13, అక్టోబర్ 2020, మంగళవారం

మహాభారతము ' ...49.

 మహాభారతము ' ...49. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


రాజసూయయాగంలో, నిండుసభలో తనను, పెద్దలను, నిందిస్తున్న శిశుపాలుని, శ్రీకృష్ణుడు చూశాడు. తనను యుద్ధానికి ఆహ్వానిస్తున్న ఆఉన్మాదిని, ఆవాచాలుని యిక ఉపేక్ష చెయ్యకూడదని తలచాడు. తాను సింహాసనం నుండి లేచి నిల్చున్న చోటు నుండే, యెంతో గంభీరంగా సభాసదులను చూస్తూ ' ఓ రాజన్యులారా, ఋషి పుంగవులారా, పెద్దలారా ! మీరందరూ ఈశిశుపాలుని అహంకార పూరితమైన, సంస్కార రహితమైన ప్రవర్తన కనులారా గమనిస్తూనే వున్నారుకదా ! శాంతస్వభావానికే, చెదలు పట్టించే సంస్కారి యీతడు. తాను పుట్టిన యాదవకులానికే కళంకంగా మారాడు. మాకు యెంతో కావలసినవాడు, మేనత్త కుమారుడైన యీశిశుపాలుడు అకారణంగా మాపై కత్తి గట్టాడు. మేము లేనిసమయంలో ద్వారక ప్రవేశించి అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. '


' అయినా మేనత్తకుమారుడనే ఒకే ఒక్క సానుభూతితో, నేను మా అత్తకు యిచ్చినమాట తప్పకుండా, ఈ శిశుపాలుని నూరుతప్పుల వరకు కాస్తానని చెప్పాను. అందుకే మిగుల శాంతస్వభావంతో యింతవరకు మౌనం వహించాను. మన అందరిమౌనాన్ని బలహీనతగా భావించాడు, యీ అహంకారి. నేటితో శిశుపాలుడు నాయెడ చేసిన నూరు తప్పులు పూర్తి అయ్యాయి. ఈతని కడతేర్చే సమయం ఆసన్నమైంది. '


అంటూ శ్రీకృష్ణుడు ఒక్కసారి తన హృదయం మీద కుడిచేతిని వుంచి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. వెంటనే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ యెక్కడినుంచో వచ్చి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని కుడి చేతి చూపుడువేలుకి చేరింది. ' శిశుపాలా ! మందభాగ్యుడా !! నీ నూరుతప్పులు కాచాను. ఇక భగవద్బంధువులను, భగవంతుని తూలనాడే వాళ్లకు పడే శిక్షను అనుభవించు. ' అంటూ సుదర్శనాన్ని శిశుపాలుని వైపు వదిలాడు.  


సభికులందరూ చూస్తుండగానే, సుదర్శనచక్రం సరాసరి వెళ్లి, శిశుపాలుని కంఠాన్ని ఒక పర్వత శిఖరాన్ని కోసినట్లు కోసి, తలను మొండెము నుండి వేరు చేసింది. శిశుపాలుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెనువెంటనే, ధర్మరాజు, శిశుపాలుని దేహానికి ఘనంగా దహన సంస్కారాలు యేర్పాటు చేయించాడు. అప్పటికప్పుడే శిశుపాలుని కుమారుని చేదిరాజ్యానికి పట్టాభిషిక్తుని చేయించాడు. 


తరువాత, యధావిధిగా శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం సమర్పించి రాజసూయయాగం పూర్తిచేశాడు ధర్మరాజు. విశేషమైన దానాలతో ధర్మరాజు బ్రాహ్మణులని, పెద్దలనీ సంతృప్తి పరచాడు. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన పెద్దలను, బలరామకృష్ణులు, మొదలైన బంధుమిత్రులను, ఉచితరీతిన సత్కరించి వారి ఆశీర్వచనాలు పొందాడు. యాగసమాప్తి సూచకంగా అందరికీ అవబృధస్నానం జరిగింది. అనగా పవిత్ర యాగజలాలు అందరి శిరస్సులపై సంప్రోక్షణా కార్యక్రమం జరిగింది..  


వచ్చిన అతిధులందరూ ధర్మజుని శ్లాఘిస్తూ , దీవిస్తూ, యెంతో ఆనందంగా వారి వారి రాజ్యాలకు తిరిగివెళ్లారు. శ్రీకృష్ణుడు ద్వారకకు బయలు దేరుతూ, ' ధర్మనందనా ! నీవు చక్రవర్తి హోదాలో యెల్లప్పుడూ జాగరూకతతో వుండు. ప్రజల మనసులలోనుండి యెన్నడూ దూరంకాకు. జనరంజకంగా పరిపాలించు. నీ ఆప్తులకు ఆశ్రయస్థానంగా వుండు. ఎవరికైనా యేదైనా కష్టంవస్తే, మాకు ధర్మజుడు వున్నాడు, అనే విశ్వాసంతో మెలిగేటట్లు వారిని ఆదరించు. ' అని హితోక్తులు పలికి, ద్వారకు వెళ్ళాడు.  


వచ్చిన వారందరూ వెళ్లిపోగా, దుర్యోధనుడు, శకుని మాత్రం మిగిలారు. కాలక్షేప నిమిత్తం మయసభ ప్రాంగణం లోనికి వీరిరువురూ వెళ్లారు.  


వ్యాసభగవానుడు తిరిగి వెళ్లబోతుండగా, ధర్మరాజు, ' మహాత్మా ! నాకొక సంశయం పట్టి పీడిస్తున్నది. ఈ శిశుపాలుని మరణంతో, వుపద్రవాలు అన్నీ తగ్గుముఖం పట్టినట్లేనా ? ప్రజలు నిశ్ఛయింతగా ఉండవచ్చా ? ' అని ప్రశ్నించాడు. అప్పడు వ్యాసుడు, ' యుధిష్ఠరా ! నీ కారణంగానే, ఈ ఉత్పాతాలు పదమూడు సంవత్సరాలు కొనసాగుతాయి. సమస్త క్షత్రియ వినాశనం జరుగుతుంది. దుర్యోధనుని అకృత్యాల వలన, భీమార్జునుల పరాక్రమం వలన, ఈ అకృత్యాలు కార్యరూపం దాలుస్తాయి. నీ చర్యలు కారణభూతంగా వుంటాయి. కాల మహిమను నిరోధించే శక్తి యెవరికీ లేదు. రానున్న దాని గురించి మనసు పాడిచేసుకోకు. ' అని చెప్పి, శిష్యులతో కూడి, వ్యాసుడు కైలాసపర్వతం వైపు తపస్సు కొరకై బయలుదేరి వెళ్ళాడు.


వ్యాసుని మాటలు మననం చేసుకుంటూ, తనవల్ల క్షత్రియవినాశనమా అని ధర్మజుడు బాధపడసాగాడు.  


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందామా !


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

9989692844

కామెంట్‌లు లేవు: