13, అక్టోబర్ 2020, మంగళవారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

 **దశిక రాము**


🕉️ #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-29 🕉️

            

⚛️ శ్లోకం 23⚛️


**గురు ర్గురుతమో ధామః**


**సత్యస్సత్య పరాక్రమః|**


**నిమిషో నిమిష స్స్రగ్వీ**


**వాచస్పతి రుదారధీః||**


211. గురుర్గురుతమః --- గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;

గురుః --- సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;

గురుతమః --- ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.

212. ధామ --- పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.

213. సత్యః --- మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.

214. సత్యపరాక్రమః --- నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.

215. నిమిషః --- యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)

216. అనిమిషః --- ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.

217. స్రగ్వీ --- వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.

218. వాచస్పతిః --- వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.

ఉదారధీః --- ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.

వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు

శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః


నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః !!23!!


---------------------------------- ( నామాలు 209 ... 217)


48. ఆత్మ విద్య నేర్పు, నసలైన గురువాయె


జీవి కెపుడు నదియె చివరి యిల్లు


సత్య రూపుడతడె, సత్య పరాక్రమ


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : గురు ... ఆత్మ విద్యా బోధకుడు, గురుతమ ... గురువులకే గురువు, ధామ ... ఇల్లు, ఆరామం, సత్య ... సత్యరూపుడు, సత్య పరాక్రమ ... నిజ నిరూపణలో పరాక్రమవంతుడు.


భావము : ఆత్మ (ఆధ్యాత్మికమైన కూడా కావచ్చు) విద్య నేర్పువాడు, గురువులకే గురువైనవాడు, ఉత్తమ జీవులకు అసలైన చివరి గమ్యం (ఆయన నిలయమే ....కదా), సత్యమే తానైన వాడు, ఆ విషయం నిరూపించడంలో నిజమైన పరాక్రమం గలవాడు ( ప్రహ్లాద గాథ తెలియజెప్పినదిదే కదా) అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు. }


49. తెరచి యుంచు కనులు, తెరవడే నాటికీ


వాడనట్టి మాలె వీడకుండు


వాక్కునకును బతియె వదల డుదారత


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : నిమిష ... మూతబడిన కనులు, అనిమిష ... సదా తెరచి యుండు కనులు, స్రగ్వి ... పూమాల ధరించినవాడు, వాచస్పతి రుదారధీ ... ఉదారహృదయుడైన వాక్పతి (వాచస్పతి + ఉదారధీ).


భావము : ఆలోచనా మగ్నుడై, అంతర్ముఖుడైన వాడు (అలాంటి వాని కనులు ఎప్పుడూ మూతబడి ఉన్నట్లుగానే కనిపిస్తాయి...కదా), భక్తులనూ, విశ్వాన్నీ కాచుకుంటూ ఉండాలనే సదాశయంతో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండువాడు( అలాంటి వాడు రెప్ప పాటు కాలం కూడా కనులు మూయడు ....కదా), ఎన్నటికీ వాడిపోని వైజయంతీ మాలను మెడలో ధరించి యుండువాడు(వనమాలి అనడం అందుకే....కదా), ఉదారహృదయుడైన వాక్పతి(బృహస్పతీ కావచ్చు) యైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


🙏ఓం నమో నారాయణాయ🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

కామెంట్‌లు లేవు: