**అద్వైత వేదాంత పరిచయం**
3.2 వర్ణాల్లోని హెచ్చుతగ్గులు
ఈ వర్ణాల్లో హెచ్చుతగ్గులున్నాయా? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనగలమా? జాతిపరంగా ఏర్పడిన వర్ణాల్లో హెచ్చుతగ్గులు లేవు. పుట్టుకవల్ల మనకి గొప్పదనం రాదు. అందువల్ల జాతిబ్రాహ్మణుడు, జాతిక్షత్రియుడు, జాతివైశ్యుడు, జాతిశూద్రుడు అందరూ ఒకటే.
గుణం ఆధారంగా ఏర్పడిన వర్ణాల్లో హెచ్చుతగ్గులున్నాయి. ఉన్నత గుణం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా గౌరవిస్తుంది సమాజం. బ్రాహ్మణ గుణం అన్నిటికన్నా ఉత్తమమైనది. అందుకని గుణబ్రాహ్మణునికి నీరాజనాలిస్తుంది. ఏ సంఘమన్నా, గాంధీజీని దేశమంతా గౌరవించిందంటే అతని బ్రాహ్మణ గుణమే కారణం. అతని నిస్వార్థసేవ, అతని అహింసాతత్త్వం అందుకు ఉదాహరణలు. మనకి 63 నాయనార్లు ఉన్నారు. అందులో చాలామంది జాతి బ్రాహ్మణులు కాదు. కాని ఈ రోజుకి కూడా బ్రాహ్మణులతో సహా వారిని కీర్తిస్తారు. దానికి కారణం వాళ్ళు గుణబ్రాహ్మణులు అవటమే.
కర్మ ఆధారంగా ఏర్పడిన వర్ణాల్లో కూడా హెచ్చుతగ్గులు లేవు. అన్ని వృత్తులూ సమానంగా అవసరమే. రాజకీయంగా దురభిప్రాయం ఏర్పడినది కాని వారి సమాజసేవ కూడా బ్రాహ్మణుడు చేసే సేవతో సమానం. కొంతమంది దేశానికి సేవచేస్తే, కొందరు శాస్త్రాధ్యయనం చేయిస్తారు. విభిన్న వృత్తులని శరీరంలో విభిన్న భాగాలు చేసే విభిన్న పనులతో పోల్చవచ్చు. శరీరంలో ఏపని ముఖ్యం అంటే ఏం చెప్పగలం? మలమూత్ర విసర్జన పని వృధా అని చెప్పగలమా? లేకపోతే అది అసహ్యం అనగలమా? మూత్రపిండాలు పనిచేయటం ఆగిపోతే తెలుస్తుంది వాటి ప్రాముఖ్యత ఏమిటో. అలాగే అన్ని కర్మలూ ముఖ్యమే. అందువల్ల జాతిపరంగా, కర్మపరంగా బేధాలు లేవు గాని, గుణపరంగా ఉన్నాయి.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి