8, జులై 2024, సోమవారం

రచనా వ్యాసంగము*

 *సంస్థలు - రచనా వ్యాసంగము*




సమాజంలోని సంక్షేమ సహాయ, సహకార సంస్థలు గత  సంవత్సరాలుగా  భౌతికంగా, ఆర్థికంగానే గాకుండా వాజ్ఞ్మయ పరంగా కూడా బ్రాహ్మణ సమాజ సేవ చేస్తున్నవి.  విద్య, ఆధ్యాత్మిక, సాంకేతిక, సాహిత్య,  సాంస్కృతిక అంశాలపై  ఎన్నెన్నో రచనలు అందిస్తూ సభ్యులకు, బంధు మిత్రులకు  సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక  రంగాలలో పూర్తి స్థాయి అవగాహన కలిగించడమే  *సంస్థల* ముఖ్య ఆశయము. 


వయోధికత, పరమపద ప్రాప్తి సృష్టిలోని జీవజాలమునకు తప్పనిసరి మరియు అనివార్యము, ఈ విషయమై మానవులు మినహాయింపు కాదు.  *సంస్థలలోని*  వయోధిక సభ్యులు ఎప్పుడైనా సేవా రంగము నుండి నిష్క్రమించు అవకాశములు మెండు.  సహాయ, సంక్షేమ సంస్ధలు భౌతిక, ఆర్థిక సేవలతో పాటు వాజ్ఞ్మయ  సేవలు కూడా కొనసాగించవలసి ఉంటుంది. *వయోధికుల నిష్క్రమణతో*    *సంస్థలలో*   వాంగ్మయ *సేవలు ఆగిపోకూడదు*. 


బహు అర్థములు కల వాంగ్మయ సేవలో రచనా సేవ కూడా ఒక భాగము. కావున సభ్యులందరూ ఈ విషయము గమనించి...రచనా నైపుణ్యము గల సభ్యులు ముందుకు రావల్సి ఉంటుంది... కార్యవర్గము వారిని ప్రోత్సహించ వలసిఉన్నది.


క్లుప్తంగా రచన అంటే ఏమిటో తెల్సుకుందాము. రచన అంటే మనలోని భావాలను వ్యక్తీకరించడము, ఆలోచనలను క్రమ పద్ధతిలో  వివరించడం. నిజానికి రచన అంటే వ్రాయడమొక్కటే కాదు. వ్యాస రచన, పద్య రచన, చిత్ర రచన, శిల్ప రచన ఆ మాటకొస్తే చక్కగా వంట చేయడం కూడా రచననే. 


ఈ విశ్వంలో ఒక విషయంపై అందరి వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండక పోవచ్చును.  భిన్న భిన్నంగా ఉండే అవకాశాలు కూడా హెచ్చు. అందుకే భిన్న భిన్న రచనలు. రచనకు ముఖ్యంగా ఉపయోగపడే సాధనాలు....స్పందన, అనుభూతి, ఊహా, ఉద్వేగం  అభిప్రాయాలు, ఆలోచనలు, భాష, వ్యక్తీకరణ నైపుణ్యము, ఇంకా చెప్పాలంటే కాల్పనిక అంశాలు కూడా రచనకు మినహాయింపు కాదు. 


*ఏదో ఒకటి వ్రాసేసి జనాల మీదకు త్రోసేసేది  మంచి రచన అనిపించు కోదు, దారుణము కూడా*.  సహాయ, సంక్షేమ, సహకార సంస్థలకు ఇటువంటివి అవసరము లేదు.  రచనల విషయాలలో  వస్తువు,  కౌశలము, విచక్షణ, విశ్లేషణ, అమరిక మరియు క్రమ పద్దతి అవసరము. రచయితలకు పలు ఆలోచనలు, పలు భావాలు పలు వైపుల నుండి వస్తూనే ఉంటాయి. వాటికి  మరింత  ప్రౌడిమ జోడించి అమరిక, విచక్షణలతో రచనలకు ఒక రూపం తేవాలి. *రచనలు సాంఘిక ప్రయోజనాలకు తోడ్పడాలి*. 


సభ్యులకు మరోసారి విజ్ఞప్తి సంస్థలలోని సభ్యులు రచయితలుగా ఎదగాలి.


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: