6, అక్టోబర్ 2020, మంగళవారం

శివానందలహరి 17_ వ శ్లోకం

 దశిక రాము



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

తనకు ఈశ్వర సాక్షాత్కారం అయిన అప్పటికీ , ఈశ్వర పాద దర్శనం 

జరగడం కష్టంగా ఉందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు..


శ్లోకం 17


**ఫలద్వా పుణ్యానాం** 


**మయి కరుణ యా వా త్వయి విభో **

                         

**ప్రసన్నేపి స్వామిన్** 


**భవదమల పాదాబ్జ యుగళమ్**

                         

**కథం పశ్యేయం? మాం**


**స్థగయతి నమస్సంభ్రమజుషాం**

                         **నిలింపానాం శ్రేణిర్నిజ కనక మాణిక్య మకుటైః !!**


పదవిభాగం :

ఫలాత్ _ వా _ పుణ్యానాం _ మయి _ కరుణయా _ వా _ త్వయి

విభో _ ప్రసన్నో _ అపి _ స్వామిన్ _ భవదమలపాదాబ్జయుగళమ్

_ కథం _ పశ్యేయం _ మాం _ స్థగయతి _ నమసంభ్రమజుషాం _ 

నిలింపానాం _ శ్రేణిః _ నిజకనక మాణిక్య మకుటైః.


తాత్పర్యం : 

ప్రభూ, స్వామీ ! నేను చేసిన పుణ్య ఫలములవల్ల కానీ, నీకు నాయందు

కల దయవల్ల కానీ, నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా , నీ పవిత్ర

పాదపద్మ యుగళమును నేను ఎలా ౘూడగలను? నీకు నమస్కరింౘడానికై

తొందర పడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ

కిరీటములను మీ పాదములయందు మోపి , నాకు అడ్డుపడుతున్నారు.

(దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, ఎప్పుడూ నీ పాదములపై తమ స్వర్ణ 

రత్న కిరీటములు మోపి , సాష్టాంగ నమస్కారాలు చేయడానికి తొందరపడుతూ ఉంటారు. ఆ కిరీటములు నా దృష్టులను అడ్డగింౘ డంవల్ల, నేను నీ పాద పద్మాలను ౘూడలేక పోతున్నాను.


వివరణ :

శంకరభగవత్పాదులు, ఈశ్వరునికి ఇలా నివేదింౘుకుంటున్నారు. 

" స్వామీ, మహాదేవా ! నన్ను లాలనతో నాయనా ! రా , నా పాదాలు

దర్శింౘుకో " అని నీవు నా కనుల ముందు ప్రత్యక్షమయ్యావు. నీ 

ప్రసన్నతకు కారణం నేను పూర్వ జన్మలలో చేసిన పుణ్యఫలం కావచ్చు.

ఆమాట మాత్రం నేను గట్టిగా అనలేను. ఎందుకంటే ఆమాట నాలో

అహంకారమును మేల్కొలుపుతుంది. దేవతల గుంపు ప్రక్కకు తప్పుకుంటే

గానీ నీ పాద దర్శనం నాకు లభింౘదు. నీ పాద దర్శనం అయితేగానీ నేను 

ధన్యుణ్ణి కాజాలను అని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు.


పాదాలనే ఎందుకు ౘూడాలి ? అంటే భగవంతుని పాదాలు, ధర్మాచరణం

కోసం చరించేవి. అంతేకాదు. భగవత్పాదాలు మనకు అభయమునిచ్చేవి.

అంతేకాక ,వాంఛాధిక ఫలములను అందించేవి.


సౌందర్య లహరి లో శంకరులు అమ్మవారి పాదాలు, అభయాన్ని ఇచ్చి 

కోరినకోరికను మించిన ఫలాన్ని ఇస్తాయని ఇలా చెప్పారు.


              " భయాత్త్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం

                  శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ "


🙏🙏🙏


ధర్మము - సంస్కృతి

కామెంట్‌లు లేవు: