హిందూ పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవే !...
ఎరుక బ్రహ్మ మనియె యిల శంకరార్యులు
తెలివి బ్రహ్మమనుచు దెలిపె వ్యాసు
లెరుక తెలివి రెంటి నెరుగడు వేమన
విశ్వదాభిరామ వినురవేమ!
ఇది విశ్వాసాల యుగం కాదు. వాస్తవాల యుగం నిజ నిర్ధారణల యుగం. అన్వేషించి, శోధించి, సాధించే యుగం. వైజ్ఞానికంగా అన్నింటికీ అన్ని సాక్ష్యాధారాలు సంపాదించుకోగల యుగం. అబద్ధాల పొరలు తొలగిపోయి, నిజాలు ప్రకాశిస్తున్న కొద్దీ మనిషి వివేకం పెరుగుతూ వస్తోంది. ''ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్నీ భగవదనుగ్రహంతో ఈ మానవజాతికి అందాయి'' అని చెప్పే కట్టుకథలకు ఆధారాలు లేవు. కామన్ ఎరాకు ముందు కాలాన్ని Before Common Era గా, ఆ తర్వాత కాలాన్ని Common Era గా మనం విభజించుకున్నాం. దీన్నే లోగడ క్రీ.పూ - క్రీ.శ. అని వ్యవహరించే వాళ్ళం. దాని ప్రకారం జీవ పరిణామం ఏర్పడి మనిషిగా రూపొందిన నాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో జరుగుతూ వచ్చిన సామాజిక, చారిత్రక, రాజకీయ, ధార్మిక అంశాలనన్నింటినీ దాదాపు ఖచ్చితంగా బేరీజు వేసుకోగలుగుతున్నాం.
ఇక మనదేశానికి మాత్రమే పరిమితమై చూసుకుంటే కాలాన్ని ఐదు విభాగాలుగా చేసుకోవచ్చు. 1. సింధూ నాగరికతకు, పూర్వకాలం (3300 బీసీఈకి పూర్వం) 2.సింధూ నాగరికత కాలం (3300-1300 బీసీఈ) 3. అంధకార కాలం (1300-563 బిసీఈ) 4. బౌద్ధుల కాలం (563-480 బీసీఈ) 5. బ్రాహ్మణవాద ప్రారంభ కాలం (700-750 బీసీఈ). హరప్పా, మొహంజోదారోలో దొరికిన ఆధారాలు సింధూనాగరికతను తేటతెల్లం చేశాయి. సింధూనాగరికతకు, బుద్ధుడి కాలానికి మధ్య చాలా కాలం గడిచిపోయింది. దాన్ని చరిత్రకారులు అంధకార కాలంగా గుర్తించారు. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన ఏ ఆధారమూ ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత వచ్చింది బుద్ధుడి కాలం. మనకు తవ్వకాల్లో లభించిన శిల్పాలు, స్థూపాలు, ఆరామాలు, గుహలు వంటి ఆధారాలన్నీ బుద్ధయుగానికి సంబంధించినవే. తర్వాత బ్రాహ్మణవాద యుగం ప్రారంభమైంది. బుద్ధుడి ఆరామాలు విగ్రహాలు మార్చి మార్చి ఏవిధంగా హిందూ ఆలయాలుగా, దేవతా విగ్రహాలుగా ప్రకటించుకున్నారో చరిత్ర చెపుతూ ఉంది. వాటి ప్రకారం హిందూ పురాణాలు ఎప్పుడు రాయబడ్డాయన్న దానికి ఆధారం దొరికింది.
హిందువుల వేదాలు 1700-1100బీసీఈ ప్రాంతంలో, ఉపనిషత్తులు 1250-600బిసీఈ మధ్యలో రాయబడ్డ తర్వాత.. జైన తీర్థంకరుడు మహావీరుడు 599-527 బీసీఈ మధ్య కాలంలో జీవించాడు. గౌతమ బుద్ధుడు 563-480 బీసీఈ మధ్య కాలంలో జీవించాడు. తర్వాత చాలా కాలానికి మౌర్య సామ్రాజ్యం విస్తరించింది (322-180 బీసీఈ). అశోకచక్రవర్తి 250 బీసీఈ ప్రాంతంలో రాజ్యమేలాడు. బౌద్ధాన్ని స్వీకరించి, దానికి విస్తృత ప్రచారం తీసుకొచ్చాడు. ఇప్పటికీ మన ప్రభుత్వ చిహ్నంగా ఉన్న ధర్మచక్రం ఆయనదే. దేశంలో బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, కట్టడాలు ఎన్నో కట్టించాడు. తర్వాత వచ్చిన మౌర్యవంశపు రాజులు కూడా ఆ పనిని కొనసాగించారు. అలా బౌద్ధం మనదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రజాదరణ తగ్గినా ఆ జీవన విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
ఇక పురాణాల విషయానికొస్తే...
అన్నీ బుద్ధుడి తర్వాతనే రాయబడ్డాయి. అంటే ఇప్పటికి 1600-500 సంవత్సరాలకు పూర్వం మాత్రమే రాయబడ్డాయి. అందులో మార్పులు, చేర్పులు, కూర్పులు వంటివెన్నో ఆ మధ్య కాలంలో చేయబడుతూ వచ్చాయన్న విషయం ప్రసిద్ధ చరిత్ర కారులంతా దృవపరిచారు. మార్కండేయ పురాణం 400-500 సీఈ (క్రీ.శ) రాయబడితే, కూర్మపురాణం 500-600 సీఈలో, వామన పురాణం 700 సీఈలో రాయబడ్డాయి. నారదపురాణం 700-800 సీఈలో అగ్ని పురాణం 700-1100సీఈలో రాయబడ్డాయి. ఇక భవిష్య, బ్రహ్మ, వైవర్త పురాణాలు కేవలం 520 సంవత్సరాలకు పూర్వం అంటే 1500 సీఈలో రాయబడ్డాయి.
భారతదేశ చరిత్ర అంటే...
చొరబాటుదారు లెవరెవరూ? వారి వారి రాజ్యస్థాపనలు ఎలా జరిగాయి? ఎంతెంత కాలం పరిపాలించారు - అనేది మాత్రమే కాదు, బహు ముఖాలుగా విస్తరిస్తూ వచ్చిన భారతీయ కళలు, సాహిత్యం, నిర్మాణాలు, మతాలు, నైతిక విలువలు. వీటన్నిటికీ వెన్నెముకగా నిలిచిన భారతీయ వైజ్ఞానిక ఆలోచనా ధోరణులు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. రాజకీయపరంగా ఒకప్పుడు గ్రీకులు, హుణులు, పఠాన్లు, మొగలులు, బ్రిటిషర్లు ఈ దేశాన్ని ఆక్రమించారు. నిజమే! కొందరు జనరంజకంగా కూడా పరిపాలించారు. అయినా కూడా ఇక్కడి ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని పూర్తిగా గెలుచుకోలేక పోయారు. అందుకే ఈ దేశంలో ఎన్నో ధర్మాలు, ఎన్నో విశ్వాసాలు, ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఏకకాలంలో విలసిల్లుతూ వచ్చాయి. ఒకప్పుడు బౌద్ధం వ్యాపించి ఉన్న రోజుల్లో వైదిక ధర్మం లేకుండా పోలేదు. ఇప్పుడు దేశంలో హిందువులు సంఖ్యాపరంగా అధికులైనంత మాత్రాన ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, జైన మతస్థులు లేకుండా పోలేదు. ఏది ఏమైనా, దేశం సమైక్యంగా ఉంటూ వచ్చిందన్నది చారిత్రక సత్యం!
హిందూ సంస్కృతి అతి పురాతనమైనదే కాని, అంతకన్నా పురాతనమైన సంస్కృతులు ప్రపంచంలో కొన్ని ఉన్నాయన్నది మరువకూడదు. ఆది శంకరుడు అద్వైతానికి రూపకల్పన చేసిన తర్వాతనే, హిందూ అంటే వైదిక సంస్కృతి బాగా విస్తరించింది. ఆది శంకరుడు (700-750సీఈ) దక్షిణ భారతదేశంలోని కేరళ-కొచ్చి ప్రాంతంలో జన్మించాడని చెపుతారు. అయితే ఆయన జీవించిన కాలం కచ్చితంగా నిర్ధారణ కాలేదు. కాని, అది చాళుక్యులు పరిపాలించిన కాలం అని తెలుస్తోంది. అప్పటికి ఉచ్ఛస్థితిలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయడానికి ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డారు. బౌద్ధం ఆత్మ లేదని చెపితే, ఈయన ఉందని ప్రతిపాదించాడు. బౌద్ధం దేవుడు లేడని అంటే ఈయన ఉన్నాడని వాదించాడు. బౌద్ధరచనలు, బోధనలు పాళి భాషలో సాగుతూ ఉంటే, ఈయన వైదిక మత ప్రచారం సంస్కృతంలో ప్రారంభించాడు. వేదాల, ఉపనిషత్తుల, భగవద్గీతల సారాంశాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ, భారత ఉప ఖండమంతా ప్రయాణించాడు.
'మీమాంస-అనేది ప్రచారంలోకి తెచ్చాడు. బౌద్ధం నిర్వాణ (LIBERATION) అని అంటే, ఈయన 'మోక్షం' అని అన్నాడు. వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్నవన్నీ 'ఆప్తవచనాలే' అని అన్నాడు. అదంతా గొప్ప 'జ్ఞాన సంపద' అని చెప్పాడు. చివరకు నేటి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కన్నుమూశాడు.
తర్వాతకాలంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రామానుజుడు (1017-1137సి.ఈ) రంగం మీదికి వచ్చాడు. శ్రీవైష్ణవంలో అతి ముఖ్యమైన 9రచనలు చేశాడు. అందులో గీతాభాష్యం, శ్రీభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత సారం, నిత్య గ్రంథం, శ్రీవైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం వంటివి ఉన్నాయి. రచనలకు, బోధనలకు ఈయన సంస్కృత భాషనే వాడాడు. వేదాంతాన్ని, వైష్ణవైద్వైతాన్నీ ప్రచారం చేస్తూ సుదీర్ఘకాలం 120ఏండ్లు జీవించి, చివరకు శ్రీరంగంలో కన్నుమూశాడు. శంకరాచార్య ఆరాధ్యదైవం శివుడయితే, రామానుజా చార్య ఆరాధ్య దైవం విష్ణువు. ఈ రెండువాదాలు వైదిక ధర్మంలోంచి వెలువడినవే అయినా, పూజించే దేవుళ్ళు వేరుకావడం వల్ల రెండుగా చీలిపోయిన వీరి అనుయాయుల మధ్య.. హోరాహోరిగా కొట్లాటలు జరిగేవి. చరిత్రకారుడు నీలకంఠ శాస్త్రి ఈ విషయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
ఆది శంకరాచార్యుని మించిన గురువు, వేదాంతి మరొకరు లేరని హిందువులు భావిస్తారు. కాని ప్రాచీన భారత చరిత్ర - సంస్కృతులపై పరిశోధనలు చేసిన వారి అభిప్రాయం వేరుగా ఉంది. ఆయన జీవించి ఉన్న కాలం కన్నా ఆయన మరణం తర్వాత అంటే దేశంలో మొగలులు ప్రవేశించిన 14వ శతాబ్దం తర్వాత - ఆయన జీవిత చరిత్రలు విరివిగా రాయబడ్డాయి. ఆదిశంకరుడి తర్వాత, ఆయన స్థానానికి వచ్చిన వారినందరినీ శంకరాచార్యగానే భావించేవారు. అందువల్ల ఆ జీవిత చరిత్రలు ఎవరివన్నది కచ్ఛితంగా తెలియదు. జ్యోతిర్ పీఠం (ఉత్తరం) శారదాపీఠం (పడమర) గోవర్ధన పీఠం (తూర్పు) కంచిపీఠం, బద్రి వంటి పీఠాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారిని ఇప్పటికీ శంకరాచార్య అనే పిలుస్తున్నారు. అందుకే తొలి శంకరాచార్యను ఆది శంకరాచార్య అని సంభోదిస్తారు. వీరు కర్మసిద్ధాంతాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, పంచాయతన పూజను పూర్తిగా సమర్థించారు. పంచాయతన పూజ అంటే - ఐదుగురు దేవుళ్ళను ప్రార్థించడం. విష్ణు, శివుడు, దుర్గ, సూర్యుడు, గణేషుడు. ఇందులో ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకుని పూజించుకోవచ్చు. దాన్ని ఇష్టదేవత - కుల దేవత అని అన్నారు. వీరిలో ఏకాదశి ఉపవాసాలు, కుంభమేళాలు ప్రారంభించింది మాత్రం శృంగేరి శారదా పీఠానికి 12వ గురువు అయిన విద్యారణ్య (మాధవ).
ప్రసిద్ధ చరిత్రకారుడు సురేంద్రనాథ్ దాస్ గుప్తా - ''ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసపీ'' - 5 సంపుటాలు ప్రకటించారు. వైదికులు మొదట బౌద్ధాన్ని అనుకరిస్తూ కాలక్రమంలో దాన్ని నాశనం చేస్తూ పూర్తి వ్యతిరేకులుగా ఎలా మారారో సోదాహరణంగా వివరించారు. ఉదాహరణకు బౌద్ధంలో నాగార్జునుడు ప్రతిపాదించిన 'శూన్యాన్ని' శంకరుడు 'బ్రహ్మ' అని అన్నాడు. శూన్యవాద, విజ్ఞానవాద బౌద్ధంలోని అంశాలే ఉపనిషత్తులలో కలుపుకున్నారని వివరించాడు. మహాయాన బౌద్ధంలోని అనేక విషయాలు శంకరుడు నేరుగా తీసుకున్న విషయాన్ని ఆయన ఆధారాలతో ధృవీకరించారు. సమదృష్టితో వాస్తవాల్ని వాస్తవాలుగా నమోదు చేసిన చరిత్రకారుడు సురేంద్రనాథ్ దాస్ గుప్తా (1887-1952) ఎస్.ఎన్.దాస్ గుప్తగా ప్రసిద్ధులు. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన ఈయన 1935-39 మధ్య కాలంలో రోమ్, బెర్లిన్, జురిచ్, పారిస్, ఇంగ్లండ్ వంటి ఒక డజను యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. రెండు పి.జి. డిగ్రీలు తీసుకున్నవారు ఉంటే ఉంటారు గానీ, ఈయన రెండు పీహెచ్‌డీలు కూడా తీసుకుని తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ తీసుకున్నాక, మళ్ళీ మరో పీహెచ్‌డీ కోసం కేంబ్రిడ్జి వెళ్ళారు. భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల క్షీణిస్తూ వచ్చింది. ధర్మాలలో మార్పులు, ఆరామాలలో మార్పులు ఎలా జరుగుతూ వచ్చాయో ఎస్.ఎన్.దాస్ గుప్త రచనలు తేటతెల్లం చేస్తాయి.
శబరిమల, తిరుపతి, తిరువనంతపురం, పూరీ, బద్రీనాథ్‌లలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నీ మార్పులకు గురైన బౌద్ధారామాలే నన్నది స్పష్టమవుతుంది. వందల సంఖ్యలో పురాతన హిందూ విగ్రహాలన్నీ మార్పులకు గురైన బుద్ధుడి విగ్రహాలేనన్నది రుజువవుతుంది. ఎవరి మత విశ్వాసాలు వారివే.. కానీ, నిజమైన చారిత్రక విశేషాలు వైజ్ఞానిక దృక్పథంతో అధ్యయనం చేయాలనుకునే వారికి ఈ దేశంలో ముడిసరుకు చాలా ఉంది.
....డాక్టర్ దేవరాజు మహారాజు
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
ది..02.10.2020.. నవతెలంగాణ దినపత్రిక నుంచి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి