6, అక్టోబర్ 2020, మంగళవారం

మహాభారతము

 **దశిక రాము*


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


103 - అరణ్యపర్వం.


సావిత్రి, తనభర్త ప్రాణంకోసం తనను అనుసరించి వస్తున్నా, ఆమెమాటల చాతుర్యానికి యెంతో సంతోషించి, యేమాత్రం కోపం తెచ్చుకోకుండా, తన ప్రయాణం దక్షిణదిక్కుగా సాగిస్తూనే, ఆమెతో సంభాషించసాగాడు, యమధర్మరాజు.


' సావిత్రీ ! నీవు మాట్లాడుతున్న తీరు, నీ వినయం నన్నెంతో అలరించాయి. నీవు ఇంత దూరం నావెంటవచ్చావు గనుక, నా తృప్తి కోసం యేదైనా ఒకవరం కోరుకో, నీభర్త ప్రాణం కాకుండా . ' అని ఉదారస్వభావం చూపించాడు. దానికి వెంటనే సావిత్రి కూడా, యే మాత్రం ఆలశ్యం చెయ్యకుండా, ' నాకు నాభర్త ప్రాణాలే కావాలని మారాము చెయ్యకుండా, ' యెంతో తెలివితేటలతో, ' యమధర్మరాజా ! మా మామగారైన ద్యుమత్సేనుడు చాలాకాలంగా అంధత్వంతో బాధపడుతూ, రాజ్యభ్రష్టులై, అడవుల పాలయ్యారు. ఆయనకు దృష్టి ప్రసాదించి, ఆయన శక్తి సామర్ధ్యాలు తిరిగి పొందేటట్లు, వరమివ్వమని ' అడిగింది.


ఆమె కోరికను ఆమోదించి ' ఇక వెనుకకు వెళ్ళిపో సావిత్రీ ! నీవు అనుకున్నట్లే, నీ అత్తమామలకు మేలు జరుగుతుంది. ముందుకు వచ్చే ప్రయత్నం చెయ్యకు. ఇప్పటికే చాలా శ్రమపడి ఇంతదూరం వచ్చావు. ' అని మర్యాదగా హెచ్చరించాడు, యమధర్మరాజు, 


' ధర్మరాజా ! భర్త దూరమయిన యేస్త్రీకయినా శ్రమ వుంటుంది కానీ, నేను నా భర్త ప్రాణానికి దగ్గరగానే వున్నాను, నాకేమీ శ్రమ తెలియడంలేదు. మహాత్మా! మీరు సర్వ ప్రాణులనూ ఒకేవిధంగా చూస్తారు . ఎవరి కర్మ ఫలాన్ని బట్టి వారికి సముచితంగా న్యాయం చేస్తారనీ, అందుకే తమరికి ' సమవర్తి ' అనే పేరువచ్చిందని పెద్దలు చెప్పగా విన్నాను. ధర్మశాస్త్రాలలో చదివాను. మీరు నాకు సంపూర్ణ న్యాయం చేస్తారనే నేను ఆశిస్తున్నాను. ' అని యింకా తాను తృప్తి చెందలేదని, చెప్పకనే చెప్పింది, సావిత్రి యమధర్మరాజుకు.


సావిత్రి మాటలకు అతిదాహంతో ఎడారిలో వున్నవానికి చల్లని నీటి తెమ్మరలతో స్వాంతన చిక్కినట్లు, యముడు పరమానందం చెంది, నీ సంభాషణా చాతుర్యానికి నేను పులకించిపోతున్నాను. ఇంకొక్కవరం యేదైనా కోరుకో ! అది కూడా నీ పతి ప్రాణం తప్ప. ' అని రెండోవరానికి ఆస్కారం యిచ్చాడు, యమధర్మరాజు, సావిత్రికి.


సావిత్రి ఆ అవకాశం కూడా వదులుకోకుండా తన మామగారికి రాజ్యప్రాప్తి కలిగేటట్లు వరం ప్రసాదించమని అడిగింది. ' సావిత్రీ ! నీకోరిక తీరినట్లే. తొందరలో నీ మామగారు రాజ్యం తిరిగి పొందుతారు. ఇక నీవు వెనుకకు మరలు, యెంతమాత్రం ఆలశ్యం చెయ్యకుండా. ' అని తొందరపెట్టసాగాడు యముడు.


'యమధర్మరాజా ! మీకు తెలియని ధర్మాలు ఏమున్నవి ? ఉత్తమజాతి వారు, తాము తలపెట్టిన కార్యము మధ్యలో వదలిపెట్టి వెళ్లడం జరిగేపని కాదుకదా ! అందులోనూ నిత్య జపతపాదులతో, సర్వ దేవతలనూ సంతృప్తిపరచే నాలాంటి గృహిణికి, భర్తను వదలి వెళ్లే ఆలోచనేరాదు కదా ! మీరు ధర్మానికి ప్రతిరూపం. మీకు నేను చెప్పేంత దానినా ! నేను యిప్పుడు వెనకకు మరలితే ధర్మహానికదా ! ' అని ముందుకు రావడానికే నిశ్చయించుకున్నానని నర్మగర్భంగాచెప్పింది సావిత్రి.


' అహో ! సావిత్రీ ! సాధ్వీలలామా ! నీవు ఈ విధంగా మొండిగా ప్రయత్నిస్తున్నా నాకెందుకో నీపై కోపం రావడం లేదు. బహుశా, నీ పతిభక్తి,, నీవు నోచిననోములు అందుకు కారణం కావచ్చు. నా పరిధులను దాటి నన్ను నీకు సహాయం చెయ్యమని అడుగుతున్నావు. నీతో కఠినంగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటె, యేస్త్రీ అయినా తన భర్త శ్రేయస్సే ప్రధానంగా కోరుకుంటుంది. నీవు అడుగుతున్నది, నీ పతి ప్రాణాలు. నీ భర్త ప్రాణాలు నీకు యివ్వలేక పోయినందుకు నాకు బాధగా వున్నది. అందుకే, మూడవవరాన్ని కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. అదికూడా నీ పతిప్రాణాలు తప్ప. కోరుకో ! ' అని సావిత్రికి యెంతో వాత్సల్యంగా చెప్పాడు యమధర్మరాజు.


యమధర్మ రాజు చూపించిన ఆదరానికి సావిత్రి ఆనందించి, ' స్వామీ ! మా తండ్రి మద్రదేశాధిపతి అశ్వపతికి పుత్రసంతానం లేదు. ఆయనకు నూర్గురు పుత్రులు కలిగేటట్లు అనుగ్రహించు. ' అన్నది. ' సరే ! నీవింక వెనుదిరుగు సావిత్రీ " అన్నాడు, యముడు.


వెంటనే సావిత్రి చేతులు జోడించి, ' మహాత్మా ! మీరు ఇంత ఉదారస్వభావులు కాబట్టే, ధర్మ ప్రభువులుగా, ధర్మాన్నే పేరులో పెట్టుకుని యమధర్మరాజుగ శోభిస్తున్నారు. తమవంటివారి పర్యవేక్షణలోనే, పంచభూతాలు గతి తప్పకుండా వున్నాయి. సాగరాలు కట్టలు దాటడం లేదంటే, అవి తమ కనుసన్నలలో వుండడం వలననే, అగ్ని ప్రకృతిని భ్హీభత్సం చెయ్యని కారణం, వాయుదేవుని విజృంభణ లేకపోవడానికి కారణం, వారంతా నీ పర్యవేక్షణలో వుండడం వలననే ! సమవర్తీ ! మీలాంటి వారి వలననే విశ్వమంతా ప్రశాంతంగా గతి తప్పకుండా వున్నదికదా ! ' అంటూ సంభాషణ పొడిగిస్తూ, యముని వెంట మళ్ళీ బయలుదేరింది సావిత్రి.  


' సావిత్రీ ! ఆహా ! నీ పలుకులు కర్ణపేయంగా వున్నవి. ఎంతటి సుమధుర సంభాషణా చాతుర్యము. నన్ను చూడగానే, గుండె లయతప్పి, కుప్పకూలవలసిన మానవస్త్రీవి, ఇంత చక్కగా నాతో ధర్మ ప్రసంగాలు చెయ్యడం, నాకెంతో హాయి గొలుపుతున్నది. సరే ! మరొక వరాన్ని కోరుకో ! అనుగ్రహిస్తాను. ' అన్నాడు, యమధర్మరాజు.


' మహాత్మా ! ఇంతకూ ముందు మూడువారాలు యిస్తూ, నా పతిప్రాణం తప్ప వేరే యేదైనా కోరుకొమ్మన్నాడు. ఈసారి ఈ నాలుగవవరానికి, అట్టి నియమం పెట్టకుండా, కావలసిన వరం కోరుకొమ్మన్నారు. కృతజ్ఞురాలు స్వామీ ! మీ ఆజ్ఞ ప్రకారమే కోరుకుంటున్నాను. నా భర్త సత్యవంతుడు, తిరిగి ప్రాణం పొందేటట్లు వరమివ్వండి. ' అని ప్రాధేయపడింది.


యమధర్మరాజు, తాను చేసిన పొరపాటు గ్రహించి, ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి, సావిత్రిని అనుగ్రహించాడు. సత్యవంతుని పాశవిముక్తుడను చేశాడు. ' సావిత్రీ ! నీ భర్త ప్రాణాలు అనుగ్రహించాను. నీభర్తవున్న కళేబరం వద్దకువెళ్ళు. అతడు నిద్రనుండి లేచినట్లు కళ్ళు తెరుస్తాడు. అతనికి దివ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను. మీరిరువురూ 400 సంవత్సరాలపాటు జీవిస్తారు. వందమంది పుత్రులను కంటారు. అనేక యజ్ఞయాగాలు చేస్తారు. సావిత్రోపాఖ్యానం విన్నవారికి జన్మలో వైధవ్యం కలుగదు. ' జన్మ సావిత్రీభవ ' అనే ఆశీర్వాదం నీవలన లోక ప్రసిధ్ధం అవుతుంది. శుభం భూయాత్. ' అనిపలికి అంతర్ధానమైనాడు. 


సావిత్రి పరుగున సత్యవంతుడు పడివున్న చోటికివచ్చి, అతనితలను వడిలో పెట్టుకుని యమధర్మరాజు చెప్పిన మాటలు స్మరిస్తూ కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రనుంచి లేచినవాడి వలే కళ్ళుతెరుస్తూ, ' దేవీ ! గాఢనిద్ర పట్టింది. నిద్రలో ఒక నల్లని ధృఢకాయుడు నన్ను లాగుతున్నట్లు అనిపించింది. చాలా సేపు పడుకున్నాను కదూ ! ' అంటూ సావిత్రితో మాట్లాడుతుంటే, సావిత్రి ఆనందబాష్పాలు రాలుస్తూ, ' పదండి, ముందు ఆశ్రమానికి వెల్దాము. తరువాత తీరికగా మాట్లాడుకుందాము. ' అని బయలుదేరదీసింది .  


తానుకోసిన పళ్ళబుట్టను తమతో తీసుకెళదామని సత్యవంతుడు, బుట్టను అందుకోబోతుండగా, సావిత్రి వారించి, ఆతనికి తన చెయ్యి ఆసరాగా అందించి పట్టుకుని ఆశ్రమం వైపు దారితీసింది, పునర్జన్మతో మెరిసిపోతున్న, సత్యవంతునితో సహా. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: