6, అక్టోబర్ 2020, మంగళవారం

**అద్వైత వేదాంత పరిచయము*



1.2 కామ: :తర్వాత లక్ష్యం, కామ పురుషార్థ: ఒకసారి భద్రత ఏర్పరచుకున్నాక, మనం కామ పురుషార్థం గురించి ఆలోచిస్తాం. కామ: అంటే అన్ని రకాల సౌఖ్యాలు. ఇది భద్రత కాదు, సరదాకి చెందినది. ఈ సౌఖ్యాలు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కేవలం మనుగడ సాగడానికి సౌఖ్యాలు కాని, సరదాలు కాని అవసరం లేదు. అందుకని అవి అర్థ పురుషార్థాలు కావు, కామ పురుషార్థాలవుతాయి. మనకు హాయిగా, ఆనందంగా ఉండాలని ఉంటుంది. పాటలు,టీవీ కార్యక్రమాలు, నాటకాలు, సినిమాల లాంటివి ఈ కోవకు చెందినవి. ఒకసారి మన చుట్టుపక్కలవన్నీ ఆనందించేసాక, మనకి విసుగుపుట్టి, పరదేశాలకి వెళ్ళాలనుకుంటాము. ఈ పురుషార్థానికి అంతూపొంతూ ఉండదు.

  పశువులకి కూడా సౌఖ్యం కావాలి కాని ఆ సౌఖ్యం అంతర్భుద్ధితో ముడిపడిరది. ఎండగాఉంటే, జంతువులు సహజంగా, అంతర్భుద్ధి ప్రేరేపణతో నీడలోకి వెళ్తాయి. కాని మనిషి తన ఆనందాన్ని తన బుద్ధితో ప్రణాళిక చేసుకుంటాడు.అంటే ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదిచేస్తాడు. కాని వచ్చిన చిక్కేమిటంటే,చాలామందికి ధనాగమన తృష్ణ అంతులేకుండా ఉండటంతోవాళ్ళకి ఉన్న సమయమంతా ధనం వెంట పరిగెత్తడమే సరిపోతుంది. అంటే అర్థ పురుషార్థంతోనే సరిపోతుంది,కామ పురుషార్థం గురించి ఆలోచించే తీరికే ఉండదు.

అద్వైత వేదాంత పరిచయం

1.3 ధర్మ: దీన్ని కనబడని ఐశ్వర్యంగా వర్ణించవచ్చు. దీన్నే అదృష్టం అని కూడా అంటారు. 

  ఇది కంటికి కనబడకుండా మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఈ అదృష్టాన్ని మనం సన్మార్గంలో నడవటం ద్వారా పొందవచ్చు. దీన్నే పుణ్యం అంటారు.

  మనం పూర్వజన్మలో నడిచిన ధర్మ మార్గాన్ని అనుసరించే ఈ జన్మ ఏర్పడుతుంది. అంటే మన పుట్టుక, మన తల్లిదండ్రులు, మనం పెరిగేచోటు ఇవేవీ మన చేతిలో లేవు.మన పూర్వజన్మ అదృష్టాన్ని బట్టి మనం ఐశ్వర్యంలో మునిగి తేలుతాం, లేదా బీదరికంలో కష్టాలు పడతాం.

  కాని మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మనం బాల్యంలో నడిచిన తీరు, అంటే మనం ధర్మమార్గంలో అర్థకామాలను పొందటానికి ప్రయత్నిస్తే, మన భవిష్యత్తు నిశ్చింతగా ఉంటుంది. అందుకని ధర్మాన్ని కూడా ఒక పురుషార్థంగా నిర్ణయించారు.

  అందుకే అర్థకామ ధర్మాలని, ధర్మార్థకామాలంటారు. అంటే ఈ మూడిరటిలో ధర్మం సూక్ష్మమైనదీ,చాలా శక్తివంతమైనదీ కూడా.ఈ మూడు పురుషార్థాలనీకలిపి ప్రేయస్‌ అంటారు.భోగ: అని కూడా అంటారు. కావాలని, ప్రయత్నం చేసి,ప్రణాళికలు వేసి సాధించే పురుషార్థాలని ప్రేయస్‌ అనీ, ఆ మార్గాన్ని ప్రేయో మార్గమనీ అంటారు.

1.4 ప్రేయోమార్గంలో దోషాలు : మనకి సాధారణంగా అనిపించవచ్చు ప్రేయోమార్గమే బావుంది కదా అని. కాని ప్రేయోమార్గంలో మనని మూడు దోషాలు బాధిస్తూంటాయి. 

1. బంధకత్వం: వస్తువులు, మనుష్యులు, విషయాలు, ప్రదేశాలు మనని బంధిస్తాయి. వాటిపై రాగం ఏర్పడితే అవి మనకి దూరమైతే బాధ, ద్వేషం ఏర్పడితే అవి మననుంచి దూరం కావాలనే ఆందోళన వేధిస్తూ వుంటాయి. 

2. అతృప్తికరత్వం:ఏది సాధించినా తృప్తి లేదు. ఇంకా ఇంకా అనే పంకా తిరుగుతూనే వుంటుంది. 

3.దు:ఖ మిశ్రితత్వం: సుఖంగా వుంది అనుకునే లోపే ఏదో లోటు, అశాంతి లేదా దు:ఖం వెన్నంటివుంటుంది. ప్రేయోమార్గంలో పారమార్థిక ఆనందము లేదు. అది కేవలం శ్రేయోమార్గము లేదా మోక్షం వల్లే లభ్యం అవుతుంది. ధర్మం ప్రేయోమార్గానికి, శ్రేయోమార్గానికి మధ్యసేతువు లాటిది.

అద్వైత వేదాంత పరిచయం

1.5 మోక్ష: ఇది నాలుగో పురుషార్థం. దీన్ని ముక్తి అని శ్రేయ: అని కూడా అంటారు.

  ఈ ముక్తి అనేది అంతర్గత స్వేచ్ఛ. బంధకత్వం నుంచి విముక్తి. ప్రేయస్సు లేదా ధర్మార్థకామాలనుంచి ముక్తి. మనిషి ప్రేయస్సుకి కాని, దేనికన్నా గాని ఎలా బందీ అవుతాడు? ఒక వస్తువు గాని, వ్యక్తి గాని మనని రెండు రకాలుగా బందీని చేయవచ్చు. మనం అమితంగా కోరే వస్తువు గాని, అమితంగా ప్రేమించే వ్యక్తి గాని దూరమైతే,ఆ ఎడబాటుని తట్టుకోలేక బాధపడతాము. ఒకవిధమైన శూన్యతాభావం కలుగుతుంది. ఒంటరితనం ముప్పిరిగొంటుంది. అలా అని, ఉంటే తృప్తిగా ఉంటామా? అదీ లేదు. కోరిన వ్యక్తి దగ్గర ఉన్నా కూడా అభద్రతాభావం.పోగొట్టుకుంటామేమోనన్న చింత, చెప్పినట్టు చేయకపోతే దిగులు. ఉన్నా లేకపోయినా బాధించేది ఏమిటి? పై మూడు పురుషార్థాలూ. డబ్బు లేకపోతే సంపాదించాలన్న తపన, ఉంటే అభద్రతా భావన. వీటి రక్షణ గురించి తపనే మనని వీటికి బానిసని చేస్తుంది.మోక్ష పురుషార్థం లేదా శ్రేయోమార్గం మనని బానిస నుంచి స్వామిని చేస్తుంది. అంటే సమత్వ భావన కలుగచేస్తుంది. సమత్వం అంటే వస్తువులు లేకపోయినా కృంగిపోనీయదు, ఉన్నా భయపడనీయదు. అర్థకామాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. శ్రేయోమార్గం అంతర్గతంగా శక్తిని, పరిపక్వతని ఇస్తుంది. మొదటి మూడు పురుషార్థాలూ ధర్మ-అర్థ-కామాలు ప్రేయస్‌లోకి వస్తాయి.అవి మనిషిని సంసారంలో బంధిస్తాయి. మోక్ష పురుషార్థం శ్రేయస్‌లోకి వస్తుంది. అది సంసారబంధం నుంచివిముక్తినిస్తుంది.ఈ నాలుగింటినీ కలిపి చతుర్విధ పురుషార్థాలు అంటారు.

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: