగ్రహించి, ఎందుకూ పనికిరాని విషయాలను, లోకాభిరామాయణాన్ని వినాలనుకొనే మీ చెవులను నిగ్రహించి ప్రతిరోజూ ఇలా గంటల తరబడి కూర్చొని ఈ గీతాప్రవచనాలను మీరు వినగలుగుతున్నారంటే మీ కళ్ళను చెవులను ఈ కొద్దిసేపైనా నిగ్రహించినట్లే. నోటికి - చేతికి తెంపు లేకుండా ఏదో ఒకటి నోట్లోకి విసిరే చేతులను, తినే నోటిని కూడా నిగ్రహించినట్లే. ఇలా ఆయా ఇంద్రియాలను, ఆయా విషయాలలో తిరగకుండా నిగ్రహించి,

గీతాశ్లోకాలను కంటితో చూస్తూ, వాక్కుతో పలుకుతూ,

గీతాప్రవచనాలను చెవులతో వింటూ,

గీతాశాస్త్రాన్ని చేతులతో పట్టుకుంటూ,

భగవత్ సంబంధమైన పనులను చేతులతో - ఇంద్రియాలతో చేస్తూ, ఇలా నిత్యము అభ్యాసం చేస్తూ ఇంద్రియాలను పూర్తిగా అధీనంలో ఉంచుకోగలిగితే నిర్గుణోపాసన చేయటం సులభమవుతుంది. ఇంద్రియనిగ్రహం లేనివానికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. ధ్యానం కుదరదు. ఇంద్రియాలు బయటకు లాగుతుంటే మనస్సు నిరాకార పరమాత్మపై నిలువలేదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇక్కడ 'నియమ్య అనక సంనియమ్య' అన్నారు. అంటే మాములుగా నిగ్రహిస్తే చాలదు. లెస్సగా నిగ్రహించాలి. బాగుగా నిగ్రహించాలి. నేను ఇంద్రియాలను నిగ్రహించాను. కనుక హాయిగా గుండెల మీద చేయివేసుకొని ఉండవచ్చు అని ఎవ్వరూ భరోసాతో ఉండకూడదు. ఎందుకంటే -

విశ్వామిత్రుని వంటి పట్టుదల కలిగిన తపశ్శాలి కూడా ఇంద్రియాలకు లొంగిపోయి తన తపశ్శక్తిని వృధా చేసుకున్నాడు. విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు యొక్క అగ్నిజ్వాలలు స్వర్గాన్ని తాకినవి. దానితో దేవేంద్రుడు భయపడిపోయి అప్సరసలలో శ్రేష్ఠురాలైన మేనకను పంపించాడు. ఆమె తన అభినయంతో, నాట్యంతో, సౌందర్యంతో విశ్వామిత్రుని తపస్సు నుండి మరలించింది. విశ్వామిత్రుడు కామానికి లొంగిపోయాడు. అతడి ఇంద్రియాలు అతణ్ణి దాసునిగా చేసుకున్నాయి. దానితో అతడు మేనక పొందుకోసం తహతహ లాడిపోయాడు. వారి కలయికతో శకుంతల జన్మించింది. ఆ తరువాత తన తప్పును తెలుసుకున్నాడు. తన తపస్సు భగ్నమైనందుకు పశ్చాత్తాపం చెంది తిరిగి ఘోరమైన తపస్సు చేశాడు. ఇక ఎన్నటికీ కామానికి లొంగి కామదాసుడు కాకూడదని నిశ్చయించుకున్నాడు.

తిరిగి విశ్వామిత్రుని తపోగ్నిజ్వాలలు స్వర్గాదిలోకాలను తాకినవి. దానితో దేవేంద్రుడు ఈ సారి రంభను పంపించాడు. ఆమె విశ్వామిత్రుణ్ణి తనవైపుకు ఆకర్షించాలని విశ్వప్రయత్నం చేసింది. కాని విశ్వామిత్రుడు ఎంతో పట్టుదలతో నిగ్రహంతో ఉన్నాడు. అయినా సరే రంభ వదిలిపెట్టలేదు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నది. చివరకు విశ్వామిత్రుడు తీవ్రమైన కోపంతో కళ్ళు తెరచి రంభను బండరాయివై పోదువుగాక అని శపించాడు. అప్పుడు కామానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. ఇప్పుడు క్రోధానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. మొత్తం మీద ఇంద్రియాలకు లొంగిపోవటం జరిగింది. అంతటి విశ్వామిత్రుడే ఇంద్రియాలకు లొంగిపోతే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? కనుక ఇంద్రియనిగ్రహాన్ని లెస్సగా సాధించాలి. అట్టి ఇంద్రియనిగ్రహపరుడే నిర్గుణోపాసనకు అర్హుడు.

నిర్గుణోపాసన అనేది కత్తి మీద సాములాంటిది. మనస్సు ఏమాత్రం చలించినా పతనం తప్పదు. అందుకే మొదటి జాగ్రత్తగా ఇంద్రియనిగ్రహాన్ని గురించి చెప్పటం జరిగింది.

[13/10, 7:04 am] +91 99638 01993: 🌷

*ధర్మమే శాశ్వతం*


*అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః*


*నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహ*


*దేహం శాశ్వతం కాదు. భోగభాగ్యాలు అసలే శాశ్వతం కాదు. మృత్యువు మనల్ని వెన్నంటే ఉంటుందని గుర్తుంచుకోవాలి.* *ధర్మమే శాశ్వతం అని గుర్తించి, ఎప్పుడూ ధర్మబద్ధంగా నడచుకోవాలి.*


🌷

కామెంట్‌లు లేవు: