5, జులై 2023, బుధవారం

భారతదేశం ఒక్కటే కర్మభూమి

 


భూమిపైన మన భారతదేశం ఒక్కటే కర్మభూమిగా గుర్తించబడినది. మిగతా ఏ ప్రాంతములోనూ లేదా దేశాలలోనూ మన శాస్త్రాలు చెప్పిన కర్మాచరణ లేదు. అంతా అనాచారము. అసంస్కృతీప్రవర్తనలు. (మనదేశంలో ఇవి లేవని కాదు. ఇప్పుడు ఈ దుష్టసంస్కృతి ఏర్పడినది.) మన యొక్క ఏ మతగ్రంథాన్ని పరిశీలించినా.... భగవంతుని అవతారాలనుండి దేవతల తపస్సులు సహితము మన హైందవభూమియందే జరిగినట్లు మనకు తెలుస్తుంది. 


భగవద్గీత లో కూడా భగవంతుడు భరతవర్షమే కర్మభూమి అని, దేవతలు సహితము భరతవర్షంలో జన్మించాలని కోరుకుంటారని చెప్పటం జరిగింది. ఇలా ఎందుకంటే.... భూలోకంలో తప్ప మరేలోకంలోనూ కర్మాధికారం లేదు. చివరకు తపస్సు చేయాలన్నా కర్మ అవసరమే. అందువలన అలా కోరుకుంటారని భగవంతుని మాట. 


కర్మభూమియైన భరతవర్షంలో చేసిన కర్మ ఫలవంతమౌతుంది. ఇతరచోట్ల చేసిన కర్మ నిష్ఫలమౌతుంది. అందువలన కర్మాచరణకు మన కర్మభూమి దాటి పోరాదని శాస్త్రనియమం. ఎంతటి బ్రాహ్మణుడైనా వరుసగా మూడురోజులు పాటు సంధ్యావందనము చేయనిచో అతనికి మరలా శుభముహూర్తంలో ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది. అందువలన సముద్రాన్ని దాటి వేరే దేశాలకు వెడితే...  కర్మభూమి కానటువంటి ఆ దేశంలో చేసిన కర్మలు (సంధ్యావందనము సైతం కర్మయే) నిష్ఫలమౌతాయి. అందువలన మరలా ఆ వ్యక్తి ఉపనయనంచేత సంస్కరించబడాలి. అందుకే...  కంచి పరమాచార్య అనేక సందర్భాలలో సంధ్యావందనం చేయటం ముఖ్యమని, ఇతరదేశాలకు నీవు వెళ్ళటం అవసరమా? అని భక్తులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 


ఈ కారణాలవలన సముద్రం దాటటం వద్దని చెప్పటం జరిగింది.

కామెంట్‌లు లేవు: