6, అక్టోబర్ 2020, మంగళవారం

*🌷29-మంద్రగీత🌷*


 🕉🌞🌎🌙🌟🚩


*🥀చక్రభ్రమణము🥀*



*5. పనులు చేయుట మానినచో సమస్య తేలికపడునని భావించితివా? ప్రయత్నించిచూడుము. క్షణము కూడా కర్మాచరణము లేక నిలువలేవు.*



*నీవు చేయుచున్న పనులన్నియు నీ స్వభావము నుంచి వచ్చుచున్నవి గాని చేతులనుండి కాదు. నీ స్వభావమనగా ప్రకృతి. దానినుండి ఎప్పుడూ సత్వ రజో తమో గుణములు పుట్టుచుండును. వానినుండి నీకు గల గుణములు వివిధములుగా ఉత్పన్నమగుచుండును. నీలోని గుణముల ప్రేరేపణచే జరుగుచున్నవే నీవు చేయుచున్న పనులు. అనగా నీ తర్కమునకు, తెలివికి సంబంధించినవి కావు. నీవు చేయు పనులు నీచే చేయబడుచున్నవి గాని నీవు చేయుటలేదు. ప్రకృతి నీచే చేయించుచున్నది గాని నీ ఇచ్ఛతో వానికి సంబంధము లేదు. నీ గుణములను అనుసరించి ఇచ్ఛ అలవడును గాని ఇచ్ఛను అనుసరించి పనులు జరగవు. ఈ విషయమున ఎంత తెలివి గలవాడైనను అస్వతంత్రుడే.*



*6. స్వభావము ప్రేరేపించుచుండగా, తెలివి, తర్కము దానివెంట వచ్చుచుండగా నీవు పనుల వెంట ప్రేరేపింపబడుచున్నావు. ఇంకా చేయుట, మానుట నీకెట్లు లొంగును? నీవు ఆపగలిగినది భౌతిక శరీరమును మాత్రమే. కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, మాట, స్త్రీ పురుష వాంఛ, మల మూత్రాది విసర్జనము నీకు లోకువయై ఉన్నవి. వాని ప్రవృత్తులను బంధించితివనుకొనుము. మనస్సు నీ స్వభావముచే ప్రేరేపింపబడి స్మరించుచుండును. ఇట్లు కర్మేంద్రియములను బంధించి ఇంద్రియార్థములను అందనీక వానినే మనస్సుతో స్మరించుచుండుట డంబాచారము అగును గాని సంయమము కాదు. కనుక సంయమము వలన కలుగవలసిన శాంతి కలుగదు.*


 🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: