*"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."*
తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి
కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.
ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.
పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.
గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.
ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.
ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.
అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.
పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.
అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.
ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.
ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!
ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!
అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయి!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి.
ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.🙏👏🤝👍🦜
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి