ఆదిపర్వము – 41
ద్రౌపది స్వయంవరం
తరువాత పాండవులు అక్కడి నుండి బయలుదేరి ధౌమ్యుని వద్దకు వెళ్లారు. అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు. ధౌమ్యుడు దానికి సమ్మతించాడు. పాండవులు, కుంతి ధౌమ్యుని ఆశీర్వాదం తీసుకొని, పాంచాల దేశానికి ప్రయాణం అయ్యారు. దారిలో వారు కొంతమంది బ్రాహ్మణులను కలిసారు. వారి వలన ద్రౌపది స్వయంవరం విశేషాలు తెలుసుకున్నారు. తాము కూడా ద్రుపద నగరానికి ప్రయాణం అయ్యారు. ఆ బ్రాహ్మణులతో కలిసి ప్రయాణించి ద్రుపద నగరం చేరుకున్నారు. ఒక కుమ్మరి వాని ఇంటిలో విడిది చేసారు.
ద్రుపద నగరంలో పాంచాలరాజు ద్రుపదుడు, తన కుమార్తె కృష్ణను అర్జునునికి ఇచ్చి వివాహం చెయ్యాలని సంకల్పించాడు. కాని పాండవులు లక్క ఇంటిలో మృతి చెందారని తెలిసి శోకించాడు. కాని పాండవులు ఎక్కడో బతికి ఉన్నారు అని పురోహితులు చెప్పడం వల్ల, అర్జునుని స్వయంవరానికి రప్పించడానికి, ఒక మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసాడు.
ఒక బలమైన ధనుస్సును తయారు చేయించాడు. ఆ ధనుస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఒక్క అర్జునుడు తప్ప వేరే వాళ్లు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం.
ఎందరో రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. వారిలో ఒకరిని వరించడానికి తెల్లటి పుష్పమాల ధరించి కృష్ణ సిధ్ధంగా ఉంది. ధృష్టద్యుమ్నుడు, స్వయంవరానికి వచ్చిన రాజులందరికి. మత్స్యయంత్రం గురించి వివరించాడు. ద్రౌపదికి, స్వయంవరానికి వచ్చిన రాజుల గురించి చెప్పాడు.
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన నూర్గురు కౌరవులు, వారి పక్కనే ఉన్న కర్ణ, అశ్వత్థామ, సోందత్త, శ్రుతసేనుడు మొదలైన వారు, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధార రాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షణుడు,ప్రద్యుమ్నుడు, కృతవర్మ, అనిరుద్దుడు, యుయుధానుడు మొదలైన వారు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేణుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔశీనరుడు, చేకితానుడు, శిశుపాలుడు, జనమేజయుడు, జయధ్రదుడు, బృహధ్రుడు, సత్యవ్రతుడు, చిత్రాంగదుడు, శుబాంగదుడు, భగీరధుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరజు మొదలైన రాజులు, ఇంకా యదు, వృష్ణి, భోజ, అంధక వంశ రాజులను, ఇంకా సంభావనల కోసం వచ్చిన బ్రాహ్మణ సమూహాలను చూపించాడు…
శ్రీ కృష్ణుడు, తన అన్న బలరామ సహితుడై స్వయంవరానికి వచ్చాడు. వచ్చిన వారినందరిని తేరిపార చూసాడు. బ్రాహ్మణ సమూహంలో, నివురు కప్పిన నిప్పుకణికల్లా ఉన్న పాండవులను గుర్తించాడు.
(మహాభారతంలో శ్రీ కృష్ణుని ప్రస్తావన మొట్ట మొదటిసారిగా ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో జరిగింది. అక్కడే మారు వేషాలలో ఉన్న పాండవులను గుర్తుపట్టడం కూడా జరిగింది. శ్రీ కృష్ణ పాండవ సమాగమానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది.)
కనుసైగతో, యదు రాజులందరిని స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. స్వయంవరం మొదలైంది. ఒక్కొక్కరే వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.కాని ఎవ్వరూ ఆ బలమైన ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు.కర్ణుడు, శల్యుడు లాంటి వీరులు ధనుస్సును ఎక్కుపెట్టినా మత్స్యయంత్రాన్ని భేధించలేకపోయారు.
అదిచూసి అర్జునుడు అన్నగారి వైపు చూసాడు. ధర్మరాజు వెళ్లమని సైగ చేసాడు. అర్జునుడు సభాస్థలి వైపు వెళ్లాడు. అది చూసి అక్కడ చేరిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు.
“మహా మహా వీరులే ఎక్కుపెట్టలేకపోయారు, వీడెందుకు వెళుతున్నాడో. వచ్చిన వాడు సంభావన పుచ్చుకొని పోక, ఇతనికెందుకండీ ఈ చేతగాని పనులు, బ్రాహ్మణులను నవ్వులపాలు చెయ్యడానికి కాకపోతే” అని తమలో తాము అనుకుంటున్నారు. కొందరు బ్రాహ్మణులు మాత్రం “బ్రాహ్మణుల పరువు నిలబెట్టాలి. నీకు శుభం జరుగుతుంది” అని ఆశీర్వదించారు.
అర్జునుడు ధనుస్సు దగ్గరకు వెళ్లాడు. ధనుస్సుకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసాడు. అలవాటైన వారు ఎత్తినట్టు ధనుస్సును ఎత్తి సంధించాడు. ఐదు బాణాలతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు, వారికి నోటమాట రాలేదు. బ్రాహ్మణులందరూ తమ ఉత్తరీయాలను, చెంబులను గాలిలో ఊపుతూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు.
వెంటనే ధర్మరాజు, భీముని అజునునికి సహాయంగా ఉంచి, నకుల సహదేవులతో తన విడిదికి వెళ్లిపోయాడు. ద్రుపద రాజ పుత్రి, ద్రౌపది మందగమనంతో వచ్చి, అర్జునుని మెడలో వరమాల వేసి, అర్జునుని తన భర్తగా స్వీకరించింది.
ఇది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరికి కోపం భగ్గుమంది. వీరందరికి దుర్యోధనుడు నాయకత్వం వహించాడు. ద్రుపదుని చూసి “స్వయంవరంలో తన విద్యాపటిమతో, మత్స్యయంత్రాన్ని భేదించి, ద్రౌపదిని గెల్చుకున్నాడు. ఇందులో ఈ బ్రాహ్మణుడి తప్పులేదు. కాని ఇంత మంది రాజులను, స్వయంవరానికి ఎందుకు పిలవాలి? ఎందుకు మర్యాదలు చెయ్యాలి? ఎందుకు అవమానించాలి? దీనికంతటికి కారకుడు ఈ ద్రుపదుడు. ఇతని బలాన్ని అణచాలి” అని అన్నాడు దుర్యోధనుడు.
ద్రుపదుడు అర్జునుని పక్కన నిలబడ్డాడు. కాని అక్కడ చేరిన బ్రాహ్మణులు “రండి రా రండి మనం తేల్చుకుందాము” అంటూ తమ ఉత్తరీయాలను ఎగురవేస్తూ ఆ రాజుల మీదికి ఎగబడ్డారు.
అర్జునుడు వారిని చూసి నవ్వాడు, వాఇంచాడు. భీముడికి సైగ చేసాడు. భీమార్జునులు విజంభించారు. శత్రూఅజులను చీల్చి చెండాడారు. భీముడు అక్కడే ఉన్న వృక్షాలను, స్తంభాలను పెకలించి వారి మీద వేసాడు.
ఇదంతా చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. తన అన్న బలరాముని చూసి “అన్నయ్య, చూసావా పాండవులు ఎలా విజృంభిస్తున్నారో. విల్లు చేపట్టి యుధ్ధం చేస్తున్నవాడు అర్జునుడు. ఆ పక్కనే ఒక చెట్టును పెకలిస్తున్నవాడు భీముడు. ఇందాక సభ నుండి వెళ్లిపోయిన వాడు ధర్మరాజు, నకుల సహదేవులు” అని పరిచయం చేసాడు.
బలరాముడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో లక్క ఇంటిలో చనిపోయారు అనుకున్న పాండవులు ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షం కావడం ఎంతో ఆనందం కలిగించింది బలరామునికి.
కర్ణుడు అర్జునునితో యుధ్ధం చేస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడికి ఇంత విలువిద్యా నైపుణ్యం ఎలా వచ్చిందో తెలియక సతమౌతున్నాడు కర్ణుడు.
“ఓ బ్రాహ్మణుడా, నాతో ఎదిరించి నిలవడానికి ఒక్క పరశురామునికి, దేవేంద్రునికి, అర్జునుడికి తప్ప వేరే వారికి సాధ్యం కాదు. నువ్వు ఎవరు?” అని అడిగాడు.Cont..
అర్జునుడు నవ్వుతూ “నేను వీరిలో ఎవ్వరినీ కాను కాని ముందు యుధ్ధం చెయ్యి” అన్నాడు. భీముడు శల్యునితో మల్ల యుధ్ధం చేసి ఓడించాడు. ఈ బ్రాహ్మణులతో యుధ్ధం ఏమిటని రాజులందరూ వెనక్కు తిరిగి వెళ్లిపోయారు.
కాని దుర్యోధనుడు మాత్రం “ఈ బ్రాహ్మణులు ఎవరు? ఎక్కద ఉంటారు? ఎక్కడ నుండి వచ్చారు?” అని విచారించడం మొదలుపెట్టాడు. ఇది చూసాడు శ్రీకృష్ణుడు. “సుయోధనా, ఇతరులు చెయ్యలేని కార్యాన్ని ఆ బ్రాహ్మణుడు చేసాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు, అంతే కదా. అతని గురించి మనకెందుకు, వెళ్దాం పదండి” అంటూ వారించాడు. దుర్యోధనుడు మిగిలిన రాజులు సరే అని వెళ్లిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి