6, అక్టోబర్ 2020, మంగళవారం

**సౌందర్య లహరి

 **దశిక రాము**


**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఎనిమిదవ శ్లోక భాష్యం - రెండవ భాగం


ఆమె పంచబ్రహ్మలు కోళ్ళు, ఆసనంగా గల సింహాసనంపై కామేశ్వరాంక నిలయ అయి ఎంతో రాజసంతో రాజ్య వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఇంద్రియాలను పూర్తిగా జయించి, శృంగారపు అంతరార్థం ఎరిగి, ఆ భావంలో లయమయ్యే పరిణతి కలిగి, ఆమె పరబ్రహ్మను సృష్టికార్యంలోకి మరల్చగలిగిన శృంగారాధిదేవతగా చూసాము, పంచబ్రహ్మాసనం మీద కూర్చుని దర్బారు నిర్వహించిన ఆమె, అంతఃపురంలో కామేశ్వరునితో కూడి మంచం పై కూర్చుని తల్లిగా దర్శనమిస్తుంది. దేవతలందరికంటే మహోన్నతురాలామె! దుర్నిరీక్ష్య. కానీ, పరిణత దశలోనున్న సాధకులకు కామేశ్వరుని మహాపతివ్రత అయిన ఆమె అమ్మగా దర్శనమిస్తుంది. *అమ్మేకాదు, నన్న కూడా ఆమే!!* ఆమె అనుగ్రహం, పుత్రులమైన మనకు ఆ మాతాపితరులతో ఐక్యాన్ని ప్రసాదించే వరకు వెన్నటి ఉంటుంది.


మందారం, పారిజాతం, సంతానం, కల్పకం, హరి చందనమని పిలవబడేవి స్వర్గలోకంలో ఉండే దేవతావృక్షాలు. అమ్మ ఉండే మణిద్వీపం అటువంటి దేవతా వృక్షాలు నిండిన అరణ్యం. మణిద్వీపంలోని భూమి మట్టితో నిండిలేదు. అదే ఒక పెద్ద మణి. ఆ ద్వీపంలో ఒక కదంబ (కడిమి) వృక్షాల ఉద్యానవనమున్నది. తోటను ఉద్యానవనమంటారు. ఇది మనకు కావలసిన రీతిలో మనం పెంచుకొన్న అరణ్యం. ద్వీపం అంచులలో దేవతావృక్షాల అరణ్యం. అమ్మ భవంతి సమీపిస్తుండగా కదంబ వృక్షాల ఉపవనం.


పట్టణాలను, పట్టణశివార్లను అభివృద్ధి చేయడానికి మనం లక్ష్యం లేకుండా చెట్లను నరికివేస్తాం. చెట్లు లేకుంటే జనజీవనానికే ఆపత్తు అన్న విషయం తరువాతనే అర్థమవుతుంది. మళ్ళీ వనమహోత్సవాలు మొదలుపెడతాం. ఈ ఉత్సవాలు కేవలం కాగితం వరకే పరిమితం. పూర్వకాలం మహానగరాల శివార్లలో పెద్ద అరణ్యాలు లేక తోటలు ఉండేవి. కోట కట్టబడిన ముఖ్య పట్టణాలలో ఇటువంటి వనాలు తప్పనిసరిగా ఉండేవి. ప్రకృతి పరిరక్షణతో పాటు శత్రువునుండి కోటను రక్షించడానికిది ఉపయోగపడేది.


అంబిక రాజప్రాసాదం కడిమిచెట్ల తోటలో కట్టబడింది. చింతామణులను ఉపయోగించి కట్టడం వలన మహత్తరంగా తళుకులీనుతూ ఉంటుంది. అంబిక మీదనే కేంద్రీకరించబడిన మన ఆలోచనలు రత్నాలవంటివి. అటువంటి ఆలోచనా రత్నాలతో మన తల్లికి గుడికట్టుకోగలిగితే అది కూడా చింతామణి భవనమే అవుతుంది. అందులో అమ్మ నివసిస్తుంది. అంటే మన ఆలోచనలలో వసిస్తుందన్నమాట. అంబిక మన హృదయంలో నిత్యమూ వసించాలంటే ఆమెను ఎక్కడో బయట మహోన్నతమైన రమ్యహర్మ్యంలో నివసిస్తున్నట్లుగా ధ్యానం చేయడం ఒక మార్గం. కానీ తుదిన ఆమె మనలోనే నివసించాలి. అభిరామభట్టు అనే మహాభక్తుడు, *నీ కోవెల ఇక్కడ ఉన్నదా, అక్కడ ఉన్నదా ? నా హృదయంలో ఉన్నదా ??* అంటాడు. ఇంకోపాటలో *తనను తాను అనేకంగా, ప్రపంచమంతా సర్వవ్యాపిగా ఆవిష్కరించుకొన్న ఆ తల్లి, ప్రపంచం నాశనమైపోయినపుడు పరమాత్మగా అయిపోతుంది. అటువంటి మహాతల్లి, ఎలాగోలా నా చిన్న హృదయంలో వసిస్తోంది* అంటారు.


సరి! చింతామణులతో కట్టబడిన భవంతిలో అంబిక శివాకారమైన మంచంపైన కూర్చుంది. అది పంచ బ్రహ్మాసనం. పంచబ్రహ్మలపైన పరబ్రహ్మ స్వరూపుడైన కామేశ్వరుడు లేక పరమశివుని సంస్థితి. ఆయన ఒడిలో అంబిక ఆసీనురాలయి ఉందట. *పరశివ పర్యంకనిలయ* అంకమంటేనే ఒడి అన్న అర్థముంది. పర్యంకమంటే అనేక అర్థాలున్నాయి. అయ్య, మంచం, నడుముకు చుట్టుకొన్న వస్త్రం, ఒడి అన్న అర్థాలున్నాయి. గూడుకట్టబడిన పల్లకి అని వేరోక అర్థముంది. కామేశ్వరుని ఒడి అంబికకు పర్యంకం.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: