రామాయణమ్.91
..
మూర్ఖురాలూ తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కల కైక భరతుని మాట విని ఇలా అన్నది.
.
రాముడు పర భార్యలను కంటితో చూడటమా!
పర ధనము అపహరించటమా?
పరులను హింసించడమా? అలాంటివి కలలో కూడ చేయడు.
.
నేనే నీ తండ్రిని కోరాను రాముని అరణ్యమునకు పంపి నీకు రాజ్యము ఇమ్మని ,నీ తండ్రి నా కిచ్చిన వరమునకు అనుగుణముగా నేనడిగినట్లే చేసినాడు.
.
రాముడు కనపడక అతని మీద గల ప్రేమ తో నీ తండ్రి క్రుంగిపోయి మరణించాడు.
.
భరతా నిష్కంటకమైన రాజ్యమును ఇక స్వీకరించు!
.
అమితమైన దుఃఖము మనస్సును ఆవరించింది భరతునకు పుండుమీద కారం చల్లినట్లు తండ్రి మరణానికి తోడు తల్లి చేసిన బుద్ధిమాలిన పని ఆయనలో అంతులేని వేదన రగిల్చింది.
.
అనంతమైన ఆవేదన, ఎదురుగా ధర్మాధర్మములు పాటించని కన్నతల్లి ఇక ఉండ బట్టలేక ,ఓసీ ! నీవు కాలరాత్రి వలే నా కులమునకు దాపురించావు. నా తండ్రి భగభగమండే కొరివిని కౌగలించుకొంటున్నాని తెలుసుకోలేక పోయాడు.
.
నా తండ్రిని ఎందుకు చంపావు ,ధర్మాత్ముడైన నా అన్నని ఎందుకు అడవికి పంపావు?.
.
రాముడు తనకు తన కన్నతల్లి ఎలాగో నిన్ను కూడా అలాగే చూసుకున్నాడు కదా! కౌసల్యామాత నిన్ను తోడబుట్టినదాని వలే ఆదరించింది కదా!
.
రాముడి దర్శనమే పుణ్యము కలిగిస్తుంది అలాంటి రాముడికి నారచీరలు కట్టి అడవులకు పంపటానికి నీకు మనసెలా ఒప్పింది!.
.
రాముడి పట్ల నాకు గల భక్తి నీకు తెలవదు! రామలక్ష్మణులు దగ్గరలేకుండా ఏ విధంగా పాలించగలననుకొన్నావు అయినా రాముడిలాంటి పెద్ద వృషభము మోయగల కాడిని నాలాంటి దూడ మోయగలుగుతుందా?.
.
ఇక్ష్వాకుల వంశంలో ఎప్పటికీ జ్యేష్టుడే రాజు!
క్రూరురాలా నీవు కోరిన రాజ్యము ఎప్పటికీ నీకు లభించదు!
నాకు నీవీలోకములో గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టావు!
.
నీ తండ్రి అశ్వపతి గొప్ప ధర్మాత్ముడు ఆయనకు తీరని కళంకము తెచ్చావు నీవు.అటు పుట్టినింటికి ఇటుమెట్టినింటికీ తీరని ద్రోహము చేశావు.
.
రాముని అరణ్యమునుండి తిరిగి రప్పించెదను .నా అన్న రామన్న నా తోటి శాశ్వతముగా మాట్లాడడని నిన్ను చంపకుండా వదిలి పెడుతున్నాను.ఇక ఎంతమాత్రము నీ పాప భారము నేను మోయజాలను.
.
అని భరతుడు పెట్టే కేకలు రాజాంతఃపురమంతా మారుమ్రోగుతున్నాయి.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి