**దశిక రాము**
**సౌందర్య లహరి**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**
తొమ్మిది, పది శ్లోకాల భాష్యం - రెండవ భాగం
సాధరణంగా మనం ఎడమ ముక్కుతో గాలి పీలుస్తాం. శాంతంగా ఉన్నప్పుడు కుడి ముక్కుతో శ్వాస నడుస్తుంది. మన సాధన ఉన్నత స్థితిని చేరినపుడు క్రమశః రెండు ముక్కులతోనూ శ్వాస నడవడం, ఆ తరువాత శ్వాస నిలిచిపోవడం జరుగుతుంది. అంటే ఊపిరి బిగబట్టి కుంభకంలో ఉన్నామన్నమాట. ఆ స్థితిలో మనం ఉక్కిరిబిక్కిరి అవము. అద్వైత స్థితి కలిగినపుడు మన శ్వాస నడినెత్తిన ఉన్న నాడులను తాకడం, అక్కడ అంబిక పాదాలను స్పృశించడం ద్వారా అమృతపానం చేయడం అసంకల్పితంగానే సిద్ధిస్తుంది.
సాధనలోనే కాదు. సాధారణ జీవితంలో కూడా మహదానందస్థితిలో శ్వాస ఆగిపోయి ఒక ఒడలు ఎరగని స్థితిని పొందుతాం. ఇది కుంభకంలోని (ప్రాణాయామంలో గాలి బిగపెట్టడం) స్థితిని తలచుకొని “ఆహా! నడినెత్తిన ఎంత చల్లటి అనుభూతి!” అనుకొంటాము. అంటే అప్పుడు ఒక అమృతపు తుంపర నడినెత్తిన ఉన్న నాడులపై జాలువారిందన్నమాట. భక్తి మార్గంలో కూడా అంతర్లీనమైన ప్రకృతి యొక్క అంతరంగికానుభవాన్ని పొందవచ్చని చెప్పడానికే నేనీ విషయం చెబుతున్నాను.నాయనార్లు, ఆళ్వార్లు, మహారాష్ట్ర, బెంగాలు, ఔత్తరాహిక భక్తుల పాటలు వింటుంటే వారెంత యౌగిక రహస్యాలను అంతర్లీనమైన జ్ఞానంతో చెబుతున్నారో అర్థమవుతుంది.
ఇక్కడ కొంచెం కామానుభవం గురించి మాట్లాడవలసి ఉన్నది. కామేశ్వరీ కామేశ్వర తత్త్వాన్ని సూచించే ఇచ్ఛాశక్తి నిర్మల శృంగారమునకు చెందినది. స్వాభావికంగా సూక్ష్మమైనది. నావంటి సన్యాసులకు కామమనే పదం గురించి చెప్పడం కొంచెం ఇబ్బందిగానూ, అదే సభలో మాట్లాడవలసినపుడు అసభ్యంగా తోచినప్పటికి సృష్టిని నడిపే ప్రధానమైన విషయం అవడాన, సృష్టి ఇలా అల్లుకుపోయి ఉండటనికి కారణమయినందువల్లనూ మాట్లాడడంలో తప్పులేదని తోస్తుంది. అంబిక సాధకులకు వారి (భక్తి) ఆధ్యాత్మిక సాధన ఫలించినపుడు యోగ జ్ఞాన సాధకులకు లభించే శృంగారానుభవాన్ని ప్రసాదిస్తోంది. పరబ్రహ్మ ప్రపంచంగా పరిణమించడానికి ఈ ఇచ్ఛ లేక కామన కారణమయితే, జీవుడు పరబ్రహ్మలో లయమవడానికి ముందు, అనేక మంది మహాపురుషుల విషయంలో నాయికా భావాన్ని పొందడం కనిపిస్తుంది.
ఈ పరిణామ దశలోని సాధకుడు శక్తిలో లయమయ్యాడన్నమాట. అప్పుడు నాయకుడైన శివునిలో ఐక్యమవాలనే తీవ్రేచ్ఛ కలుగుతుంది. ఆ భావనల తీవ్రతతో సాధకుడు శివునకు సర్వస్వాత్మ సమర్పణ చేసుకోంటూ “నాదంటూ ఏదీ లేదు స్వమి, అంతా నీ దయ” అనే భావనలోనికి వస్తాడు. తరువాత ఆ భావము కూడా శివునిలో ఐక్యమైపోతుంది. అప్పుడిక శివుని ఇచ్ఛ మాత్రమే మిగులుతుంది. అంటే ఆవృత్త చక్షుడైన (తనలో తనను చూసుకోవడానికి ప్రయత్నించే) సాధకుడు, శివుడు ప్రపంచంగా పరిణమించే ప్రథమ దశలో ఐక్యమవుతాడన్నమాట. ఇక్కడ సాధకునికి సంబంధించినంత వరకూ, శివుడు తనను ప్రపంచంగా విస్తరించుకొనే పరిణామం బదులు, తనలో ఐక్యం చేసుకొంటాడన్నమాట. సామాన్యంగా ప్రవహించే ఒక వస్తువును ఆ ప్రవాహం ఒడ్డుకు చేరుస్తుంది. అదే లోపల సుడిగుండం ఉంతే, తనలోనికి తీసుకొంటుంది. ఇదే పైన చెప్పిన జీవాత్మ దశ.
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి