8, జులై 2024, సోమవారం

శ్రద్ధగా గమనించాలి

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*



*🐄గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🐄*

"ఓసారి బుద్ధభగవానుడు శిష్యులతో కలిసి పర్యటిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం వేళ ఓ గ్రామంలో భిక్ష లభించలేదు. భగవానుడు సరేనంటూ నడక సాగించాడు. గ్రామీణుల ప్రవర్తన పట్ల బృందంలోని ఓ శిష్యుడు మనసు కష్టపెట్టుకున్నాడు. లోలోపల నిందించుకున్నాడు. జ్ఞాన సిద్ధుడైన గురుదేవుడి వెంట నడుస్తున్నా, తనలో తాను మథనపడుతున్నాడు. ఫలితంగా శిష్యుడిలో అశాంతి హెచ్చింది. క్రమంగా బుద్ధి వశం తప్పుతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న బుద్ధభగవానుడు అది గ్రహించాడు. శిష్యుడి వైపు తిరిగి, ‘దాహంగా ఉంది నీళ్ళు తీసుకురా!’ అంటూ ఆ శిష్యుణ్ని సమీపంలోని చెరువుకు పంపించాడు. వెళ్ళిన శిష్యుడు వెంటనే ఖాళీ పాత్రతో తిరిగి వచ్చాడు. తన కన్నా ముందు ఓ ఎడ్లబండి చెరువులోంచి వెళ్ళడం వల్ల నీళ్ళలో బురద తేలిందని చెప్పాడు. కాసేపు పోయాక ఆ శిష్యుణ్ని బుద్ధుడు మరోసారి పంపించాడు. అతడు తొలిసారి లాగే ఖాళీ పాత్రతోనే తిరిగి వచ్చాడు. ఇలా అయిదు సార్లు జరిగాక, ఆరోసారి తేట నీటితో వచ్చిన శిష్యుణ్ని చూసిన బుద్ధుడు, ‘చెరువులో రేగిన కలకలం వల్ల బురదనీరు తేట పడటానికి సమయం పడుతుంది. అలాగే కలత పడ్డ మానసిక స్థితి కుదుటపడేందుకు సహనం అవసరమవుతుంది. చెరువులో పాత్రను ముంచి, మరింత కల్లోల పరచడం వల్ల తేలేది బురదే! కల్లోలిత అంతరంగాన్ని రెచ్చగొడుతున్న కొద్దీ అధికమయ్యేది అశాంతే! నీరు తేటబారే వరకు ఓర్మిని వహించాలి. శ్రద్ధగా గమనించాలి. అప్పుడే స్వచ్ఛమైన జలం లభిస్తుంది. దాహార్తి తీరుతుంది. అంతరంగానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది’ అంటూ నవ్వుతూ పాత్రను అందుకున్నాడు."

కామెంట్‌లు లేవు: