5, జులై 2023, బుధవారం

పండ్ల బండి

పండ్ల బండి 

ఒక గ్రామంలో ఒక పండ్ల వర్తకుడు ఒక తోపుడు  బండినిండా అరటి పండ్లు యాపిల్ పండ్లు, బత్తాయిలు ఇలా రకరకాల పండ్లను పెట్టుకొని  వీధిలో విక్రయిస్తున్నాడట.  ఉదయం నుంచి మధ్యాన్నం వరకు విరామం లేకుండా పండ్లు అమ్మి గల్లా నిండా డబ్బులు  సంపాయించాడు. ఎండలో ఒకింత విశ్రాన్తి తీసుకుందామని దగ్గరలోని ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. ఈ ఎండలో ఎవరు గ్రాహకులు రారనే  భావనతో. అతనికి తన బండిమీద పండ్లు, డబ్బులు ఎవ్వరు తీసుకొని పొరనే నమ్మకం.  ఎందుకంటె అతడు రోజు అలానే చేసినా కూడా ఒక పండు పోలేదు ఒక రూపాయి పోలేదు.  అతనిని .చుస్తే సృష్టి కార్యం చేస్తూ అలసిపోయి మధ్యలో ఒకింత విశ్రాన్తి తీసుకుంటున్న వటపత్ర సాయి లాగ వున్నాడు.

కానీ ఈ విషయాన్ని రోజు గమనించిన ఒక దొంగ అవకాశం కోసం  ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు అతనికి ఆ బండివాని డబ్బులు కాజేయటానికి సరైన సమయం దొరికింది.  చిన్నగా అతను దూరంగా బండివాని కదలికలను గమనిస్తూ చిన్నగా అతను నిద్రలోకి జారుకోగానే పిల్లిలా నడుచుకుంటూ ఆ బండి వైపుకు బయలుదేరాడు.  ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద కోతి ఆ బండిమీదకు దూకి కొన్ని పండ్లను తింటూ, కొన్ని పండ్లను చేతులతో పట్టుకొని ఆ పండ్లను దొంగిలిస్తున్నది. అది గమనించిన మన దొంగగారు వేగంగా ఆ కోతిని అదిలిస్తూ ఆ బండి వద్దకు వెళ్ళాడు. అతని భయం ఏమిటంటే ఆ కోతి అక్కడి డబ్బులపెట్టే మీద పడితే ఆ డబ్బులని  తీసుకొని పొతే ఇన్నాళ్ల తన నీరిక్షణ అంతా వృధా అవుతుందని, అతని ఆందోళన. నిజానికి ఆ కోతికి అక్కడ డబ్బుల పెట్టె వున్నదని అందులో పండ్లకన్నా ఎంతో విలువైన ద్రవ్యం వున్నదని దానికి తెలియనే  తెలియదు. దానికి తెలిసినదల్లా తన ఎదురుగా వున్న పండ్లు మాత్రమే. కోతి డబ్బుల పెట్టె జోలికి వెళ్లనందుకు ఎంతో సంతోషించిన మన దొంగగారు ఆ కోతిని అదిలించి చిన్నగా డబ్బుపెట్టెను తెరచి అందులోని ద్రవ్యాన్ని చేచిక్కించుకున్నాడు.  అతను ఒక్క పండుకూడా ముట్టుకోలేదు. ఇలాంటి సంఘటనను మనం  ఊహించుకోవచ్చు. కొన్నిసందర్భాలలో జరిగి కూడా ఉండ  వచ్చు.

 ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ ప్రపంచంలోని సాధారణ ప్రజలు పైన చెప్పిన కోతిలాగా పండ్ల వెంట అంటే ఐహిక భోగాలకు, విలాసాలకు, సుఖాలకు ఆశ పడి వాటిని పొందుతూ అవే  వారి జీవిత లక్ష్యగా భావించి వాటితోటె సంతృప్త పడుతుంటారు. కానీ నిజమైన జ్ఞ్యాని ఈ ఐహిక భోగాలు కేవలం కొంత సమయం వరకు తృప్తిని ఇచ్చేవిగా తెలుసుకొని అనంతమైన బ్రహ్మ జ్ఞ్యానం శాశ్వితము నిత్యము అని తెలుసుకొని ఏరకంగా అయితే దొంగగారు డబ్బుల పెట్టె వెంట పడ్డారో అలానే జిజ్ఞాసువులు జ్ఞ్యాన బాండాగారమైన శాస్త్రాలను అంటే వేదాంత జ్ఞ్యానానికి సంబందించిన ఉపనిషత్తులు మొదలైనవి  సత్ గురువుల ద్వారా తెలుసుకొని నిత్యము, సత్యము శాశ్వితము అయిన బ్రహ్మ జ్ఞనాన్ని పొందుతారు.  ఎన్నో జన్మలనుంచి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు దయతో మనకు ఈ రోజు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నిరంతరం పరమేశ్వరుని సేవలో జీవితాన్ని గడుపుతేనే కానీ మనకు మోక్షము  లభించదు. ఈ విషయం ప్రతి సాధకుడు గమనించి ఆ అనంతుని వెంట వెంటనే పడి జన్మరాహిత్యానికై కృషి చేస్తే తప్పకుండా మోక్ష సిద్ది లభిస్తుంది. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనం నాది, మనది అనేది ఏదీకూడా నాది కాదు అది వస్తువే కానీ జ్ఞ్యానమే కానీ అంతా కూడా ఆ పరమేశ్వరుడిది  మాత్రమే అయి వున్నది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే అయి వున్నది.   ఏరకంగా అయితే ఆ బండివాడి పండ్లు, ద్రవ్యం అతనివే అయినట్లు.  మనవి కాని వాటిని మనం మనవి అని అనుకొంటూ వాటి కొరకు పరుగులు తీస్తూవున్నాము. నిజానికి ప్రతి సాధకుడు కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ జగత్తు మొత్తం జగదీశ్వరుడిదే అయి వున్నది.  నేను కేవలం ఈ జగత్తులోని వాటిని కొంతకాలం అనుభవించటానికి వచ్చిన ఒక అతిధిని  మాత్రమే. ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రతి సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు నిత్యా నిత్య జ్ఞ్యానం కలిగి సమర్పణ భావంతో మెలఁగి ఈశ్వరునితో సఖ్యత కలిగి ఈశ్వరునితో ఐక్యం చెందగలదు. ఇదే విషయాన్ని ఈశావాసోపనిషత్తు ఉటంకిస్తున్నది. 

ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్

తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్. 

కాబట్టి మనది కానిదానిని మనది అని అనుకోకుండా పూర్తిగా ఆ ఈశ్వరునిదే అనే భావము కలిగి కేవలం ఒక అద్దె ఇంట్లో నివసించే కిరాయిదారుడిగా మాత్రం ఈజగత్తుతో సంబంధం కలిగి సర్వే సర్వేత్ర ఆ ఈశ్వరుని తలుస్తూ జీవనాన్ని గడపాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 



1 కామెంట్‌:

NAGESWARA RAO TURAGA చెప్పారు...

దొంగని జిజ్ఞాసువుగాను, ద్రవ్యాన్ని జ్ఞానభండాగారంగాను ఉదహరించి బ్రహ్మజ్ఞానము పొందుట ఏరీతిని అని నుదుట కొంచెం రుచించలేదు. అంతేతప్ప ఎన్నుకున్న వస్తువు జీవితావసరం.