6, అక్టోబర్ 2020, మంగళవారం

అనన్యభావన


అనన్యభావన అంటే ఒక్కరే వున్నారు, ఇద్దరు లేరు అని. ఇలాంటి అనన్యభావనా దశ పరమాత్మ విషయంలోనే ఉంటుంది. అనన్యమైన ప్రేమ అంటే, ప్రేయసీ, ప్రేమికులు లేకుండా పోయి, ఒక్క ప్రేమ మాత్రమే ఉండడం. అలాంటి ప్రేమని కలిగివున్నవాడే యోగి, భక్తుడు.


ప్రతీవారు తనని తాను తెలుసుకోవాలి. ఎప్పటిదాక తనని తాను తెలుసుకోవడం ఉండదో, అప్పటిదాకా దేనిని తెలుసుకోవడం వలన ఇక తెలుసుకోవలసినది అంటూ ఏదీ ఉండదో, దానిని తెలుసుకోవడం ఉండదు. పరమాత్మ శోధనలో వెళ్ళాలి అంటే ఏది నీ దగ్గర వుందో దాన్ని స్మరిస్తూ ఉండాలి, నీ నుండి దూరంగా ఏది వుందో, దాన్ని మరచిపోవాలి. అలా వున్నప్పుడు పరమాత్మని పొందాలి అనే వేదన మొదలవుతుంది.


సందేహంతో నిండిన మనసు నకారాత్మకంగా ఉంటుంది. శ్రద్ధతో నిండిన మనసు సకారాత్మకంగా ఉంటుంది. కోటిమంది పరమాత్మ వైపు ప్రయాణం ప్రారంభిస్తే, అందులో ఒక్కడు మాత్రమే సమర్పణ చేసుకోగలుగుతాడు. అతనంటాడు, నా సమర్ధత ఏముంది? నేను అసహాయుడను. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను నిన్ను ఏ విధంగా శోధించగలను? నేను నిన్ను ఎలా వెతకగలను? నాకున్న శక్తి చాలా తక్కువ. అదే సమర్పణ.

కామెంట్‌లు లేవు: