13, అక్టోబర్ 2020, మంగళవారం

రామాయణమ్...135

 

రామాయణమ్...135


ఆ రాక్షసులంతా వస్తూ వస్తూనే వేలకొలదిగా ఆయుధాలు రాముడి మీద ప్రయోగిస్తూ వస్తున్నారు.

.

శూలాలు,ముద్గరములు.ఖడ్గాలు,గండ్రగోడ్డళ్ళు,ప్రాసలు మొదలైన ఆయుధాలు ఆయన మీదికి దూసుకుంటూ వస్తున్నాయి.

.

ఒక్కడు రాముడు! వేలకొలదిగా రాక్షసులు.!!

.

చూసే సిద్ధ,గంధర్వ,మహర్షి గణాల వదనాలలో అయ్యో అనెడి జాలి చెలరేగింది హృదయాలలో విషాదము నిండింది.

.

రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు రాముడి శరీరానికి తగిలి ఆయన శరీరము పూచిన మోదుగ అయ్యింది, నీలాకాశంలో ప్రజ్వరిల్లే అగ్ని అయ్యింది,

 సహజ శాంత చిత్తుడు క్రోధమనస్కుడైనాడు. 

.

చేతిలోని కోదండము ఒక ఆట బొమ్మ అయ్యింది.

 దానిని ఎప్పుడు వంచుతున్నాడో, ఎప్పుడు గిరగిర తిప్పుతున్నాడో ఎవరికీ తెలియటంలేదు .

ఎవరికీ రాముడు కనపడటంలేదు రివ్వున గుండ్రముగా తిరుగుతున్న ఒకతేజఃపుంజముగాభాసిల్లుతున్నాడాయన.

.

ఆయన వింటి నుండి వెలువడ్డ బాణాలు

రాక్షసుల గుండెలనుండి దూసుకుంటూ వెళుతున్నాయి.

వారి శరీరాలను రాసుకుంటూ వెళుతున్నాయి.

వారి అవయవాలను కోసుకుంటూ వెళుతున్నాయి.

.

ప్రయోగించేది ఒక్కడే!..

 కానీ ఏ బాణముఎటునుండివస్తున్నదోఅర్ధముకాలేదేవరికీ ,

ఆకసమంతా రామధనుర్విముక్త శరాలే. 

రాక్షస సైన్యము నిలుచున్న ప్రదేశాన్నంతా కప్పివేశాయవి, 

.

శిరస్సులు బంతుల్లాగా గాలిలో తేలుతున్నాయి,

కవచాలు బద్దలవుతున్నాయి,

గుండెలు పగులుతున్నాయి.

.

ఎటుచూసినా భయంగా ,దీనంగా రోదించే రాక్షసులే కనపడ్డారు.

.

దెబ్బలకు తాళలేక పరుగెడుతుంటే వారిని ఉరికించి ఉరికించి మరీ కొడుతున్నాడు రాఘవుడు. 

.

దెబ్బలకు ఓర్వలేని సైన్యానికి ధైర్యము చెప్పి దూషణుడు వచ్చాడు రాముడి మీదకు,

.

దూషణుడు ఉన్నాడన్న ధైర్యముతో చావగా మిగిలిన వారంతా రాముణ్ణి మరల చుట్టుముట్టారు.

.

ధనుస్సు ఎక్కుపెట్టినది

,నారిసారించినది,

బాణము తోడిగినది ,

విడిచినదీ 

 ఏదీ కనపడటము లేదు ఎవరికీ!.

.

 కేవలము తమ తోటి వారు బాణపు దెబ్బకు కూలి నేలరాలటము మాత్రమే చూస్తున్నారు.

.

బాణము వదిలే శబ్దము ఉరుములాగా ఉన్నది,

అది లక్ష్యాన్ని ఛేదించి భూమిలో దిగబడుతున్నప్పుడు పిడుగులాగా ధ్వనిస్తున్నది .

ఇవి మాత్రమే ఏ కొంచెము కూడా విరామము లేకుండా వినపడుతున్నాయి.

 ,క్రమంగారాక్షసులసంఖ్యాబలముతగ్గిపోయింది,

దూషణుడు,త్రిశిరుడు,ఖరుడు,మాత్రమే మిగిలారు.


రామాయణమ్ 136


......................

దూషణుడు ,వీడు ఖరుడి సేనాపతి ,తనఎదురుగా సేన మొత్తము నాశనము అవ్వటాన్ని చూసి వాడిలో పట్టరాని ఆవేశము పుట్టింది.వజ్రాయుధాల లాంటి బాణాలతో ఒక్కసారిగా రామున్ని కప్పివేసాడు. వాడి ఆక్రమణను చూసి రాముడికి కోపము హెచ్చి ఒక అర్ధ చంద్రాకారపు బాణముతో వాడి ధనుస్సు త్రుంచి ఇంకొక నాలుగుబాణములతో వాడిరధానికి పూన్చిన గుర్రాలను చంపి వేసాడు.ఇంకొక బాణముతో సారధిని నేలకూల్చాడు ఈ పనులన్నీ ఒకదానివెంట మరొకటి రెప్పపాటుకాలములో పూర్తిచేసాడు రాముడు.

.

దూషణుడు ఇంకా రెచ్చిపోయాడు, రధము మీదున్న బంగారపు పట్టీలు,ఇనుపమేకులతో కూడి ఉన్న పరిఘను బయటకు తీసాడు .దానికి శత్రుసైనికుల శరీరాలను మర్దించినప్పుడు కారిన వస దట్టముగా అంటిఉన్నది.

.

తనమీదకు ఆయుధాన్ని పట్టుకొని దూకుడుగా వస్తున్న వాడి బాహువులను రెండింటినీ ఖండించి వేసాడు రామచంద్రుడు.రెండుచేతులూ నేలపై రాలగా వాడు నిలువలేక నేలపై దబ్బున పడిపోయాడు. 

.

ఎటు చూసినా రాక్షస కళేబరాలే వారి రక్తము ఏరులై ప్రవహిస్తూ నేలను బురదబురదగా చేసింది. సుందరమైన ఆ ప్రాంతమిప్పుడు నరకాన్ని తలపిస్తున్నది.

.

తన సేన మొత్తము ఆవిధముగా నాశనము అవ్వటము చూసిన ఖరుడు కోపము పట్టలేక రాముడి మీదికి దూసుకుంటూ వస్తున్నాడు, వాడి మార్గానికి అడ్డముగా త్రిశిరుడు అనే సేనాపతి వచ్చి నిలిచి ప్రభూ! నీకెందుకు శ్రమ నేనున్నానుగా అంటూ వాడిని త్రిప్పి పంపి,ముందుగా మృత్యువును తానె కౌగాలించుకోవాలన్నట్లుగా రాముడి తో యుద్ధానికి బయలు దేరాడు.

.

ఇద్దరి మధ్యా ఘోరమైన యుద్ధము జరిగింది. ఒక సింహానికి ఒక ఏనుగుకు మధ్య జరిగినట్లుగా ఉన్నదది.

.

త్రిశిరుడు ప్రయోగించిన మూడు బాణాలు రాముని నుదురుకు తగిలి బాధించాయి. వాడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, రా ! ఇదిగో నా బాణాలు కూడా స్వీకరించు నీవు! అంటూ వాడి వక్షస్థలం మీద బలంగా పద్నాలుగు బాణాలతో కొట్టాడు.వాడు తేరుకోకముందే వాడి సారధిని,గుర్రాలను ఒక్క వేటున నేలకూల్చాడు. అదిగమనించిన త్రిశిరుడు గాలిలోకి ఎగురబోగా వాడిగల శరములతో వాడి వక్షస్థలం బద్దలుకొట్టాడు. ఇంకొక బాణముతో వాడి శిరస్సు ఖండించి వేసాడు.

.

ఖరుడికి ఒక్కసారిగా గుండె జలదరించింది, ఈ మానవుడేమిటి?

 ఇలా ఒంటరిగా ఇన్నివేలమంది వీరాదివీరుల తలకాయలు ఎగురగొట్టడమేమిటి ?

అని వాడిలో ఒక రకమైన జంకు కలిగింది.అయినా మూర్ఖముగా కోపించి ధనుస్సు ఎత్తిపట్టుకొని నారి సారిస్తూ రాముడి మీదకు వెళ్లి అస్త్రాలతో రకరకాల విన్యాసాలు చేశాడు.

.

ఇద్దరి ధనుస్సులనుండి బయల్వెడలిన బాణాలు ఆకాశాన్నంతా కప్పివేసి సూర్యకిరణాలు జొరబడటానికి కూడా అవకాశము లేకుండా చేసివేసాయి.

.

దెబ్బతిన్న పులిలాగా ,తోకతొక్కిన త్రాచులాగా ,రేచుకుక్కలాగా ఖరుడు మీదమీదకు వస్తున్నాడు.

రాముడిని తీవ్రమైన బాణాలతో వేధిస్తున్నాడు వాడు..

.

 రాముడు అంతమందినీ ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి అలసి పోయి ఉన్నాడనుకొన్నాడు.

.

కానీ యుద్ధము జరుగుతున్నకొద్దీ అవక్రపరాక్రముడైన రాముని రణోత్సాహము ద్విగుణీకృతం అయ్యింది. 

.

ఒక సింహాన్ని మరొక సింహము ఎదుర్కొన్నట్లుగా ఉన్నది.

.

కొంతసేపటికి ఖరుడు రాముని చేతిలోని ధనస్సును ఒడుపుగా విరగగొట్టాడు.వెంటనే రాముడి కవచాన్ని కొట్టాడు.ఖరుడి దెబ్బకు స్వర్ణకాంతులీనే రాముని కవచము నేలమీద పడిపోయింది.వెంటవెంటనే ఎన్నో నిశిత శరాలతో రాముడిని పీడించాడు ఆ దానవుడు..

.

రాముడు కృద్దుడైనాడు,కాలరుద్రుడైనాడు,పొగలేకుండా భగ్గున పైకిలేచిన అగ్ని జ్వాల అయినాడు.

.

అగస్త్య ముని ఇచ్చిన వైష్ణవ ధనువు చేతబూనాడు, ఒక బాణముతో రధము కాడిని,నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను,ఆరవ బాణముతో సారధిశిరస్సును, మూడు బాణాలతో రధము ముందు భాగాన్నీ,రెడుబాణాలతో రధపు ఇరుసును,,ఇంకొక బాణముతో ఖరుడి ధనుస్సును,పదమూడవ బాణముతో ఖరుడిని తీవ్రముగా కొట్టాడు.

.

ఒక శ్రేణిలో ప్రయోగించబడిన బాణాల దెబ్బకు దిమ్మరపోయిన ఖరుడు అన్నీ కోల్పోయిన వాడై చేతిలో గద ధరించి రధమునుండి నేలమీదికి దూకాడు.

.

అలా నిలుచున్నా వాడిని చూసి ,

ఎందుకురా మీరు ఆకారణముగా శాంత స్వభావులైన మునులను హింసిస్తారు! మీరు పూర్వము హింసించి చంపిన మునలందరూ ఇదిగో మీ చావును పైనుండి కళ్ళారా చూడబోతున్నారు .ఇదుగో నీ తల తాటిపండు రాలినట్లు నేలరాలుతుంది చూడు అంటూ తన మీదికి వాడు విసిరిన గదను చూర్ణము కావించాడు.

.

ఇద్దరి మధ్యా నువ్వానేనా అన్నట్లుగా సాగిన యుద్ధములో రాముడు పైచేయి సాధించి ఒక బాణముతో వాడి రొమ్ముమీద కొట్టగా అది పిడుగులాగా వాడిని తగిలి వాడి ప్రాణాలు తీసి భూమిలో కూరుకుపోయింది,.

.

జనస్థానములో రాక్షసుల ఆటలిక చెల్లవన్నట్లుగా సింహములాగా నిలుచున్నాడు రాముడు,

.

ఇంతమంది రాక్షసులను కేవలము ఒక గంటాపన్నెండు నిముషాలలో రామసింహము వేటాడింది.


.

సహజనీల వర్ణుడు రాముడు ,ఆయన శరీరము నీలాకాశములో నిప్పుల ప్రవాహము కనపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది. నీలపుశరీరము మీద ఎర్రని రక్తపుచారికలు.అలా కనిపిస్తున్న రణకోవిదుడు రాముడిమీద ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు దేవతలు.

.

రండిరా ఎవడొస్తాడో చూస్తాను ! 

ఇప్పుడే వేట మొదలయ్యిది అన్నట్లుగా నిలుచున్నాడు ధనుస్సు చేతబూని శ్రీరామచంద్రుడు.


రామాయణమ్ 137

.........................

జగదేకవీరుడు రాముడు అంత స్వల్పకాలములో పద్నాలుగువేలమంది మహాబలవంతులైన రాక్షసులను సంహరించటము చూసిన ఋషులు ,మునులు ,దేవతలు ఆయనను సమీపించి అభినందనలతో ముంచెత్తారు;

.

అప్పుడు వారొక రహస్యాన్ని విప్పి చెప్పారు ,రామా నీవు శరభంగ మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు మునితో ఎదో మాట్లాడుతూ కనపడ్డాడు కదా ,ఆ విషయము ఏమిటనుకున్నావు ! నిన్ను ఈ ప్రాంతానికి ఎదోవిధముగా పంపితే ఎప్పటినుండో జనస్థానములో తిష్ఠ వేసుకున్న రాక్షసులను ఏరిపారేస్తావని తెలిపాడు.

.

 ఉపాయముతో నిన్ను ఇక్కడకు పంపమన్నాడు. ఆవిధముగానే నీవు ఇక్కడ నివసించేటట్లు మేము ఆలోచన చేసి నిన్ను పంపాము ,ఇప్పుడు జనస్థానములో ఒక్క రాక్షసుడు మచ్చుకైనా లేడు,

.

ఇక మేము నిశ్చింతగా, సుఖముగా ఈ ప్రాంతములో సంచరించగలము అని కృతజ్ఞతాపూర్వకముగా పలికి వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు.

.

యుద్ధపరిసమాప్తిని కాంచిన లక్ష్మణుడు వదినగారిని తీసుకుని గుహనుండి బయటకు వచ్చాడు. 

.

అన్నగారి పరాక్రమము ఆయనకు తెలియనిది కాదు . ఆయన చేసిన ఘన కార్యానికి అభినందనలు తెలిపాడు లక్ష్మణుడు.

.

లోకకంటకులైన రాక్షసులను ఒంటిచేత్తో మట్టికరిపించి సింహము లాగా నిలుచున్న వీరాధివీరుడైన భర్తను చూడగానే సీతమ్మ హృదయము ఉప్పొంగి కౌగలించుకొన్నది, ఏ మాత్రము అలసటలేని భర్తను చూసుకుంటూ మురిసిపోతూ మరలమరల ఆలింగనము చేసుకొన్నది వైదేహి.

.

ఒక్కడు మిగిలాడు ! పదునాలుగు వేలమందిలో ఒక్కడు తప్పించుకొన్నాడు. వాడి పేరు అకంపనుడు.

ఆ విధ్వంసాన్ని కన్నులారా చూసిన వాడి కాళ్ళు తడబడుతున్నాయి గుండెలలో దడ మొదలయ్యింది ఏదో విధముగా గుండె చిక్కబట్టుకున్నాడు వాడు ,వేగముగా లంకకు బయలుదేరాడు.

.

 వెళ్ళి వెళ్ళి రావణుడి ముందు కుప్పకూలాడు . భయంభయంగా చూస్తున్నాడు.

వాడి చెవులలో ఇంకా రామకోదండము వెలువరించిన శబ్దమే మారుమ్రోగుతున్నది,

వాడి కన్నులలో ఆ కోదండము చేసిన వీరవిహారమే ప్రతిఫలిస్తున్నది..

.

వాడు రావణుని ముందు నిలబడి ,

ప్రభూ మన రాక్షసులు పదునాలుగువేలమంది హతులైనారు,

ఖరుడు కూడా చనిపోయినాడు అని మాత్రమే పలికాడు.

.

 ఈ మాటలు విన్న వెంటనే రావణుడి కళ్ళు కోపముతో అరుణిమను సంతరించుకున్నాయి.


రామాయణమ్ 138

..................

భయముతో కంపించిపోయే అకంపనుడు రావణుడి ముందు నిలుచుని ప్రభూ జనస్థానములో మనవారందరూ చంపబడినారు.నేను మాత్రమే ఎలాగో తప్పించుకొని రాగలిగాను.అని చెప్పగా విన్న రావణుడు క్రోధముతో ఎవడు వాడు ఎచటివాడు నాచోటికి వచ్చి నన్నే ఎదిరించినవాడు,వాడికి పోగాలము దాపురించినది.

.

నాకు అపకారము చేసినవాడు ఇంద్రుడైనా,చంద్రుడైనా,విష్ణువైనా,జిష్ణువైనా యముడైనా సరే సుఖముగా ఉండలేడు.నీకేమీ భయములేదు అంత సాహసము చేసిన ధూర్తుడెవ్వడో నిర్భయముగా చెప్పు.అని కోపోద్రిక్త స్వరముతో పలికాడు.

.

వాడు రాముడు! సింగపు ఠీవి,వృషభపు మూపు,గుండ్రముగా దీర్ఘముగా ఉండే భుజాలు ,చూడటానికి గంభీరముగా ఉంటాడు.

వాడు దశరధ కుమారుడట.

.

వాడు దూషణ,త్రిశిర,ఖరులను,మన పదునాలుగువేలమంది సైన్యాన్నీ ఒక్కడే చంపివేశాడు.

.

అకంపనుడి మాటలు విన్న రావణుడు తోకతొక్కిన త్రాచులాగా బుస్సున లేచాడు, నేడే వాడి అంతు చూస్తాను అని బయలుదేరాడు. అప్పుడు అడ్డు తగిలిన అకంపనుడు ప్రభూ !రాముడిని పరాక్రమముతో జయించడము శక్యము కాని పని .వానిని ఉపాయముచేత వంచించి చంపవలె .

.

అందుకు నాకు ఒక మార్గము తోచుచున్నది .వానికి అందమైన భార్య ఒకతె ఉన్నది ,

ఆమెది అతిలోకసౌందర్యము.

ఆవిడ అతని ప్రాణము .

నీవుగానీ ఆవిడను అపహరించి తెచ్చితివా ! అది చాలును అతను బలహీనపడటానికి.

కృంగి,కృశించి,నశించి పోతాడు.

.

వాడిమాటలు విన్న రావణుడు వెంటనే ప్రశస్తమైన గాడిదలు 

 పూన్చిన రధమెక్కి మారీచాశ్రమానికి బయలుదేరాడు.

.

రావణుని చూడగానే మారీచుడు ఎదురేగి ఆసనము,ఉదకము ఇచ్చి సత్కరించి,

వచ్చిన పని ఏమిటి అని అడిగాడు.

.

మారీచుడా ! నేను ఒక కార్యము నిమిత్తము నీ వద్దకు వచ్చాను ,రాముని భార్యను అపహరించాలి .

అందుకు నీ సహాయము కావాలి అన్నాడు.

.

ఆమాట వింటూనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మారీచుడు. నీకు ఈ సలహా ఇచ్చిన వెధవ ఎవడు ? 

వాడు నీకు మిత్రుడి రూపములో ఉన్న శత్రువు.

.

సమస్త రాక్షస జాతిని నాశనము చేయాలని వాడు సంకల్పించుకొని నీకు ఈ సలహా ఇచ్చాడు.తక్షకుడి నోటినుండి కోరలు పీకమని నిన్ను ప్రేరేపించిన వాడు ఎవ్వడు.

.

రాముడనే మదగజాన్ని పట్టాలనుకొంటున్నావు !

,ఆయన నిద్రించే సింహము,

.

రాముడు అనే పాతాళలోకములోకి ఎందుకు జారిపడతావు అందులో ధనుస్సే పెనుమొసలి,

ఆయన భుజముల వేగమే బురద,

ఆయన శరాలే ఉత్తుంగ తరంగాలు,

యుద్ధమే జలప్రవాహము. 

ఎందుకు నీ అంతట నీవే మునిగిపోవాలనుకుంటున్నావు.

.

నా మాటవిని లంకకు తిరిగి వెళ్ళు నీ భార్యలతో క్రీడించి సుఖముగా ఉండు ,ఎందుకు లేనిపోని తలనొప్పి తెచ్చి పెట్టుకుంటావు..అని హితవు పలికిన మారీచుని మాటలు విని ఆ ప్రయత్నము మానుకొని లంకకు తిరిగి వెళ్ళాడు రావణుడు.

కామెంట్‌లు లేవు: