**దశిక రాము**
*శ్రీమద్భాగవతము**
చతుర్థ స్కంధం -3
సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట
దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా...అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో...నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...
అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట!కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది.ఆ యజ్ఞాన్ని చూడడానికి నా తోబుట్టువులంతా తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ
వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది.
శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది. వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను. దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.నీలకంఠా! మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతాస్త్రీలు గుంపులు గుంపులుగా పలువిధాల ఆభరణాలను అలంకరించుకొని భర్తలతో కలిసి రాజహంసల వలె తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలు ఎక్కి అదిగో ఆకాశమార్గంలో వెళ్తున్నారు. చూడండి. మహాత్మా! విను. లోకంలో తండ్రి యింట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ కుమార్తెల ప్రాణాలు నిలుస్తాయి?అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా!అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు. సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే...కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను.బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి.తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు. అది ఎలా? నీ సంబంధం చేత నాకు గౌరవం లభించక పోవడానికి, నీకూ అతనికి విరోధం కలగడానికి కారణమేమిటి?’ అని నీవు అడిగితే...అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు. అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. ఈవిధంగా మిక్కిలి వేగముగా ప్రయాణం చేసి...సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకఱ్ఱలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి చేసి...ఎదురుగా...సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది. ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా...విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు.
తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు... తండ్రి అవమానించడంతో తోబుట్టువులు చేసిన గౌరవాన్ని సతీదేవి అందుకొనక, వారికి బదులు చెప్పలేక పోయింది. ఈ విధంగా సతీదేవి తన తండ్రి ఆదరాన్ని పొందనిదై, తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా తిరస్కరించడాన్ని, శివునికి భాగం కల్పించకుండా జరుపుతున్న యజ్ఞాన్ని చూసి, తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది, శివుని ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథగణాలను నివారించి, రోషావేశంతో ఇలా అన్నది. “లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు ఇష్టమైనవారు అనీ, ఇష్టం లేనివారు అనీ ఎవరూ లేరు. అతనికంటె అధికులు లేరు. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ఎవరియందూ ద్వేషము లేదు. అలాంటి రుద్రుని నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? అంతేకాక నీవంటివాళ్ళు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదిస్తారు. కొందరు మధ్యస్థులు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదించరు. కొందరు సత్పురుషులు ఇతరుల దోషాలనైనా గుణాలుగా గ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు ఇతరులలో దోషాలను ఆరోపించక వారి నీచగుణాలను సైతం సద్గుణాలుగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ములలో నీవు పాపబుద్ధిని కలిగించావు.” అని చెప్పి ఇంకా ఇలా అన్నది. “మహాత్ముల పాదధూళిముందు వెలవెలబోయిన తేజస్సు కలిగి, జడపదార్థమైన దేహాన్నే ఆత్మ అని వాదించే దుర్జనులు సజ్జనులను నిందించడంలో ఆశ్చర్యం లేదు. అది వారి తగినదే” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది. ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి?అంతేకాక ఆ మహాత్ముని పాదపద్మాలు లోకాలన్నీ కొలివగా కోరిన కోర్మెలన్నింటినీ కురిపిస్తుండగా అతన్ని నిదించడం న్యాయమా? చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు. ధర్మపాలన చేత పవిత్రుడైన శివుణ్ణి తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చేయలేనప్పుడు చావడం మంచిది. రెండూ చేతకాని పక్షంలో చెవులను మూసికొని అక్కడినుండి వెళ్ళిపోవడం న్యాయమని ధర్మజ్ఞులు చెప్తారు. అందువల్ల...తెలియక తిన్న దుష్టాన్నాన్ని మానవుడు కక్కి పవిత్రుడైనట్లు దుష్టుడవై ఈవిధంగా గొప్పవాడైన ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తమైన ఈ పాడు శరీరాన్ని విడిచి పవిత్రురాలను అవుతాను.అంతేకాక దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు, విధి నిషేధ లక్షణాలు కలిగిన కర్మలు రాగ వైరాగ్యాలకు కారణాలుగా వేదాలు విధించడం వలన రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకూ, వైరాగ్యంతో కూడి ఆత్మారాములైన యోగులకు విధి నిషేధ రూపాలలో ఉన్న వైదికకర్మలు కలిగిఉండడమూ లేకపోవడమూ సహజం. అందువల్ల స్వధర్మపరుడైనవానిని నిందించరాదు. (సంసారులకు అగ్నిహోత్రాలు మొదలైన ప్రవృత్తి కర్మలను, విరక్తులకు శమదమాది నివృత్తి కర్మలను వేదాలు విధించాయి. దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు సంసారులకు, విరక్తులకు వేరువేరు ధర్మాలు సహజాలు. విధి నిషేధ రూపాలైన వైదిక కర్మలు ధర్మాసక్తులైన సంసారులకే కాని ఆత్మారాములైన యోగులకు కాదు.) ప్రవృత్తి నివృత్తి కర్మలు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సదాశివుని నిందించడం పాపం. తండ్రీ! సంకల్పమాత్రం చేతనే మేము పొందగలవీ, యోగిజనులచేత సేవింపబడేవీ అయిన అణిమ మొదలైన అష్టసిద్ధులను నీవు పొందలేవు. నీ ఐశ్వర్యాలను యజ్ఞశాలలో హోమధూపాల మధ్య తిరుగుతూ, యజ్ఞాన్నాన్ని భుజించేవారు ఇక్కడ మాత్రమే స్తుతిస్తారు. కనుకనీవు మిక్కిలి సంపన్నుడవనీ, చితాభస్మాన్నీ ఎముకలను ధరించే రుద్రుడు దరిద్రుడనీ భావించి గర్వించకు” అని చెప్పి ఇంకా ఇలా అన్నది.తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా?
వృషభధ్వజుడు, భగవంతుడు అయిన శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో ‘దక్షతనయా’ అని పిలిచినప్పుడు నేను మిక్కిలి దుఃఖిస్తూ ఆనందాన్ని పొందలేక చమత్కారపు మాటలతోనో, చిరునవ్వుతోనో తొలగిపోతాను. నీ కుమార్తెను అని బాధపడడం కంటె చావడం మేలు. అని ఈ విధంగా యజ్ఞమండప మధ్యభాగంలో తమకు వ్యతిరేకి అయిన దక్షునితో పలికి, కామక్రోధాదులైన అంతశ్శత్రువులను నాశనం చేసే సతీదేవి తూర్పుదిక్కుకు తిరిగి, జలాలతో ఆచమనం చేసి, శుచియై, మౌనం పూని, నేలపై కూర్చొని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొన్నదై. ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్యాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది.ఈ విధంగా దోషాలను పోగొట్టుకొన్న దేహం కలిగిన ఆ సతీదేవి తన యోగసమాధి నుండి పుట్టిన అగ్నిచేత వెంటనే కాలిపోయింది. అప్పుడు...అది చూచి అక్కడి మానవులు, దేవతలు హాహాకారాలు చేస్తూ “అయ్యో! ఈ సతీదేవి దక్షునిమీది కోపంతో తన శరీరాన్ని విడిచిపట్టించి కదా!” అన్నారు.ఇంకా ఇలా అన్నారు.
సకల చరాచరాలను సృష్టించే ఈ దక్షుడు అభిమానవతి, పూజ్యురాలు అయిన తన ప్రియపుత్రిక సతీదేవి తన చేత అవమానింపబడి, తన ఎదుటనే శరీరాన్ని విడవడం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నాడా?” అని ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఇలా అన్నారు “ఇటువంటి దుష్టుడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఇతడు తప్పక అపకీర్తిని పొంది, నిందల పాలయి, నరకంలో పడతాడు” అని దూషించే సమయంలో...మరణించిన సతీదేవిని చూసి శివుని అనుచరులైన ప్రమథగణాలు అతిశయించిన బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుని సంహరించడానికి ఉత్సాహంతో లేచారు. ఆ సందడిని చూసి అధ్వర్యుడైన భృగుమహర్షి మిక్కిలి కోపంతో యజ్ఞనాశకులను సంహరించే అభిచారక హోమాన్ని వెంటనే చేసాడు.ఈ విధంగా భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి