13, అక్టోబర్ 2020, మంగళవారం

అయిదు బాణాల కథ...

భీష్ముడు ఇచ్చిన అయిదు బాణాల కథ...



మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఇంతచేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కనీసం ఐదు ఊళ్లన్నా ఇప్పించమన్న కృష్ణుని రాయబారమూ చెల్లలేదు. దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ, ఒకో రోజూ గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది.


యుద్ధంలో తగులుతున్న ఎదురుదెబ్బలకి దుర్యోధనుడి దిమ్మ తిరిగిపోయింది. మనసులో కసి పెరిగిపోయింది. ఓ రోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు. ‘తాతా! నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి. కానీ ఐదుగురు పాండవులని చంపలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని అనుమానంగా ఉంది,’ అంటూ భీష్ముని తూలనాడాడు.


దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది. పాండవులని ఓడించేందుకు తాను శాయశక్తులా పోరాడుతున్నానని ఎంతగా చెప్పినా లాభం లేకపోయింది. దాంతో తన విల్లంబులోంచి ఓ ఐదు బాణాలు బయటకి తీశాడు భీష్ముడు. వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు. ఆ తర్వాత వాటిని దుర్యోధనునికి చూపిస్తూ- ‘నా శక్తి యావత్తూ ఈ ఐదు బాణాలకీ ధారపోశాను. వీటితో నువ్వు ఆ పంచపాండవులనీ సంహరించగలవు. రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలను అందిస్తాను,’ అని చెప్పాడు.


భీష్ముని చేతిలో ఉన్న ఐదు బాణాలని చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది. కానీ వాటిని ఆ రాత్రి భీష్ముని దగ్గర ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పలేదు. భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం. తెల్లవారేసరికి అతని మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా! ఆ బాణాలను పాడుచేసినా ఫర్వాలేదు... పోయిపోయి ఆ పాండవుల చేతికి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు కదా! అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకుని బయల్దేరాడు.


దుర్యోధనుడికీ, భీష్ముడికీ మధ్య జరిగినదంతా గూఢచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. రేపు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలనీ ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా! అనుకున్నాడు. ఈ ఆపాయానికి విరుగుడా ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకువచ్చాడు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారుండే ప్రాంతానికి దగ్గరలోనే విడిది చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడికీ, గంధర్వులకీ మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది. ఆ పోరులో అర్జునుడు, దుర్యోధనుడిని రక్షించాడు. అర్జునుడి సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు, తనని ఎప్పుడైనా ఓ వరం కోరుకోవచ్చునని చెప్పాడు. ఆ తతంగమంతా ఇప్పుడు కృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అర్జునుడిని పిలిచి తన మనసులోని మాటని చెప్పాడు.


 

అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు. ఈ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి. ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలికిడి వినిపించింది. ఎదురుగా చూస్తే.... అర్జునుడు! ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురుబొదురుగా ఉన్నారు. కానీ మర్యాద కోసం ‘ఏ పని మీద వచ్చావు?’ అంటూ అర్జునుడిని ప్రశ్నించాడు దుర్యోధనుడు.


‘ఒకనాడు నేను నీ ప్రాణాలను కాపాడినందుకు, ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాట ఇచ్చావు గుర్తుందా? ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ చేతిలో ఉన్న అయిదు బాణాలనీ నాకు ఇచ్చెయ్యి!’ అని అడిగాడు అర్జునుడు.


అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాశుడయ్యాడు. కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పదు. లేకపోతే తన దృష్టిలో తనే దిగజారిపోతాడు. అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు. భీష్ముడు రేపు ఉదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి వమ్మైంది. ఈ కథ మూలభారతంలో ఉందో లేదో కానీ జానపద కథల్లో మాత్రం బాగానే వినిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: