4, మే 2024, శనివారం

వరూధిని ఏకాదశీ

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 నేడు - వరూధిని ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*


*_వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత_*


చైత్ర మాసం, కృష్ణ పక్ష ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది.


పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది.


ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి, అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం.


*_పద్మపురాణ ప్రకారం._*


పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు.


ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.


అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట.


అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.


ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట.


అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో జరుపుకుంటారు.

 

*_భవిష్యోత్తర పురాణం_*


భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెప్పడం జరిగింది.


'ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో గౌరవాన్నీ, ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.


పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయణ చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. 


ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. 


ఏకాదశి రోజున ఉపవసించి, దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలనూ పొందగలరు. 

వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది.


*_హరినామ స్మరణం_*

*_సమస్తపాపహరణం_*


 *_𝕝𝕝 ॐ 𝕝𝕝  oఓo నమో లక్ష్మీనారాయణాయ నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*

కామెంట్‌లు లేవు: