------విశ్వనాథవారి ఆగ్రహం-----
"ప్రతివారూ వివేకవంతులే, అవివేకులు ఈ ప్రపంచంలో వుండడు. ఈ వివేకవంతులూ మూడు రకాలుగా వుంటారు. ప్రథములకు అసలు ప్రశ్నయే పుట్టదు, ద్వితీయులకు ప్రశ్న
కలుగుతుంది, కానీ సమాధానం స్ఫురించదు, ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుంది." అనేవారు విశ్వనాథసత్యనారాయణ గారు.
ఓరోజు ఓ కుర్రాడు ఈ కవిసామ్రాట్టును చూడటానికి వెళ్ళాడట. అక్కడ యింట్లో ఓపెద్దాయన
మామిడికాయముక్కలు కొడుతున్నారు. పనిమనిషేమో ననుకున్నాడు కుర్రాడు.
విశ్వనాథగారున్నారా? అనడిగాడు. ఆ పెద్దాయన కుర్రాణ్ణి ఓసారి పరీక్షగా చూసి లోపలికి రమ్మన్నారు. నీ పేరేమిటి? అనడిగారు.చెప్పాడాకుర్రాడు. కుటుంబం,వూరు యిలా ఒక్కొక్కటీ అడుగుతుంటే ఆ అబ్బాయికి విసుగొచ్చింది. ఇంతకీ విశ్వనాథగారు ఎక్కడా? అనడిగాడు. ఆయనతో నీకేం పని?అని ఎదురుప్రశ్న వేశారు ఆ పెద్దాయన. "వూరికే చూసిపోదామని" అన్నాడా అబ్బాయి. అంతే ఆయనకు కోపం తన్నుకొచ్చింది.
"వచ్చిన ప్రతివాడికీ నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేమి చూస్తావు నా పిండాకూడు ఎలాగూ వచ్చావు నాలుక్కాయలు తరిగేసి పో! నాక్కాస్త సాయం చేసినట్టైనా వుంటుంది." అని గయ్యిమన్నారు. దెబ్బకు కుర్రాడు ఆయన కాళ్ళమీద పడిపోయాడు.
క్షమించమని వేడుకున్నాడు. మరుక్షణంలో విశ్వనాథవారి మనసు వెన్నపూసైపోయింది."లేరా అబ్బాయీ... నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలిసినవాడినే గానీ చూడవలిసినవాడిని కాదురా" అంటూ అతడిని దీవించారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి