ధనం మహత్యం ...
మూఢ జహీహి ధనాగమతృష్ణాం*
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||
----ఆది శంకరుల భజగోవిందం నుండి
ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.
నిత్యానందాన్ని ప్రసాదించే నిత్య వస్తువైన పరమాత్మను నీలోనే పెట్టుకొని, అనిత్య వస్తువులతో కూడిన ఈ ప్రపంచంలోకి పరుగులెత్తి, కొంతసేపు ఆనందాన్ని, కొంతసేపు దుఃఖాన్ని పొందే వారినే ఇక్కడ 'మూఢ' అంటున్నారు.
ఇంటిలోనే కావలసినన్ని నిధులు పెట్టుకొని బొచ్చె తీసుకొని వీధుల వెంట అడుక్కుతింటూ తిట్లు తినేవాడిని ఏమంటాం?
అలాంటి వారందరికీ ఇక్కడ సలహా ఇస్తున్నారు.
ధనాగమ తృష్ణాం జహీహి
ధనాన్ని సంపాదించాలి, కూడబెట్టాలి అనే ఆశను వదలిపెట్టమని సలహా.
ఇక్కడ ధనాన్ని వదలమనటం లేదు. ధనాశను వదలమంటున్నారు. లభించిన దానితో సంతృప్తి చెందమంటున్నారు. ధనం అనేది దుఃఖం లేని శాశ్వతానందాన్ని ఇవ్వలేదు.
ఆ నమ్మకం దృఢపడితే ధనాశను వదలటం తేలికే.
నిజంగా ధనం యొక్క మాహాత్మ్యం ఏమిటో చూడండి.
ధనం ఉంటే ఆనందాన్ని కొనుక్కోవచ్చుననేది అందరి సామాన్య అభిప్రాయం. ఐతే ఆ డబ్బే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, తండ్రీ కొడుకుల మధ్యా ఎలా తగవులు పెడుతున్నదో, కక్షలు - కార్పణ్యాలు పెంచుతున్నదో చూస్తూనే ఉన్నాం. ధనమే మనుష్యుల ప్రాణాలు కూడా తీస్తున్నది. ఐనా సరే ఆ ధనం కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. అందుకే ధనాశను విడిచిపెట్టమంటున్నారు.
మరి మనస్సులో ఉన్న ఆ ఒక్క ధనాశను వదిలేస్తే మనస్సు ఖాళీ ఐపోతుంది గదా!
మరి ఏం చెయ్యాలి?
మనసి వితృష్ణాం సద్బుద్ధిం కురు మనస్సు నుండి ఆశలను తొలగించి వాటి స్థానంలో మంచి ఆలోచనలు నింపాలి.
మంచి ఆలోచనలు అంటే పరమాత్మ సంబంధమైన ఆలోచనలు. భగవచ్చింతన - ధ్యానం ద్వారా సత్యతత్వమైన పరమాత్మతో అనుసంధానం చేయాలి. సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మనే నేను అనే ఆలోచనలు చేయాలి.
ఇలా భగవత్ప్రాప్తికి - మోక్షానికి తగిన మార్గాలను, సాధనలను గూర్చి ఆలోచిస్తూ ఉండాలి.
అయితే ఎప్పుడూ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే భుక్తి ఎట్లా? అవసరాలు ఎట్లా? అనే ఆలోచన వస్తుంది.
దానికి సమాధానం చెబుతున్నారు...
యల్లభసే నిజకర్మో పాత్తం విత్తం తేన వినోదయ చిత్తం
మనం ఏవో కర్మలు చేస్తూనే ఉంటాం. అలా చేస్తూ ఉండాల్సిందే. ఆ కర్మల ఫలితంగా ఎంతో కొంత ధనం లభిస్తుంది. అలా లభించిన దానితో తృప్తిగా జీవించు.
నిజంగా ఈ లోకంలో రోజుకు 20-25 రూపాయలతో జీవించువారూ ఉన్నారు. వేలకొద్దీ ఖర్చుపెట్టే వారూ ఉన్నారు. దీనికి పరిమితి అంటూ లేదు.
నిజంగా సంతృప్తి చెందటంలోనే ఆనందం ఉన్నది. తృప్తి అనేది లేకుండా కోరికలు పెంచుకున్న కొద్దీ మనస్సుకు ఆనందం రాదు. ఎప్పుడూ ఆందోళనలు, అశాంతియే. కనుక తృప్తిలోనే శాంతి ఉన్నది. వస్తువులో లేదు.
ఇద్దరు మిత్రులు స్నేహితుని ఇంటికి వచ్చారు. ఆ స్నేహితుడు ఇద్దరికీ రెండు కప్పుల్లో కాఫీ ఇచ్చాడు. రెండు కప్పుల్లోనూ సగం - సగం వరకే కాఫీ ఉన్నది ఒక స్నేహితుడేమో “సగం కాఫీయే ఇచ్చాడ”ని అసంతృప్తితో త్రాగితే - రెండవ స్నేహితుడు “అసలు కాఫీ ఇవ్వడనుకున్నాను. ఓహో! మనవాడు త్యాగం చేస్తున్నాడే” అని ఆనందంతో త్రాగాడు.
ఇద్దరు త్రాగింది సగం సగం కాఫీయే అయినా వారి భావనల కారణంగా ఒకరు అసంతృప్తిని, మరొకరు ఆనందాన్ని పొందారు.
🍁🍁🍁🍁 ***సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి