13, అక్టోబర్ 2020, మంగళవారం

శుద్ధవిద్యాంకురాకారాద్విజపంఙ్తిద్వయోజ్వలా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 26 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘శుద్ధవిద్యాంకురాకారాద్విజపంఙ్తిద్వయోజ్వలా’


శుద్ధవిద్యకు సంబంధించిన అంకురములను తన దంతపంక్తిగా చేసుకుని ప్రకాశిస్తున్న తల్లి. పాలను పొయ్యిమీద పెడితే అవి ఎప్పుడు పొంగుతాయో చెప్పలేరు. పాలలో ఉండే ప్రతి బిందువు పొంగడానికి వీలయ్యే ఉష్ణోగ్రతకు చేరితే తమంత తాము పొంగుతాయి. ఒక పాత్రలో బియ్యం పోసి ఉడికిస్తున్నప్పుడు ఎప్పుడు మెతుకులుగా మారతాయో తెలియదు. పైన ఉన్న గింజ మెత్తపడితే లోపల ఉన్న గింజలు కూడా మెత్తబడి ఒకేసారి అన్నముగా మారతాయి. అది ఎలా జరిగిందో అలా భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా చెయ్యగా జ్ఞానము కూడా అలా ఆవిర్భవిస్తుంది. జ్ఞానము వలన మాత్రమే మోక్షము సాధింపబడుతుంది. ఆ విధమైన మోక్షము సాధించడానికి ఉన్న విద్యకి శుద్ధవిద్య అని పేరు. 

శుద్ధవిద్యలో ఒక స్థితిని పొందితే – అనగా తాను శుద్ధవిద్యలో తరించినవాడై ఆ విద్య స్వరూపమును పొందితే తనకు, విశ్వమునకు అభేదమును పొందుతాడు. విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. విశ్వములో అంతర్భాగమైన తానుకూడా విష్ణువే. ఉన్నది ఒకటే వస్తువు రెండువస్తువులు లేవన్న స్థితికి వెళ్ళడము జరుగుతుంది. ఈ స్థితి అటువంటి వారియందు కారుణ్యముగా వ్యక్తము అవుతుంది. ఎక్కడ అటువంటి సమున్నతమైన స్థాయిలో నిలబడాలో ఆ స్థాయికి చేరితే దానిని శుద్ధవిద్య అంటారు. ఆ విద్యను చేరడానికి ఉన్న అంకురాలు ఏవి ఉంటాయో అవి ‘ద్విజపంక్తిద్వయోజ్వలా’ తన పళ్ళవరుసలుగా కలిగి ఉన్నది. పళ్ళు రెండు వరసలుగా ఉంటాయి. షోడశీవిద్య అని ఒక విద్య. అందులో అమ్మవారికి, శ్రీవిద్యకు సంబంధించిన బీజాక్షరముల గురించి వివరణ ఉంటుంది. 

ఒక గింజ భూమిలో పాతిపెడితే మొక్కవచ్చేప్పుడు అది రెండుదళముల కింద విచ్చుకుంటుంది. అలా ఈ షోడశీవిద్య పైకి ఉచ్ఛరింపబడేప్పుడు విచ్చుకుని పైకి వైఖరిగా వినబడే సమయములో స్వరూపము రెండుగా మారితే, పదహారు రెళ్ళు ముప్పైరెండు అయి అమ్మవారి దంతపంక్తిగా ఉంటాయి. 


‘ద్విజపంక్తిద్వయోజ్వలా’ అనడములో ఒక రహస్యము ఉన్నది. ద్విజులు అన్న మాటకు అనేకమైన అర్థములు ఉన్నాయి. ద్విజులు అంటే బ్రాహ్మణులు, రెండుసార్లు పుట్టినవారు. లోకములో రెండుసార్లు పుట్టినవి కొన్ని ఉంటాయి. పక్షి రెండుసార్లు పుడుతుంది. ముందు గుడ్డుపుట్టి తరవాత పొదగబడి పక్షి అవుతుంది. బ్రాహ్మణుడు రెండుసార్లు పుడతాడు. ఒకసారి తల్లి కడుపులోనుంచి, రెండవసారి ఉపనయనము చేసి గాయత్రీ మంత్రోపదేశము చేసిన తరవాత ద్విజ సంస్కారము ఏర్పడింది అంటారు. యజ్ఞోపవీతము మెడలో వేసుకుని సంధ్యావందనము చేయని వాళ్ళకు ద్విజత్వం వర్తించదు. వేదవిద్యను వేదము చేత ప్రతిపాదింపబడిన సనాతనధర్మ భక్తి రహస్యములను, భక్తి జ్ఞానములను లోకమునకు వ్యాప్తి చేస్తారో, తాము అధ్యయనము చేసి తెలుసుకుని లోకమంతటికీ అందించాలనే తాపత్రయముతో ఉన్నవారు అమ్మవారి దంతములై ఉంటారు. 


పక్షి భక్తి, కర్మ అన్న రెండురెక్కలతో ఆకాశములో ఎగురుతుంది. ఒక గదిలో ఒక మఠములో ఎగురుదామని ప్రయత్నము చెయ్యదు. ‘ఆ’ అంటే అంతటా – ‘కాశ్’ అంటే ప్రకాశించడము భక్తి కలిగి ఉంటారు, అనుష్ఠానము తెలుస్తుంది. భక్తి కలిగి ఉంటే సరిపోదు అనుష్ఠానములో పెట్టాలి. అపారమైన భక్తి ఉన్నవారు పరమేశ్వరుని పూజ చేయకుండా ఉండలేరు. భక్తి ఉన్నది నిజమైతే కర్మాచరణముగా ప్రకటితము కావాలి. కాబట్టి వారు భక్తి, కర్మ రెండురెక్కలై విహరిస్తూ, బ్రహ్మముతో అనుసంథానమవుతూ నిరంతరము ఆకాశములో ఎగిరే పక్షి ఎటువంటిదో అమ్మవారి అనుగ్రహమును పొందిన వారి జీవితములు కూడా అలా ఉంటాయి. అలా అనుష్టించి అనుష్టించి భక్తిమార్గములో నడచి ద్వందములను దాటిపోయిన అందరు అమ్మవారి దంతములయి ఉన్నారు. ఎవరికైనా కూడా మొదటగా వచ్చిన పళ్ళు ఊడిపోతాయి మళ్ళీ రెండవసారి వస్తాయి. అమ్మవారి పళ్ళు ముప్పదిరెంటినీ మాతృకావర్ణములు అంటారు.


అ ఇ ఉ ఋ ఌ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ 

ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ స హ


మిగిలిన ఏ అక్షరములైనా వీటినుండి పుడతాయి. ఈ నామముతో అమ్మవారి దంత పంక్తికి నమస్కరించాలి.  


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: