🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 48*
*****
*శ్లో:- అలసస్య కుతో విద్యా ?*
*అవిద్యస్య కుతో ధనం?*
*అధనస్య కుతో మిత్రం?*
*అమిత్రస్య కుత స్సుఖమ్?*
*****
*భా:- నేటి ఆధునిక సాంకేతిక యుగంలో అరచేతిలోనే అంతర్జాలం ఒదిగిన కారణంగా మానసిక, శారీరక, కాయిక శ్రమకు తావు లేకుండా పోయింది. యువతలో బాగా సోమరితనం ప్రబలమైంది. శ్రద్ధాసక్తులు, భక్తిప్రపత్తులు, దీక్షాదక్షతలతో నేర్వవలసిన "విద్య" "సోమరి"కి ఎలా అబ్బుతుంది? అబ్బదు. క్షణ క్షణంగా, కణం కణంగా ; మేధోమధనము, నిరంతరశ్రమలతో సాధ్యపడే "ధనం" "నిరక్షరకుక్షి" కి ఎలా లభిస్తుంది? లభించదు. డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు. హితుడు, సన్నిహితుడు,ఆప్తుడు,ఆత్మీయుడు అయిన "మిత్రుడు" అలాంటి "నిర్ధనుని"కి ఎలా దొరుకుతాడు ? దొరకడు. తల్లి,తండ్రి తరువాత లోకంలో మన సుఖాన్ని కోరుకొనేవాడు మిత్రుడొక్కడే. అలాంటి "మిత్రుడు లేనివాని"కి ఇహలోక, పరలోక సంబంధమైన "సుఖం" ఎలా ప్రాప్తిస్తుంది? ప్రాప్తించదు. కాన అన్ని అనర్థాలకు మూలం "అలసత్వమే". ఆ సోమరితనాన్ని వీడితే అన్ని సానుకూలంగా అమరుతాయి. " అలసత కూడ దించుకయు అధ్యయనంబున"; "కృషితో నాస్తి దుర్భిక్షం"; "శ్రమ ఏవ జయతే"; " కష్టే ఫలీ " అని పెద్దలు పదే పదే చెబుతుంటారు*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి