6, అక్టోబర్ 2020, మంగళవారం

*వైరాగ్యం అంటే ఏమిటి?*


              

*వైరాగ్యం* :- ఈ పదానికి కొందరు చెప్పే అర్థాల వల్ల చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 

దానితో తమకు తామే ద్రోహం చేసుకుంటున్నారు. 


వైరాగ్యం అంటే మనం అభిమానించే అన్నింటిని వదలిపెట్టి ఎక్కడికో - ఏ అరణ్యాలకో వెళ్ళిపోవటమని - అన్నింటినీ వదిలిపెట్టి హీనమైన - దయనీయమైన జీవితాన్ని గడపటం అని కొందరు భావిస్తారు. తిండి తినకుండా - బట్ట కట్టకుండా - ఇల్లు వాకిలీ లేకుండా ఉంటేనే వైరాగ్యమని కొందరు భావిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోలేక పిరికిపందల్లా పారిపోవటమే వైరాగ్యమని కొందరు తలపోస్తారు. ఇవన్నీ దురభిప్రాయాలు. అన్నింటిని వదలాల్సి వచ్చిందే అని విచారంతో - వాటినే తలచుకుంటూ జీవితాన్ని భారంగా - వేదనతో గడపటం - కోరిక ఉండీ అణచుకొని లోలోపలే కుమిలిపోవటం - తనకు కలిగిన దయనీయ పరిస్థితికి చింతిస్తూ సమాజాన్ని ద్వేషిస్తూ బ్రతకటం - ఇవి వైరాగ్యం కానేకాదు. ఇది రాగం. అన్నింటిపై బాగా రాగం ఉన్నదని తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి భావాలు - ఉద్దేశాలు ఎంతో హానిని కలిగిస్తాయి. 


*వైరాగ్యం అంటే వస్తువులపై - విషయాలపై - భోగాలపై రాగం - వ్యామోహం - ఆసక్తి తొలగిపోవటమే - లేకపోవటమే. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ వస్తువు - లేదా విషయం మనకు కావలసినంత ఆనందాన్నివ్వక పోయినా - లేదా దుఃఖాన్ని, బాధను కలిగిస్తుందనుకున్నా ఆ విషయం కోసం ప్రాకులాడం సరికదా వస్తున్నా వద్దనే అంటాం*.

 

*ఆ వస్తువు కోసం మరికొందరు ఎగబడవచ్చు. కాని మనకు మాత్రం దానిపై రాగం లేదు. వైరాగ్యమే ఉన్నది. ఉదా: చూడండి*. 


మనం శుద్ధ శాకాహారులం. Pure vegetarians.

 మనం వెళ్ళే త్రోవలో సీమపంది మాంసం కోసం జనం వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. కొందరు అయ్యో ఐపోయిందే - మనకు దొరక్కపోయెనే అని బాధపడుతున్నారు. మరి మనం కూడా బాధపడతామా? దానికై ప్రయత్నిస్తామా? 

ఒకవేళ ఎవరైనా అంత ఖరీదు కలిగిన దానిని Free గా ఇస్తామంటే తీసుకుంటామా? ఎందుకని? అది మనకు సంతృప్తి నివ్వదుగనుక, మనకు అసహ్యకరమైనది గనుక.


*అదే మనకు సంతృప్తి నిచ్చేదైతే మనమూ ఎగబడతాం. ఈ లోకంలోని వస్తువులు - విషయాల కోసం అందరం ఎగబడుతున్నాం - పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు? అవి మనకు సంతృప్తి నిస్తాయనే భావనతోనే. 

అయితే అవి మనకు సంతృప్తి నివ్వలేవు అని తెలుసుకుంటే - అసంతృప్తి కలుగుతున్నదీ అని తెలుసుకుంటే - ఎంతకాలం ఎన్ని భోగాలు అనుభవించినా, 

ఇంకా ఇంకా ధనాన్ని ప్రోగుచేసినా, అన్నీ వదలిపోవాల్సిందేనని తెలిస్తే - ఇవి మనతో వచ్చేవి కాదని తెలిస్తే, అప్పుడు మన బుద్ధి మారుతుంది. మన బుద్ధిలో అట్టి వివేకం కలిగినప్పుడు మనం వాటిపై వైముఖ్యం కలిగి ఉంటాం. అదీ నిజమైన వైరాగ్యం*. ఇవి అనిత్యమైనవి, శాశ్వత సుఖాన్నివ్వలేవు, మనను సంతృప్తి పరచలేవు అనే వివేకం కలిగితేనే వైరాగ్యం కలుగుతుంది.

 అలా వివేకంతో కలిగిన వైరాగ్యమే నిజమైన వైరాగ్యం. అట్టి వైరాగ్యం కలిగినందుకు బాధ - దుఃఖం ఉండవు. పైగా సంతృప్తి. ఎందుకంటే అవి మనకు ఇష్టంలేనివి గనుక. 

👏👏👏

కామెంట్‌లు లేవు: